అంగన్‌‘వేడి’

ABN , First Publish Date - 2022-04-27T04:33:45+05:30 IST

జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక చిన్నారులు

అంగన్‌‘వేడి’

  • ఎండలకు ఉక్కిరిబిక్కిరవుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు 
  • అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్‌ కనెక్షన్‌, ఫ్యాన్స్‌, టాయ్‌లెట్స్‌ కరువు
  • ఇరుకు గదుల్లో ఇక్కట్లు.. అద్దె భవనాల్లో అవస్థలు 
  • ఆరుబయటే ఇమ్యూనైజేషన్‌, పౌష్టికాహారం
  • వేసవి సెలవులు ఇవ్వాలని కోరుతున్న అంగన్‌వాడీ టీచర్లు 
  • జిల్లాలో మీటింగ్‌ హాల్స్‌లేక చెట్ల కిందనే ప్రాజెక్టు సమావేశాలు 
  • గాలి వానొస్తే మండల పరిషత్‌ మీటింగ్‌ హాల్‌కు పరుగులు


జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక చిన్నారులు  విలవిల్లాడుతున్నారు. భానుడు భగభగ మండుతుంటే ఇరుకైన అంగన్‌వాడీ సెంటర్లలో అవస్థలు పడుతున్నారు. ఫ్యాన్లు లేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పక్కా భవనాలు లేక అనేక కేంద్రాలు అద్దె రూముల్లో కొనసాగుతున్నాయి.  కరెంటు, మరుగుదొడ్ల సౌకర్యం లేక టీచర్లు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. చోటులేక ఆరుబయటే ఇమ్యూనైజేషన్‌, పౌష్టికాహారం అందిస్తున్నారు. 


రంగారెడ్డి అర్బన్‌, ఏప్రిల్‌ 18 : పాపం... పసివాళ్లు... చిన్నగా ఎండ తగిలినా... బలమైన గాలివీచినా ఓర్చుకోలేరు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. ఇవన్నీ కష్టాలు దాటుకుని చిన్నారులు కేంద్రాలకు చేరుకుంటే.. అక్కడ సమస్యలు వారిని సతమతం చేస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు లేక ఉక్కపోతకు పిల్లలు చెమటలు కక్కుతున్నారు. వెలుతురు కూడా సరిగా లేక చీకటి గదుల్లోనే అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలు ఎండదెబ్బ తగిలి చిన్నారుల సంఖ్య తగ్గుతోంది. ఉదయం 10గంటలకే భానుడు భగభగమంటుండటంతో చిన్నారులు బయటకు రాలేకపోతున్నారు. మూడు నుంచి నాలుగేళ్ల చిన్నారులపై ఎండ ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఎండల కారణంగా అంగన్‌వాడీ టీచర్లు కూడా ఉక్కపోత భరించలేక పోతున్నారు. జిల్లాలో 1600 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 715 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. 318 కేంద్రాలు అద్దె భవనాల్లోనే నెట్టుకొస్తున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిధిలోని భవనాల్లో 567 కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా విద్యుత్‌ కనెక్షన్‌, ఫ్యాన్లు ఉన్న దాఖలాలు లేవు. అలాగే కేంద్రాల్లో మరుగుదొడ్లు కూడా కనిపించడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో సభ్యులు ప్రస్తావించారు. చిన్నారులకు ఆట, పాటలతో పాటు విద్యాబోధన అందించాల్సి ఉంటుంది. కానీ.. కేంద్రాల్లో వసతులు కొరవడటంతో చిన్నారుల పరిస్థితి అధ్వానంగా మారింది. 


అద్దెభవనాల్లో అవస్థలు

స్ర్తీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు ఏటా ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంది. అయినా అద్దెభవనాలు, ఇరుకు గదుల్లోనూ టీచర్లు, చిన్నారులు, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిధుల కొరత కారణంగా పలు అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు మంజూరు కావడం లేదు. తక్కువ అద్దె ఇస్తుండటంతో ఇరుకు గదుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వం ఒక్కో కేంద్రానికి నెలకు రూ.760 చొప్పున అద్దె చెల్లిస్తోంది. కనీసం సింగిల్‌ బెడ్‌ రూం ఉన్న ఇల్లుకు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు అద్దె ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్న అద్దె ఏ మూలకు సరిపోవడం లేదు. అంగన్‌వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు నిర్మించాలని 60 కేంద్రాలకు స్థలాలను గుర్తించారు. కానీ.. ఇప్పటివరకు ఒక్క భవన నిర్మాణానికీ నిధులు మంజూరు కాలేదని తెలుస్తోంది. 


వేసవి సెలవులు ఉండవా?

రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి. 42 డిగ్రీలకు తక్కువ కాకుండా ఎండ వేడిమి ఉంటుంది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు బయటకి వెళ్లొద్దని వైద్య నిపుణులు సైతం హెచ్చరికలు చేస్తున్నారు. ఇంత భారీ ఎండలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను రెండు పూటలా నడిపించడం ఏమిటని చిన్నారుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్‌వాడీ కేంద్రాలను  ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు ఒక్కపూట నడిపించేలా ఉత్తర్వులు జారీ చేయాలని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. 


చెట్ల కింద సమావేశాలు

జిల్లాలో 27 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లలో ఏడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల కింద 1,600 సెంటర్లు కొనసాగుతున్నాయి. 1,584 మంది అంగన్‌వాడీ టీచర్లు, 1,309 మంది ఆయాలు పని చేస్తున్నారు. ప్రతినెలా ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు ఒకేసారి పెద్దసంఖ్యలో సమావేశానికి హాజరవుతున్నారు. దీంతో ప్రాజెక్టు పరిధిలో సమావేశాన్ని నిర్వహించుకునేందుకు మీటింగ్‌హాల్‌ లేకపోవడంతో చెట్ల కింద మీటింగ్‌ పెట్టుకుంటున్నారు. జిల్లాలోని అన్ని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఈ సమస్య కనిపిస్తుంది. గాలి వర్షం వస్తే ఎంపీడీవో కార్యాలయంలోని మీటింగ్‌ హాల్లో సమావేశం కొనసాగిస్తున్నారు. జిల్లాలోని ఏడు ప్రాజెక్టుల పరిధిలో మీటింగ్‌హాల్స్‌కు భవనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. 


మరుగుదొడ్లు కరువు

అంగన్‌వాడీ కేంద్రాలకు వస్తున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు కనీసం బాత్‌రూం సౌకర్యం కూడా లేకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి కేంద్రానికి వచ్చిన బాలింతులు, గర్బిణులు మళ్లీ ఇంటికి నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. పిల్లల ఆలనాపాలన చూస్తున్న అంగన్‌వాడీ టీచర్లు కూడా మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారులు బాత్‌రూంకు వెళితే.. కేంద్రం బయటకు తీసుకు వచ్చి శుభ్రం చేస్తున్నారు. ఈ విషయంపై జడ్పీ సమావేశంలో మహిళా సభ్యులు ప్రస్తావించినా ప్రయోజనం లేకుండా పోయింది. 


కొన్ని కేంద్రాల్లో కరెంటు, ఫ్యాన్లు లేవు

కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో కరెంట్‌, ఫ్యాన్‌ సౌకర్యం లేక పోవడంతో పసి పిల్లలకు ఉక్కపోత పోయడం వాస్త వమే. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వేసవి సెలవులు, సమయం కుదింపు విషయాన్ని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. 715 కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటికి కరెంట్‌ సౌకర్యం లేదు. 

- మోతి, జిల్లా శిశుసంక్షేమశాఖ అధికారి 


టాయ్‌లెట్స్‌ సౌకర్యం కల్పిస్తున్నాం

జిల్లాలోని అన్ని స్కూల్స్‌, అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయి లెట్స్‌ సౌకర్యాలు కల్పిసు ్తన్నాం. మొదటి విడతలో టాయిలెట్స్‌ ఏర్పాటు కోసం రూ. 3.5 కోట్లు మంజూరు చేశాం. స్వచ్ఛ భారత్‌ ద్వారా వీటి నిర్మాణాలకు నిధులు విడుదలవుతు న్నాయి. పక్కాభవనాల నిర్మాణానికి నిధులు ఇచ్చాం. త్వరలో పనులు ప్రారంభిస్తాం.

- తీగల అనితారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ 


అంగన్‌వాడీ కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి

వేసవిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో కరెంట్‌ సౌకర్యం లేక చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్‌ సౌకర్యం కల్పించి ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి. అలాగే బాత్‌రూమ్స్‌ కట్టించాలి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటికి పక్కా భవనాలు కట్టించాలి.

- జి.కవిత, సీఐటీయూ జిల్లా కన్వీనర్‌ 


జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు

కేంద్రాలు : 1600

7నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు : 68,494

3-6 ఏళ్ల లోపు పిల్లలు : 29,007

గర్భవతులు, బాలింతలు : 21,646

సొంత భవనాలు ఉన్నవి : 715

అద్దె భవనంలో ఉన్నవి : 318

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిధిలో కొనసాగేవి : 567

ప్రాథమిక పాఠశాలల్లోకి ఇటీవల షిప్ట్‌ చేసినవి : 140

విద్యుత్‌ కనెక్షన్‌ లేనివి : 717

మంగళవారం నమోదైన ఉష్ణోగ్రత : 41.1 డిగ్రీలు

Updated Date - 2022-04-27T04:33:45+05:30 IST