ఆరుతడి పంటలకు విత్తనాలకు కరువు

ABN , First Publish Date - 2021-12-09T05:53:11+05:30 IST

ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనబోమని వరిసాగును తగ్గించాలని సూచిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఆరుతడి పంటలు సాగుచేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే పంట మార్పిడి చేద్దామన్న రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో లేవు.

ఆరుతడి పంటలకు విత్తనాలకు కరువు

ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్న రైతులు

అధిక ధరలకు విక్రయిస్తున్న ప్రైవేట్‌ వ్యాపారులు

విత్తనాలను సరఫరా చేయని విత్తనాభివృద్ధి సంస్థ

విధిలేని పరిస్థితిలో వరిసాగుకే మొగ్గుచూపుతున్న రైతులు

నిజామాబాద్‌, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం యాసంగిలో ధాన్యం కొనబోమని వరిసాగును తగ్గించాలని సూచిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు ఆరుతడి పంటలు సాగుచేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే పంట మార్పిడి చేద్దామన్న రైతులకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో లేవు. దీంతో ఇతర ప్రాంతాలకు వెళితే తప్ప విత్తనాలు దొరకడంలేదు. ప్రభుత్వం ముందస్తు నిర్ణయం తీసుకోకపోవడం వల్ల విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కూడా కావాల్సిన విత్తనాల సరఫరాలేదు. జిల్లాలో ఎక్కువగా సాగుచేసే విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు వారి సాగువైపే మొగ్గుచూపుతున్నారు.

రైతులకు అవగాహన సదస్సులు..

 జిల్లాలో వరికి బదులు ఆరుతడిపంటలు సాగుచేయాలని అన్ని గ్రామాల పరిధిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రైతు సభలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏయే పంట వేస్తే రైతుకు లాభం ఉంటుందో సమావేశంలో శాస్త్రవేత్తల ద్వారా వివరిస్తున్నారు. ఆ పంటలను సాగుచేయాలని కోరుతున్నారు. యాసంగిలో త్వరగా పంట చేతికి వచ్చే రకాలను వివరిస్తున్నారు. ఆ పంటలను సాగుచేయాలని కోరుతున్నారు. జిల్లాలో కొన్నేళ్లుగా  రైతులు 65 శాతానికి పైగా వరితప్ప వేరే పంటలు వేయడంలేదు. గతంలో కొన్ని పంటలు వేసిన పదేళ్లుగా ఆ పంటలను సాగుచేయడంలేదు. సాగునీరుతో పాటు కరెంటు అందుబాటులో ఉండడంతో ఆ పంటలను వేయడంలేదు. ప్రస్తుతం వరికి బదులు బోరుబావుల కింద ఆరుతడి పంటలను సాగుచేయాలని భావిస్తున్నా కావాల్సిన విత్తనాలు మాత్రం అందుబాటులో లేవు. ప్రభుత్వం ఆరుతడి పంటలను వేయాలని కోరుతున్నా విత్తనాభివృద్ధి సంస్థ మాత్రం జిల్లాలో సాగుచేసే పంటల విత్తనాలు మాత్రం సరఫరాలేదు. శనగ, జొన్న, జవారు, పెసర, కంది, మినుములు, నువ్వులు మినహా ఇతర విత్తనాలు అందుబాటులో లేవు. వీటిలో శనగ విత్తనాలు మాత్రమే ఎక్కువ మొత్తంలో సరఫరా చేస్తున్నారు. జిల్లాకు మూడు రకాలకు సంబంధించిన 21 వేల క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. మిగతా రకాలేవి 50 నుంచి వంద క్వింటాళ్లు మాత్రమే విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు సూచించే మొక్కజొన్న, సజ్జ, కూరగాయల సాగుకు సంబంధించిన విత్తనాలేవి అందుబాటులో లేవు. వేరుశనగ సాగుచేయాలని సూచిస్తున్నా జిల్లాలో ఆ విత్తనాల అమ్మకాలు లేవు. పక్కనే ఉన్న జిల్లాల్లో కూడా ఆ విత్తనాలు దొరకడంలేదు. విత్తనం అవసరమైన రైతులు మహబూబ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూల్‌, అనంతపూర్‌, కడప జిల్లాల నుంచి కొనుగోలు చేసి తెచ్చుకుంటున్నారు. జిల్లాలో సాగుచేసే విత్తనాలన్ని ప్రైవేట్‌ వ్యాపారుల వద్ద కూడా ఎక్కువగా అందుబాటులో లేవు. ఆరుతడి పంటలు వరికి బదులు సాగుచేద్దామన్న రైతులకు మాత్రం అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉండడంలేదు. ఒకవేళ కొందామన్న ప్రైవేట్‌ వ్యాపారులు ఎక్కువ రేట్లకు అమ్మకాలు చేస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేయాలనుకున్న ప్రభుత్వం ముందే విత్తనాలను అందుబాటులో ఉంచితే ఎక్కువ మంది వేసే అవకాశం ఉండేది. ప్రస్తుతం విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది రైతులు విధిలేని పరిస్థితిలో వరిసాగుకే మొగ్గుచూపుతున్నారు. విత్తనాభివృద్ధి సంస్థకు కూడా సరఫరా లేకపోవడంతో వేరే విత్తనాలను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచడంలేదు. జిల్లాలో ఆరుతడి పంటల కోసం శనగతో పాటు ఇతర విత్తనాలను సహకార సొసైటీల ద్వారా సరఫరా చేస్తున్నామని విత్తనాభివృద్ధి సంస్థ డీఎం విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. తమకు కార్పొరేషన్‌ నుంచి వచ్చిన విత్తనాలను జిల్లాలో సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-12-09T05:53:11+05:30 IST