అవినీతిపరులకు చుక్కలే!

ABN , First Publish Date - 2022-03-11T06:49:48+05:30 IST

అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి.. వ్యవస్థలను నిందిస్తున్న

అవినీతిపరులకు చుక్కలే!

  • ప్రజలు మా నుంచి ఇదే కోరుకుంటున్నారు
  • అక్రమార్కులు వేలకోట్లు దోచుకుంటున్నారు
  • శిక్షలు పడితే కులం, మతం వాడుకుంటారు
  • వీరికి న్యాయ వ్యవస్థపైనా నమ్మకం లేదు
  • దర్యాప్తు సంస్థలపై బురదజల్లే దుర్మార్గం
  • ఈ గెలుపు 2024 ఫలితాలకు సూచన: మోదీ


 

న్యూఢిల్లీ, మార్చి 10: అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి.. వ్యవస్థలను నిందిస్తున్న వారిని వదిలే ప్రసక్తి లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ‘అవినీతిని అంతం చేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను మేం నెరవేరుస్తాం’ అని ప్రకటించారు. తాజా ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో తాము సాధించబోయే విజయానికి సంకేతమని  ప్రకటించారు. బుధవారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయ ఆవరణలో జరిగిన విజయోత్సవ సభలో ప్రధాని ప్రసంగించారు. వ్యక్తులు, పార్టీల పేర్లు ప్రస్తావించకుండా.. ‘అవినీతిపరులు, మాఫియా ముఠాలను అంతం చేస్తాం’ అని ఉద్ఘాటించారు. ‘‘అవినీతిపరులను శిక్షించాలన్న ప్రజాకాంక్షను నెరవేర్చాలా... వద్దా’’ అని మోదీ ప్రశ్నించారు. ‘‘కొందరు దేశ సంపదను దోచుకుంటున్నారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన వారు ఒక్కటై... ఒక పద్ధతి ప్రకారం నిష్పాక్షికమైన, స్వతంత్ర దర్యాప్తు సంస్థలపైనా బురదజల్లుతున్నారు. వీరికి న్యాయ వ్యవస్థపైనా నమ్మకం లేదు. వేలకోట్ల అవినీతికి పాల్పడతారు. శిక్షలు పడితే... ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా ప్రాంతానికి చెందినందునే తమకు శిక్ష పడిందని నిందలు వేస్తారు. దేశంలోని అన్ని కులాలు, మతాలకు చెందిన వారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి అవినీతిపరులు, మాఫియా ముఠాలను మీరు దూరం పెట్టండి. దీనివల్ల అందరికీ మేలు జరుగుతుంది’’ అని పిలుపునిచ్చారు.



ఉజ్వల భవిష్యత్తుకు హామీ...

బీజేపీ పేదల అనుకూల, క్రియాశీల పాలనా విధానాలకు ప్రజలు బలమైన ఆమోదముద్ర వేసినట్లు ఈ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ప్రధాని అన్నారు. ఈ విజయాలు.. దేశ ఉజ్వల భవిష్యత్తుకు హామీ ఇస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘2017 ఫలితాలే 2019 ఎన్నికల ఫలితాలను నిర్ణయించాయని కొందరు రాజకీయ నిపుణులు 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటించారు. అదే కోవలో.. 2024 ఫలితాలను 2022 ఫలితాలు నిర్ణయించాయని మళ్లీ చెబుతారు’’ అంటూ నాలుగు రాష్ట్రాల్లో విజయాన్ని ‘జీత్‌ కా చౌకా (విజయాల బౌండరీ)’గా అభివర్ణించారు.


‘‘సరిహద్దులకు అనుకుని, పర్వతాలతో కూడిన ఒక రాష్ట్రం.. సముద్రతీరాన ఉన్న మరో రాష్ట్రం.. గంగమ్మ తల్లి ప్రత్యేక ఆశీస్సులున్న ఇంకో రాష్ట్రం.. ఈశాన్య సరిహద్దుల్లో ఉన్న మరో రాష్ట్రం.. ఇలా నాలుగు దిక్కుల నుంచి బీజేపీ ఆశీస్సులు అందుకుంది. వేర్వేరు సమస్యలతో సతమతమవుతున్న ఈ రాష్ట్రాలను కలిపింది. బీజేపీపై, బీజేపీ విధానాలు, ఉద్దేశాలపై ఆయా రాష్ట్రాల ప్రజలకున్న విశ్వాసమే’’ అని మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది హోలీ మార్చి 10 నుంచే మొదలవుతుందని బీజేపీ కార్యకర్తలు నాకు వాగ్దానం చేశారు. ఆ హామీని నిలబెట్టుకున్నారు. నిరంతరం శ్రమించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో విజయం సాధించారు. ఇది ఆనందోత్సాహాలతో పండుగ చేసుకోవాల్సిన రోజు’’ అంటూ అభినందనలు తెలిపారు.


దేశానికి చాలా మంది ప్రధాన మంత్రులను అందించిన ఉత్తరప్రదేశ్‌.. తొలిసారిగా ఒక పూర్తి పదవీకాలం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని మళ్లీ ఎన్నుకుందని అన్నారు. ఉత్తరాఖండ్‌లోనూ వరుసగా రెండోసారి గెలవడం ద్వారా బీజేపీ చరిత్ర లిఖించిందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు ప్రాంతాల వారీగా విభజిత రాజకీయాల కంటే.. యూపీవాసులు మళ్లీ మళ్లీ నిరూపిస్తున్నారని తెలిపారు. ‘‘ప్రతికూల పరిస్థితుల్లోనూ కార్యకర్తలు పార్టీ జెండాను మోసిన తీరు చూశాక.. సమీప భవిష్యత్తులోనే వారు పంజాబ్‌లో బీజేపీ బలాన్ని పెంచుతారన్న నమ్మకం నాకు కలిగింది.’’ అన్నారు.  ఏదో ఒకరోజు వారసత్వ పాలన అంతాన్ని చూస్తుందని ఉద్ఘాటించారు. 


Updated Date - 2022-03-11T06:49:48+05:30 IST