తాగునీటి సమస్య తలెత్తకూడదు

ABN , First Publish Date - 2020-03-28T10:33:33+05:30 IST

ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మునిసిపల్‌ అధికారులను కోరారు. 18వ వార్డులో...

తాగునీటి సమస్య తలెత్తకూడదు

  • అధికారులకు ఎమ్మెల్యేల సూచన

పాలకొల్లు అర్బన్‌, మార్చి 27 : ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మునిసిపల్‌ అధికారులను కోరారు. 18వ వార్డులో శుక్రవారం ఎమ్మెల్యే పర్యటించారు. మహిళలు ఖాళీ బిందెలతో వాటర్‌ ట్యాంక్‌కోసం ఎదురు చూస్తుండడంతో వారితో ఎమ్మెల్యే మాట్లాడారు. తాగునీరు సరిగా సరఫరా కావడం లేదని మహిళలు చెప్ప డంతో మునిసిపల్‌ కమిషనర్‌కు ఫోన్‌చేసి మాట్లాడారు.


తాగు, సాగునీరు అందించాలి

నరసాపురం రూరల్‌, మార్చి 27: నిధుల కొరత లేదు. అయినా చాలా గ్రామాల్లో  సాగు, తాగునీటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ప్రసాదరాజు ఆదేశించారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఇరిగేషన్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. నెలాఖరుకు అన్ని ప్రాజెక్టులు, పశువుల చెరువుల్ని పూర్తిస్థాయిలో నింపాలన్నారు. లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని 45 గ్రామాల్లో వ్యాన్‌ల సాయంతో నిత్యావసరాలు అందించేలా చూడాలన్నారు. తాగునీరు, శానిటేషన్‌ పనులకు 1.20 కోట్ల నిధులు మంజూరయ్యాన్నారు.


వ్యక్తిగత శుభ్రత, స్వీయ రక్షణ అవసరం

తణుకు, మార్చి 27 : కరోనా వైరస్‌ నివారణకు వ్యక్తిగత శుభ్రత స్వీయరక్షణ వంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్‌ను నివారించవచ్చునని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం హౌసింగ్‌ బోర్డు కాలనీలో హైపోక్లోరైట్‌ మందును స్ర్పే చేశారు. ప్రజలు ఇంటి వద్దనే ఉండి స్వీయరక్షణ పాటించాలన్నారు. ప్రభుత్వపరంగా ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. మునిసిపల్‌ కమిషనర్‌ జి.సాంబశివరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ పి.ఉమాదేవి, సిబ్బంది పాల్గొన్నారు.


పంటలు ఎండుతున్నాయ్‌.. నీరివ్వండి

నరసాపురం, టౌన్‌, మార్చి 27: తీరప్రాంతంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి, తక్షణం సాగునీరివ్వాలని సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌కు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు శుక్రవారం వినతిపత్రం అందించారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల పరిస్థితిని ఆయనకు వివరించారు. కొప్పర్రు ఎత్తిపోతుల పథకాన్ని వినియోగించి మొగల్తూరు మండలంలోని భూములకు నీరందించాలన్నారు. లాక్‌డౌన్‌ నుంచి రైతులు, ఆక్వా రైతులకు మినహాయింపు ఇవ్వాలన్నారు.

Updated Date - 2020-03-28T10:33:33+05:30 IST