నెల రోజుల్లో ఇంటింటికీ తాగునీరు

ABN , First Publish Date - 2022-05-23T06:07:12+05:30 IST

లగిశపల్లి పంచాయతీ కేంద్రానికి నెల రోజుల్లో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని అల్లూరి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

నెల రోజుల్లో ఇంటింటికీ తాగునీరు
లగిశపల్లిలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

 లగిశపల్లి పంచాయతీలో నీటి సమస్య పరిష్కారానికి కృషి

- జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

పాడేరు, మే 22(ఆంధ్రజ్యోతి): లగిశపల్లి పంచాయతీ కేంద్రానికి నెల రోజుల్లో ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని అల్లూరి జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. లగిశపల్లి పంచాయతీ పరిధిలో తాగునీరు, విద్యుత్‌ సమస్యలపై స్థానికులు స్పందన కార్యక్రమంలో పలుమార్లు ఫిర్యాదులు చేశారు. వాటిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదివారం లగిశపల్లి గ్రామాన్ని సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. లగిశపల్లి పంచాయతీ కేంద్రంతో పాటు పంచాయతీ పరిధిలోని రామచంద్రపురం, రామచంద్రపురం కాలనీల్లో తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. లగిశపల్లి గ్రామంలో తాగునీటిని అందించేందుకు గాను రూ.10.5 లక్షలతో టెండర్‌ పిలిచామని, అయితే ఈ పథకం ద్వారా ఇంటింటికీ కుళాయిలు వేసే అవకాశం లేదన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం నుంచి రూ.300 చొప్పున వసూలు చేసి, పంచాయతీ ద్వారా తమకు అందిస్తే ప్రతి ఇంటికీ కుళాయిలు వేయిస్తామని చెప్పారు. అందుకు పంచాయతీలో అవసరమైన తీర్మానం చేయాలన్నారు. దీనిపై పంచాయతీ సర్పంచ్‌, కార్యదర్శి బాధ్యత తీసుకోవాలన్నారు. ఇలా చేస్తే నెల రోజుల్లోనే లగిశపల్లి గ్రామానికి ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు. రామచంద్రపురం, రామచంద్రపురం కాలనీలకు తాగునీటిని అందించేందుకు ప్రత్యేక ప్రతిపాదనలు చేశామని, త్వరలోనే అక్కడ సైతం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ జవహర్‌కుమార్‌, డీఈఈ ప్రకాశ్‌, సర్పంచ్‌ లకే పార్వతమ్మ, కార్యదర్శి సీహెచ్‌ శివప్రకాశ్‌, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T06:07:12+05:30 IST