ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం!

ABN , First Publish Date - 2022-07-02T08:16:52+05:30 IST

రాష్ట్రపతిగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము ఎన్నిక ఖాయమైనట్టే! తాజాగా శిరోమణి అకాలీదళ్‌ ఆమెకు మద్దతు ప్రకటించడం తో పాటు మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో ఇది ప్రస్ఫుటమవుతోంది.

ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం!

ఆమెకే ఓటన్న శిరోమణి అకాలీదళ్‌

మహారాష్ట్ర పరిణామాలతో మరింత బలం

‘విపక్షం’ నుంచి జారుతున్న చిన్న పార్టీలు

ముర్ము పేరు ముందే చెబితే మద్దతు ఇచ్చేవాళ్లం

బీజేపీ మా సలహా తీసుకుంటే బాగుండేది

రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయమే మంచిది: మమత బెనర్జీ

బెంగాల్‌ సీఎంపై మోదీ ఒత్తిడి ఉంది

మేం పోటీలో ఉంటాం: కాంగ్రెస్‌


న్యూఢిల్లీ/కోల్‌కతా, జూలై 1: రాష్ట్రపతిగా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము ఎన్నిక ఖాయమైనట్టే! తాజాగా శిరోమణి అకాలీదళ్‌ ఆమెకు మద్దతు ప్రకటించడం తో పాటు మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో ఇది ప్రస్ఫుటమవుతోంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కటిగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి వైపే మొగ్గు చూపడం గమనార్హం. విపక్షాల తరఫున యశ్వంత్‌ పేరును తెరపైకి తెచ్చిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్వరం కూడా మారుతోంది. ఏకాభిప్రాయం తో ఖరారైన అభ్యర్థి అయితే దేశానికి మంచిదని ఆమె అన్నారు. ముర్ము అభ్యర్థిత్వా న్ని ముందే ప్రకటించి ఉంటే తన మద్దతు కూడా లభించి ఉండేదేమో అన్నారు. విజయం సాధించే చాన్స్‌ ముర్ముకే ఎక్కువ అన్నారు.


 ‘గిరిజన మహిళను రాష్ట్రపతిగా బీజేపీ నిలబెడుతుందని ముందే తెలిసి ఉంటే ఏకాభిప్రాయ సాధన గురించి ఆలోచించేవాళ్లం. గిరిజనులన్నా, మహిళలన్నా మాకు ఎంతో గౌరవం’ అని మమత చెప్పారు. కాగా, మమతపై మోదీ ఒత్తిడి ఉన్నట్టుందని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌధురి అన్నారు. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందన కాంగ్రెస్‌ మాత్రం పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు. ఓటమి తప్పదన్న విషయం తెలిసినందువల్లే మమత అలా వ్యాఖ్యానిస్తున్నారని బీజేపీ నేత దిలీప్‌ ఘోష్‌ అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో అన్ని పార్టీలను ఏకతాటిపైకి తేవాలని మమతను ఎవరూ కోరలేదని సీపీఎం నేత సుజన్‌ చక్రవర్తి చెప్పారు. మరోవైపు ముర్ముకే తమ మద్దతు అని శిరోమణి అకాలీదళ్‌ వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ) కూడా ముర్ముకే మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఎన్నిక తేదీ సమీపిస్తున్న కొద్దీ విపక్ష కూటమిలోని చిన్నా, చితకా పార్టీలు అకాలీదళ్‌, ఎన్‌పీపీ బాట పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 

Updated Date - 2022-07-02T08:16:52+05:30 IST