కబేళా మెయిన్ రోడ్డు ఎంకే కల్యాణమండపం వద్ద ఆగిన మురుగు
ఊర్మిళానగర్, కబేళా మెయిన్ డ్రెయిన్లు అధ్వానం
దుర్వాసనతో అల్లాడుతున్న ప్రజలు
భవానీపురం, జూలై 6 : 43, 45వ డివిజన్ల్లో ప్రధాన రహదారులైన ఊర్మిళానగర్, కబేళా ప్రాంతాల్లో డ్రెయిన్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. నగరంలో ఉన్నామా? అన్న సందేహం కలగక మానదు. ఊర్మిళానగర్ మెయిన్ రోడ్డును అభివృద్ది చేయడంతో పాటు, హారిక రెస్టారెంట్ మీదుగా మేజర్ డ్రెయిన్ నిర్మాణానికి కలిపి మొత్తం రూ.2 కోట్లపైనే నిధులను మంజూ చేసి, టెండర్లు పిలిచినా పట్టించుకోవడం లేదు. కార్పొరేషన్ అధికారులు మొద్దునిద్ర నటిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. డ్రెయిన్ నుంచి ఆక్రమణల తొలగింపు వ్యవహారం ప్రహసనంగా మారడం ప్రజలకు శాపంగా మారింది. ఇక్కడ ఓ వైసీపీ నేత డ్రెయిన్‌ను ఆక్రమించుకున్నారు. అక్కడే సమస్య వల్ల నిలిచిపోయిందని చెబుతున్నారు. జోజినగర్ చర్చివైపు అవుట్‌పాల్ గతంలో నిర్మించినా అది కూడా చర్చి మొదలు ఏకలవ్వనగర్ నుంచి కబేళా కల్వర్టు వరకు ఆక్రమణలు పెచ్చు మీరడంతో ఇక్కడి డ్రెయిన్ పందుల పెంపకానికి ఆవాసంగా మారింది. పూర్తిస్థాయిలో పూడికలు కూడా మిషన్ల ద్వారా తీయకపోవడంతో ప్రజలు దుర్వాసనతో అల్లాడుతున్నారు. కబేళా ప్రాంతంలో సచివాలయం వద్ద సగం డ్రెయిన్ కట్టి వదిలేశారు. ఇక్కడ రెండు ఫంక్షన్‌హాళ్ల నుంచి మురుగునీరు బయటకు పోకుండా గోతుల్లో నిల్వ చే సినట్లు అక్కడ పరిసరాలున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో నిత్యం రాకపోకలు సాగించే డ్రెయిన్లు చెంత పందుల, దోమలు, చెత్తా చెదారం నిండి ఉండటంతో ప్రజలు తీవ్ర దుర్వాసనతో అల్లాడుతున్నారు. ఈ డ్రెయిన్ల ప్రక్షానకు అధికారులు నడుంబిగించ కపోవడం విమర్శలకు తావిస్తోంది.