పాకుతూనైనా పనిచేసుకోవాలి..

ABN , First Publish Date - 2020-05-23T11:03:09+05:30 IST

ఇంత పెద్ద విపత్తు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. నేనొక గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటాను. వయస్సు శరీరానికే గానీ

పాకుతూనైనా పనిచేసుకోవాలి..

అన్ని పనులూ నేనే చేసుకుంటున్నా..  డాక్టర్‌ వకుళాభరణం రామకృష్ణ


శాస్త్రీయ దృక్కోణంలో నుంచి చరిత్రను ఒడిసిపట్టి, భావితరాల దోసిట్లో కుమ్మరిస్తోన్న ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు డాక్టర్‌ వకుళాభరణం రామకృష్ణ. ఆయన గురించి తెలిసిన వారంతా ‘నడిచే గ్రంథాలయం’గా అభివర్ణిస్తారు. ఇప్పుడు ఆయన వయసు 83ఏళ్లు. కరోనా కాలాన్నీ అధ్యయనం, అభ్యాసం, రచనా వ్యాసంగానికి అనువైన సమయంగా మలుచుకొన్న నిత్య విద్యార్థి ఆయన. లాక్‌డౌన్‌ వేళ తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని మార్పుల గురించి ఇలా చెబుతున్నారు..!


హైదరాబాద్‌ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి):  ఇంత పెద్ద విపత్తు వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. నేనొక గేటెడ్‌ కమ్యూనిటీలో ఉంటాను. వయస్సు శరీరానికే గానీ మనసుకి కాదని నేను నమ్ముతాను. ఎప్పటిలాగే, ఇప్పుడూ నా మనసు ఎంతో హాయిగా, ప్రశాంతంగా ఉంది. డయాబెటిస్‌, బ్లడ్‌ ప్రెజర్‌ వంటి సమస్యలున్నా నేను ఆరోగ్యంగా ఉన్నాను. అప్పుడప్పుడు ‘నేను ఒంటరిని’ అనే భావన మాత్రం ముల్లులా గుచ్చుకున్నట్లు బాధిస్తుంటుంది. కానీ, మా పక్క బ్లాకులోనే నాపెద్ద కొడుకు, కోడలు ఉంటారు. వాళ్లు నాకు ఒక తోడ్పాటు, ఒక ధైర్యం. నాకు కావాల్సినవన్నీ వాళ్లే చూసుకుంటారు. స్నేహితులను కలవడం, సభలు, సమావేశాలకు హాజరవడం, పబ్లిక్‌ యాక్టివిటీ్‌సలో పాల్గొనడం వంటి కార్యక్రమాలతో ఇదివరకు రోజులు కొంత బిజీగా గడిచేవి. ఇప్పుడు ఇంటికే పరిమితమయ్యాను. అలా అని ఏకాంతాన్ని చూసి కృంగిపోలేదు. నేను ఆశావాదిని. ఇంతకన్నా మంచి ప్రపంచం వస్తుందని నమ్ముతాను. అప్పటిదాకా ఈ పురిటినొప్పులు తప్పవని భావిస్తాను. 


శ్రమైక్య జీవన సౌందర్యం...

తూర్పు వెలుగురేఖలు పొడవకముందే నా దినచర్య ప్రారంభమవుతుంది. ‘‘ఉదయం నా హృదయం.. నడక నా ప్రాణం’’ అన్నాడు సినారె. ఆ మాటలను అక్షరాలా ఆచరిస్తాను. రోజూ ఉదయం ఒక అరగంట తప్పనిసరిగా నడవాల్సిందే. తర్వాత కాఫీ పెట్టుకొని, తాగుతూ, ఆ రోజు చేయాల్సిన పనులను ప్లాన్‌ చేసుకుంటా. అప్పుడే ముఖ్యమైన ఫోన్‌కాల్స్‌ మాట్లాడటం, స్నేహితుల యోగక్షేమాలు తెలుసుకోవడం వంటి పనులూ పూర్తి అవుతాయి. కరోనా కాలంలో దినపత్రికలు నన్ను ఇతర ప్రపంచంలోకి తీసుకెళ్లి, ఊరటనిచ్చాయి. అవి రావడం నాకొక వరం. చాలా ఏళ్లుగా మేము తెప్పించుకొనే పత్రికలు రెండే. అవి ‘‘ది హిందూ’’, ‘‘ఆంధ్రజ్యోతి’’. లాక్‌డౌన్‌తో వంటమనిషి, మెయిడ్‌, డ్రైవర్‌ రావడం లేదు. దాంతో ఇంటి, వంట  పనులన్నీ నేనే చేసుకోవడం ఇప్పుడు నా జీవితంలో చోటుచేసుకొన్న కొత్త మార్పు.


కర్ణాటక సంగీతమో, గాయని నూర్జహాన్‌ గీతాలనో, సంగీతకారుడు నౌషాద్‌ పాటలనో వింటూ నా దుస్తులు నేనే ఉతుక్కుంటాను. కాఫీ, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌ నేనే ప్రిపేర్‌ చేసుకొంటాను. పాత్రలు తోమడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం వంటి పనులన్నీ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇదివరకు నేను చేయని పనులు. అవి ఇప్పుడు చేస్తుంటే అలసట వస్తుందేగానీ, బాధ, దుఃఖం మాత్రం కలగడం లేదు. పైగా శ్రమలోని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. తద్వారా శ్రమైక్యజీవన సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాను. 


కుటుంబ సభ్యులతో క్యారమ్స్‌...

‘మీరొక్కరే ఇలా కష్టపడకపోతే, కొడుకుతోపాటూ ఉండచ్చు కదా..’ అని చాలామంది అన్నారు. శరీరం పూర్తిగా ఆదీనం తప్పిపోతే తప్ప, పాకుతూనైనా తమ పని తాము చేసుకోవాలి. ఒకరిమీద ఆధారపడకూడదు అంటాను. అప్పుడే మన జీవితంలో మనకంటూ ఒక జాగా మిగుల్చుకోగలం. ఇవి అందరికీ వర్తించే మాటలే. బ్రేక్‌ఫాస్ట్‌ తయారీకి కావాల్సిన ఇడ్లీ పిండి, దోసె మిక్స్‌తో పాటూ మధ్యాహ్నం లంచ్‌ టైంకి కూరలు మా కోడలు పంపుతారు. అన్నం మాత్రం నేను వండుకుంటాను. అప్పుడప్పుడు ఉప్మా, కిచిడీ వంటివి చేసుకొంటాను.


డిన్నర్‌ మాత్రం మా అబ్బాయి వాళ్లింట్లోనే. అప్పుడు మాత్రం మేమంతా కలిసి భోజనం చేస్తాం. తర్వాత కాసేపు నా కొడుకు, కోడలితో కలిసి క్యారమ్స్‌ ఆడటంతో కొంత కాలక్షేపమవుతుంది. నేను పూర్తిగా శాకాహారిని. వయోభారంతో జిహ్వచాపల్యమూ తగ్గింది. దాంతో ఆహారం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి, శ్రద్ధంటూ ఏమీ లేదు. సాయంత్రం పూట ఎప్పుడైనా ఆకలి అనిపిస్తే కొద్దిగా డ్రైఫ్రూట్స్‌ తీసుకొంటాను. నా భోజనంలో పెరుగన్నం తప్పనిసరి.  అదీ ఇంట్లో నేను తయారు చేసుకొన్న పెరుగుతోనే.


లాక్‌డౌన్‌ వ్యాపకాలు..

దాదాపు రెండు నెలలుగా ఇంటికే పరిమితమైనా, నేను చేయాల్సిన కొన్ని పనుల్ని పూర్తిచేసేలా డైలీ వర్క్‌ని ప్లాన్‌ చేసుకొంటున్నాను. అందులో చదవడం, రాయడం ప్రధానమైనవి. నాకిష్టమైన కొన్ని ఆత్మకథలు మళ్లీ చదువుతున్నాను. అందులో ముఖ్యంగా ‘‘చిలకమర్తి లక్ష్మీనరసింహం’’, ‘‘కందుకూరి వీరేశలింగం’’, ‘‘పుచ్చలపల్లి సుందరయ్య’’ జీవిత చరిత్రలు, ఇంగ్లి్‌షలో  ‘‘నెహ్రూ ఆటో బయోగ్రఫీ’’, సర్వేపల్లి గోపాల్‌ రాసిన ‘‘నెహ్రూ బయోగ్రఫీ’’ తదితర పుస్తకాల్లోని కొన్ని భాగాలను తిరగేస్తున్నాను. నా స్వీయ అనుభవాలను ‘‘జ్ఞాపకాలు’’ పేరుతో రాస్తున్నాను.


అందులో ఇప్పటికే రాసిన కొన్ని చాప్టర్లను రీరైట్‌ చేయడం వంటి పనులతో కొంత సమయం గడిచిపోతుంది. 1840లలో మద్రాసులో ఒక ప్రజాసంఘాన్ని నెలకొల్పి, సామాజిక సేవలో నిమగ్నమైన ‘‘గాజుల లక్ష్మీనర్సు చెట్టి’’ జీవిత చరిత్రను సుందర్‌, నేనూ కలిసి రాస్తున్నాం. దాంతో పాటూ 1931లో ఆచార్య రంగ ప్రచురించిన ‘‘రైతు భజనావళి’’ పుస్తకంపై ఒక పరిశీలనా వ్యాసం రాసే పనిలో ఉన్నాను. ఇలా నేను చేయాల్సిన పనుల్ని ఒక్కొక్కటిగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాను.


ప్రపంచానికి జబ్బు చేసింది...

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే, కథకుడు శారద (నటరాజన్‌) 1946లో రచించిన ‘‘ప్రపంచానికి జబ్బు చేసింది’’ కథ జ్ఞప్తికొస్తోంది. ఆ కథలో సామ్రాజ్యవాదం, సామ్యవాదం, మతవాదం వంటి అన్ని రాజకీయ సిద్ధాంతాలూ ఉంటాయి. అందులో రోగి ప్రపంచానికి ప్రతినిధి. ఇవాళ ప్రపంచానికి జబ్బు చేసింది. ‘మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేశాడు. తద్వారా తలెత్తిన ప్రకృతి విధ్వంసంలో నుంచి ఒక ధర్మాగ్రహం పుట్టుకొచ్చింది. అదే ఇప్పుడు మానవాళిపై కసితీర్చుకొంటుంద’నే భావన కలిగింది. ఇందుకు విరుగుడూ మనిషి చేతుల్లోనే ఉంది. ఈ విపత్తులో ఏమీలేనివారే ఎక్కువగా బాధపడ్డారు. వలసకూలీల దారిద్య్రంలో ఎంత దుఃఖం ఉందో, ఎంత నొప్పి ఉందో... అదంతా మరపురాని మచ్చగా మిగిలిపోతుంది. కరోనా.. మానవాళికి ఇదొక కనువిప్పు. ఈ ఆపదవేళ వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాంతి భద్రతల యంత్రాంగం, జర్నలిస్టుల కృషి ప్రశంసనీయం. 

Updated Date - 2020-05-23T11:03:09+05:30 IST