పిల్లల ఆస్పత్రుల్లో పడకల్లేవ్‌!

ABN , First Publish Date - 2022-08-29T20:30:14+05:30 IST

హైదరాబాద్‌(hyderabad)లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన పదేళ్ల ధృవ (పేరు మార్చాం)కు జ్వరం వచ్చింది. అలాగే తీవ్రమైన ఒళ్లు నొప్పులు కూడా. జ్వరం కొద్దిగంటల పాటు తీవ్రంగా రావడం, మందులు వేసుకున్న తర్వాత తగ్గిపోవడం

పిల్లల ఆస్పత్రుల్లో పడకల్లేవ్‌!

చిన్నారులకు డెంగీ, మలేరియా, వైరల్‌ జ్వరాలు 

జలుబు, దగ్గు, ఆయాసం కూడా..

ప్రతి పది పిడియాట్రిక్‌ కేసుల్లో 8 ఇవే..

ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్న తల్లిదండ్రులు

పది రోజులుగా పెరుగుతున్న ఓపీ, ఐపీ

ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తే మేలు


హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌(hyderabad)లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన పదేళ్ల ధృవ (పేరు మార్చాం)కు జ్వరం వచ్చింది. అలాగే తీవ్రమైన ఒళ్లు నొప్పులు కూడా. జ్వరం కొద్దిగంటల పాటు తీవ్రంగా రావడం, మందులు వేసుకున్న తర్వాత తగ్గిపోవడం, మళ్లీ వస్తుండడంతో వైద్యుడిని సంప్రదించారు. పరీక్షలు చేయిస్తే డెంగీ అని నిర్ధారణ అయింది. ప్లేట్‌లెట్లు తగ్గాయి. అప్పటికే రాత్రి 12 గంటలైంది. వెంటనే ఏదో ఒక ఆస్పత్రిలో చేర్పించాలని డాక్టర్‌(docoter) సూచించారు. దగ్గరలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ బెడ్లు లేవన్నారు. అలా నాలుగైదు ఆస్పత్రుల చుట్టూ తిరిగినా పడకలు దొరకలేదు. దీంతో ఆ పిల్లాడి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఇలాంటి ఘటనలు నగరంలో రోజూ చోటు చేసుకుంటున్నాయి. పిల్లల్ని(Childrens Hospital) తీసుకొని ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం డెంగీ, మలేరియా, వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తున్నాయి. ఫలితంగా ఆస్పత్రుల్లో పిల్లలకు బెడ్లు దొరకడం లేదు. జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ పిల్లల ఆస్పత్రుల్లో పడకలు దొరక్క హైదరాబాద్‌కు వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నట్లు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో సుమారు 15 పిడియాట్రిక్‌ ఆస్పత్రులున్నాయి. అన్నింట్లో పడకలు నిండిపోయాయని.. వారం పది రోజులుగా ఇటువంటి పరిస్థితి నెలకొందని వైద్యవర్గాలు తెలిపాయి. విపరీతంగా ఓపీతో పాటు ఐపీ కూడా పెరిగినట్లు వెల్లడించాయి. ముఖ్యంగా గత పది రోజులుగా ప్రైవేటు ఆస్పత్రుల్లోని పిల్లల వైద్యులు బాగా బిజీ అయ్యారని పేర్కొన్నాయి. మరోవైపు డెంగీ కేసుల్లో ప్రైవేటు ఆస్పత్రులు ప్లేట్‌లెట్లు తగ్గిపోతాయని రోగులను బెదరగొడుతున్నాయి. ప్లేట్‌లెట్ల కోసం రూ.50 వేల నుంచి లక్ష వరకు వసూ లు చేస్తున్నాయి. పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదు. ఆ బలహీనతను కొన్ని ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నా యి. ఇక నిలోఫర్‌లో 580 పడకలు ఉండగా.. అన్నీ నిండిపోయాయి. నిలోఫర్‌లో ఒకే పడకపై ఇద్దరు పిల్ల ల్ని ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎక్కువగా డెంగీ, వైరల్‌ ఫీవర్‌తో పాటు న్యూమోనియా కేసులు వస్తున్నట్లు నిలోఫర్‌ వైద్యులు చెబుతున్నారు.


ప్రతి 10 కేసుల్లో 8 ఇవే..

పన్నెండేళ్లలోపు చిన్నారుల్లో గత 20 రోజుల నుంచి ఎక్కువగా వైరల్‌ ఫీవర్స్‌ ఉంటున్నాయి. వీటితోపాటు ఎక్కువగా డెంగీ, మలేరియాతో వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. తన వద్దకు వచ్చే ప్రతి పది మందిలో 8 మంది పిల్లలే ఉంటున్నట్లు మణికొండకు చెందిన డాక్టర్‌ సత్యనారాయణరెడ్డి ఆంధ్రజ్యోతికి తెలిపారు. అందులోనూ ఎక్కువగా వైరల్‌ ఫీవర్స్‌ ఉంటున్నాయ ని.. జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారే వస్తున్నట్లు చెప్పా రు. జ్వరం ఎక్కువ రోజులు ఉండడంతో తల్లిదండ్రులే టెస్టులు రాయమని అడుగుతున్నారని.. పరీక్షల్లో ఎటువంటి జబ్బులు బయటపడడం లేదని ఆయన తెలిపారు. వైరల్‌ ఫీవరే ఎక్కువగా ఉంటోందని.. వారం, పదిరోజుల తర్వాత తగ్గిపోతుందని వెల్లడించారు. వీటితో పాటు పిల్లల్లో డెంగీ, మలేరియా కేసులు కూడా వస్తున్నాయన్నారు.


ఒకేసారి ఇలా ఎందుకంటే..

పిల్లలు గత రెండేళ్లుగా పాఠశాలలకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అయ్యారు. దాంతో వారిలో రోగనిరోధక శక్తి తగ్గిందని వైద్యులు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత బడికి వెళ్లడంతో ఇన్ఫెక్ట్‌ అవుతున్నట్లు చెబుతున్నారు. రెగ్యులర్‌గా పాఠశాలలకు వెళ్తుంటే ఇలాంటి పరిస్థితి ఉండదంటున్నారు. మానవ శరీరంలో ఒక్కసారి వైరస్‌ ప్రవేశిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, రెండోసారి అది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొంటాయని వైద్యులు అంటున్నారు. పిల్లలు రెం డేళ్లుగా స్కూళ్లకు వెళ్లకపోవడం వల్ల వారిలో తగినన్ని యాంటీబాడీలు లేక ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. కాగా, పిల్లలు అనారోగ్యంగా ఉంటే పాఠశాలలకు పంపవద్దని స్కూళ్ల యాజమాన్యాలు వాట్స్‌పలో తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నాయి. ఎవరైనా జ్వరంతో స్కూల్‌కు వస్తే.. వెంటనే ఇంటికి పంపిస్తున్నారు.  


ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • ప్రస్తుతం వస్తున్నవన్నీ వైరల్‌ జ్వరాలే. తల్లిదండ్రులు ఎక్కువగా ఆందోళన చెందవద్దు.
  • లక్షణాలు ఉనన పిల్లల్ని స్కూళ్లకు పంపొద్దు.  
  • వైరల్‌ ఫీవర్స్‌లో ఎక్కువగా డీహైడ్రేషన్‌ అవుతుంది. ఎక్కువగా నీరు తాగించాలి. 
  • వైద్యులు సూచించకుండా యాంటీబయాటిక్స్‌ సొంతంగా వాడకూడదు. వైరల్‌ జ్వరాలు నాలుగైదు రోజుల తర్వాత, జలుబు, దగ్గు పది రోజుల తర్వాత తగ్గుతాయని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. 


వైరల్‌ జర్వాలు ఎక్కువగా ఉంటున్నాయి       

వారం రోజులుగా వైరల్‌ ఫీవర్స్‌తో వచ్చే పిల్లల సంఖ్య పెరిగింది. ఎక్కువ మందిలో 103 డిగ్రీల జ్వరం ఉంటోంది. జలుబు, దగ్గు, డెంగీ, మలేరియా, న్యూ మోనియా కేసులూ వస్తున్నాయి. తల్లిదండ్రులు కంగారుపడాల్సిన అవసరం లేదు. ఇది వైరల్‌ జ్వరాలొచ్చే సీజన్‌. సెప్టెంబరు మూడో వారం వరకు ఉంటుంది. ఆ తర్వాత తగ్గిపోతుంది. ఇక దగ్గు బాగా వచ్చే పిల్లలకు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె వేసి ఇవ్వాలి. ఏడాది వయసు దాటిన వారికి మాత్రమే ఇవ్వాలి.  

- డాక్టర్‌ ఉషారాణి, ప్రొఫెసర్‌, నిలోఫర్‌ ఆస్పత్రి


ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలి     

పిడియాట్రిక్‌ వార్డుల్లో పడకలు దొరకడం లేదు. చిన్నారుల వైద్యానికి ప్రైవేటు ఆస్పత్రులు వేలు, లక్షల్లో బిల్లులు వేస్తున్నాయి. పిడియాట్రిక్‌ ఆస్పత్రులన్నింటా ఆరోగ్యశ్రీని తక్షణమే అమలు చేయాలి.

- జగన్‌, అధ్యక్షుడు, ప్రైవేటు ఆస్పత్రుల బాధితుల సంఘం




Updated Date - 2022-08-29T20:30:14+05:30 IST