తెలుగు నెత్తిన సంస్కృతం వద్దు

ABN , First Publish Date - 2021-08-29T07:49:57+05:30 IST

తిరుపతిలో తెలుగు అకాడమీ అని..

తెలుగు నెత్తిన సంస్కృతం వద్దు

నేడు తెలుగు భాషా దినోత్సవం

తిరుపతిలో నీడలేని తెలుగు అకాడమీ


తిరుపతి: తిరుపతిలో తెలుగు అకాడమీ అని ప్రకటించారు. తెలుగు భాషాభిమానులంతా సంబరపడ్డారు. తెలుగు భాష పరిశోధన, అభివృద్ధి, ప్రచారాలకు ఎంతో కృషి జరుగుతుందని ఆశించారు. ఈలోగా తెలుగు సరసన సంస్కృతం చేర్చారు. తెలుగు, సంస్కృత అకాడమీ అని పేరు మార్చారు. తెలుగు భాషాభిమానులు భగ్గుమన్నారు. అభిమానం ఉంటే సంస్కృతభాషకు కూడా అకాడమీ పెట్టుకోవచ్చుగానీ, తెలుగుతో కలిపి పెట్టడం వల్ల తెలుగు భాషను బలహీనపరచడమే అని అనుమానించారు. అయినా ప్రభుత్వం మడమ తిప్పలేదు. తెలుగుభాషకు, జాతికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన నందమూరి తారకరామారావు భార్య లక్ష్మీపార్వతి అధ్యక్షతన తెలుగు సంస్కృత అకాడమీ మొదలైంది. అకాడమీ కార్యకలాపాలు తిరుపతి కేంద్రంగానే జరుగుతాయని ప్రకటించినా నిర్మాణాత్మకంగా మాత్రం ముందుకు కదల్లేదు. 


తెలుగు అకాడమీ కోసం ఎస్వీయూ రెడ్‌ బిల్డింగ్‌ క్వార్టర్స్‌లో ఒక భవనాన్ని పరిశీలించారు. దీనిని అకాడమీ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలంటే తక్షణం రూ. 10 లక్షలు అవసరం అని అభిప్రాయపడడంతో తుమ్మలగుంట మార్గంలోని ఎస్వీ గోశాల సమీపంలో ఓ గ్యాస్‌ గోడౌన్‌లో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు. అయినా అక్కడ ఎలాంటి కార్యకలాపాలు ప్రారంభం కాలేదు. తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటుకు స్థల పరిశీలన ప్రక్రియే పూర్తి కాలేదు. శాశ్వత భవన సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేయలేదు.అకాడమీ నిర్వహణకు సంబంధించిన సామగ్రిని, సిబ్బందిని తిరుపతికి తీసుకొచ్చి కార్యకలాపాలను ప్రారంభించలేదు. తెలుగు భాష పట్ల పాలకులకు ఉన్న అభిమానం ఏపాటిదో ఇందువల్ల తేటతెల్లమవుతోంది. 


తాడేపల్లె నుంచీ తిరుపతికి తరలేది ఎప్పుడు?

2020 జూన్‌లో తిరుపతిలో తెలుగు అకాడమీ ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.  విభజన తర్వాత తాడేపల్లెలో స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలోనే ఒక గదిని తెలుగు అకాడమీ కోసం ప్రభుత్వం కేటాయించింది. తిరుపతికి తరలించే ప్రయత్నాలు మాత్రం జరగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు అకాడమీకి సంబంధించి సుమారు రూ. 320 కోట్ల ఆస్తి ఉన్నట్టు అంచనా. ఇందులో రూ. 180 కోట్ల ఆస్తి ఆంధ్ర రాష్ట్రానికి దక్కాల్సి ఉంది. పంపకాలు పూర్తి కాకపోవడంతో తాజాగా న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకుంది.


జనాభా ప్రాతిపదికన పంపకాలు పూర్తి కావాలని ఆదేశించింది. అయినా ఏ ముందడుగూ పడలేదు.  తెలుగు-సంస్కృత అకాడమీకి ప్రస్తుతం చైర్‌పర్సన్‌గా నందమూరి లక్ష్మీపార్వతి వ్యవహరిస్తున్నారు. గతంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ తెలుగు విభాగ ఆచార్యులు జె. ప్రతాప రెడ్డి, పేట శ్రీనివాసులు రెడ్డి తెలుగు అకాడమీ సంచాలకులుగా పని చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాలలో తెలుగు అకాడమీ తిరుపతి ప్రాంతీయ కేంద్రం కొనసాగుతూ ఉంది. ఈ కేంద్రం సమన్వయకర్తగా ఎస్వీయూ తెలుగు విభాగ విశ్రాంతాచార్యులు గార్లపాటి దామోదర నాయుడు వ్యవహరించారు. 


తెలుగు అకాడమీని ప్రత్యేకంగానే ఏర్పాటు చేయాలి

తెలుగు అకాడమీలో  సంస్కృత అకాడమీని కలపడాన్ని నిరసిస్తున్నాం. తెలుగు అకాడమీని ప్రత్యేకంగానే ఉంచాలి. తిరుపతిలో తెలుగు అకాడమీకి ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తగిన సదుపాయాలను కల్పించాలి. తద్వారా తెలుగు భాషా వికాసానికి ప్రభుత్వం కృషి చేయాలి. లేకపోతే తెలుగు భాషాభిమానుల నుంచీ ఉద్యమాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.తెలుగు భాష ప్రాభవం కోల్పోతే, తెలుగు జాతి కూడా ప్రాభవం కోల్పోతుంది.  

- సాకం నాగరాజ, జిల్లా రచయితల సమాఖ్య 


వేర్వేరుగా ఉండడమే ఉత్తమం

నిధుల పంపిణీ విషయంలో సంస్కృత భాష పెత్తనం తెలుగుపై లేకుండా అకాడమీ పెద్దలు జాగ్రత్త వహించాలి.అకాడమీ అస్తిత్వానికీ, స్థాపనకూ హేతువులైన నిఘంటువులు, పుస్తక ప్రచురణలను వెంటనే చేపట్టాలి. సంస్కృతానికి కేటాయించే నిధుల వల్ల, తెలుగు ప్రచురణలకు లోటు రాకుండా చూడాలి. ఇలా జరగని పక్షంలో అకాడమీలు వేర్వేరుగా ఉండడమే ఉత్తమం. 

- ఆముదాల మురళి, శతావధాని


ఇది అన్యాయం..సహించం

ఇది అసంబద్ధమైన నిర్ణయం. తెలుగు భాషా, సాహిత్య అభిమానులుగా వ్యతిరేకిస్తున్నాం. తెలుగు నేలపై కావాల్సింది తెలుగు భాషా వికాసం. దానికి తగిన చర్యలు తీసుకోవాలి. కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలి. సంస్కృత ప్రాధాన్యాన్ని మేం కాదనం. కానీ, తెలుగు భాషకు ఆంగ్ల భాష ద్వారా దాడి జరిగింది. సంస్కృతాన్ని కలపడం ద్వారా తెలుగుకు మరింత అన్యాయం జరుగుతుంది. తెలుగు భాషకు అన్యాయం చేసే ఇలాంటి చర్యలను మేం సహించం. 

- గంగవరం శ్రీదేవి,తెలుగు భాషోద్యమ సమితి


మేం వ్యతిరేకిస్తున్నాం

తెలుగు భాషకు, సాహిత్యానికి తెలుగు అకాడమీ చాలా గొప్ప కృషి చేసింది. ఇంతటి ప్రాముఖ్యత గల అకాడమీలోకి సంస్కృతాన్ని కలపడం ద్వారా  తెలుగు భాషాభివృద్ధికి అవరోధం ఏర్పడుతుంది.తెలుగు భాషాభిమానులుగా మేం దీన్ని వ్యతిరేకిస్తున్నాం. తిరుపతిలో తెలుగు అకాడమీ అభివృద్ధికి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి. 

- వాకా ప్రసాద్‌, తెలుగు భాషాభిమాని

Updated Date - 2021-08-29T07:49:57+05:30 IST