న్యూఢిల్లీ: నూపుర్ శర్మ (Nupur Sharma)కు గతంలో మద్దతుగా నిలిచిన డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ (Geert Wilders) మరోసారి ఉదయ్‌పూర్ హత్యా ఘటనపై ఘాటుగా స్పందించారు. ''ఇస్లాంపై మెతకవైఖరి వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది'' అని ఇండియాను ఉద్దేశించి అన్నారు. ఉదయ్‌పూర్‌లో హిందూ టైలర్ కన్హయ్య లాల్‌ను రియాజ్ అట్టారి, గౌస్ మొహమ్మద్ అనే ఇద్దరు ముస్లింలు దారుణంగా నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనమైంది. దీనిపై గీర్ట్ వైల్డర్స్ స్పందించారు. ''దీనికి ఒకటే సమాధానం. హిందువులంతా ఒకటిగా నిలవాలి. నూపర్ శర్మకు మేము మద్దతిస్తున్నామని చెప్పాలి. ఎందుకంటే వాళ్లు (ఇస్లాం మతోన్మాదులు) అందర్నీ చంపలేరు'' అని ఇండియాకు ఇచ్చిన ఒక మెసేజ్‌లో వైల్డర్స్ అన్నారు.
ఇవి కూడా చదవండి
ఇండియాకు ఒక మిత్రుడిగా తాను ఈ సందేశం ఇస్తున్నట్టు ఆయన పేర్కొంటూ...''అసహనంపై ఎంతమాత్రం సహనం వద్దు. ఉగ్రవాదం, తీవ్రవాదం, జీహాదిస్టుల నుంచి హిందూయిజానికి రక్షణ ఇవ్వండి. ఇస్లాం పట్ల మెతకవైఖరి వల్ల భారీ మూల్యం చెలలించుకోవాల్సి వస్తుంది. తమను కాపాడే నేతలకు వంద శాతం హిందువులు అండగా నిలవాలి'' అని అన్నారు.
ఉదయ్‌పూర్ హత్యా ఘటనపై అన్ని రాజకీయ పార్టీల నుండి తీవ్రమైన విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించింది. నూపర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి ఇస్లాంను అవమానించినందుకు ప్రతీకారంగానే కన్హయ్య లాల్‌ను హత్య చేసినట్టు హంతకులు ఇరువురు ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ హత్య వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల హస్తం ఉందా అనే కోణం నుంచి కూడా ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. భారీ భద్రత మధ్య కన్హయ్యలాల్ అంత్యక్రియలు బుధవారం జరిగాయి.