20 రోజులు పని చేశాడు.. రూ. 23 లక్షల సొత్తు దోచేశాడు

ABN , First Publish Date - 2022-08-14T06:25:16+05:30 IST

నెలన్నర క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన బాలుడు ఓ దుకాణంలో పనికి చేరాడు.

20 రోజులు పని చేశాడు..  రూ. 23 లక్షల సొత్తు దోచేశాడు

బాలుడి సహా ముగ్గురి అరెస్ట్‌   

చోరీ సొత్తు స్వాధీనం 


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నెలన్నర క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన బాలుడు ఓ దుకాణంలో పనికి చేరాడు. యజమాని నమ్మకం పొందాడు. అతడి ఇంటికి కూడా వెళ్లేవాడు. బుద్ధిమంతుడిలా నటిస్తూ అదును చూసి రూ. 23 లక్షల సొత్తు దోచేశాడు. బాలుడు సహా ముగ్గురు దొంగలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన బాలుడు 9వ తరగతి చదివి మానేశాడు. నెలన్నర క్రితం బతుకుదెరువుకోసం నగరానికి వచ్చాడు. అదే రాష్ట్రానికి చెందిన వారు హయత్‌నగర్‌లో ఉండటంతో వారి వద్దకు వెళ్లాడు. వారి ద్వారా బోడుప్పల్‌లో మార్వాడీ వ్యాపారి మోహన్‌లాల్‌ చౌదరి హార్డ్‌వేర్‌ దుకాణంలో 20 రోజుల క్రితం పనిలో చేరాడు. యజమాని కుటుంబంతో కలిసిపోయాడు. ఇంట్లో వ్యక్తిలా అతడికి స్వేచ్ఛనిచ్చారు. అప్పుడప్పుడు బాలుడు పనిమీద యజమాని ఇంటికి వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో బంగారం, డబ్బు, వెండి, ఖరీదైన వస్తువులు ఎక్కడ భద్రపరుస్తున్నారనే దానిపై దృష్టిసారించాడు. యజమాని కుటుంబ సభ్యుల కదలికలను గమనించాడు. ఊరెళ్లి వస్తానని చెప్పి రాజస్థాన్‌ వెళ్లాడు. 


స్నేహితులతో ముఠా ఏర్పాటు

యజమాని ఇంట్లో బంగారం, డబ్బు దోచేయాలని భావించి స్నేహితులు బాలావత్‌ చౌదరి, రామ్‌నివాస్‌, సునీల్‌ చౌదరితో అందుకు పథకం వేశాడు. చోరీ చేసిన సొత్తులో అందరూ సమానంగా పంచుకోవాలని ఒప్పందం చేసుకొని ముఠాగా ఏర్పడ్డారు. ఈనెల 8న కారులో  హైదరాబాద్‌ చేరుకున్నారు. యజమాని ఇంటికి చేరుకొని రెక్కీ నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు మోహన్‌లాల్‌ దుకాణానికి వెళ్లాడు. 9.30 గంటల తర్వాత ఆయన భార్య ఇంటికి తాళం వేసి అల్వాల్‌లో రామ్‌దేవ్‌ మందిర్‌కు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన ముఠా కిటికీ గ్రిల్స్‌ తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో భద్రపరిచిన 20.5 తులాల బంగారం, రూ. 3.89 లక్షలు, 2.5 కిలోల వెండి కాజేసి పారిపోయారు. సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన యజమాని కొడుకు తాళం తీసి ఇంట్లోకి వెళ్లి టీవీ పెట్టుకొని కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత యజమానురాలు గుడి నుంచి తిరిగి ఇంటికి వచ్చారు. కిచెన్‌లోకి వెళ్లి చూడగా గ్రిల్స్‌ తొలగించి ఉన్నాయి. అనుమానం వచ్చి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు తీసి ఉన్నాయి. అందులో భద్రపరిచిన బంగారం, డబ్బు, వెండి కనిపించకపోవడంతో దొంగలు పడ్డారని దంపతులు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలతో మల్కాజిగిరి సీసీఎస్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్‌ ఆధారాలు సేకరించి మోహన్‌లాల్‌ వద్ద పనిచేసిన బాలుడిపై దృష్టి సారించారు. ఘట్కేసర్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు ప్రాంతంలో బాలుడిసహా బాలావత్‌ చౌదరి, రామ్‌నివా్‌సను పట్టుకున్నారు. విచారణలో నేరం అంగీకరించారు. బాలుడిని జువెనైల్‌ హోంకు తరలించారు. ఇద్దరిని కటకటాల్లోకి నెట్టారు. మరో నిందితుడు సునీల్‌ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి చోరీ చేసిన రూ. 23 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీసీఎస్‌ టీమ్‌ను సీపీ అభినందించారు. 

Updated Date - 2022-08-14T06:25:16+05:30 IST