మరో సంచలనం దిశగా ట్రంప్..? చివరి రోజున ఏకంగా 100 మందిని..

ABN , First Publish Date - 2021-01-20T00:55:15+05:30 IST

నేరస్థులను క్షమించేయడమన్నది అమెరికా అధ్యక్షుడికి ఉన్న ప్రత్యేకాధికారాల్లో ఒకటి. దీన్ని ప్రశ్నించే అధికారం చివరికి కోర్టులకు కూడా లేదు. ఈ అధికారాన్ని విస్తృతంగా వినియోగించుకున్న అధ్యక్షుల్లో ట్రంప్ కూడా ఒకరు. అయితే..అధ్యక్షుడిగా తన చివరి రోజున ట్రంప్ ఏకంగా 100 మందికి ఇలా క్షమాభిక్ష పెట్టనున్నట్టు సమాచారం.

మరో సంచలనం దిశగా ట్రంప్..? చివరి రోజున ఏకంగా 100 మందిని..

వాషింగ్టన్: నేరస్థులను క్షమించేయడమన్నది అమెరికా అధ్యక్షుడికి ఉన్న ప్రత్యేకాధికారాల్లో ఒకటి. అమెరికా చట్టసభలు కూడా ఈ విషయంలో ట్రంప్‌ను నియంత్రించ జాలవు. దేశాధ్యక్షుడికి అమెరికా రాజ్యంగం ఇచ్చిన స్వేఛ్చ ఇది. ఈ అధికారాన్ని విస్తృతంగా వినియోగించుకున్న అధ్యక్షుల్లో ట్రంప్ కూడా ఒకరు. అయితే..అధ్యక్షుడిగా తన చివరి రోజున ట్రంప్ ఏకంగా 100 మందికి ఇలా క్షమాభిక్ష పెట్టనున్నట్టు సమాచారం. అదే జరిగితే మాత్రం.. అత్యధిక క్షమాభిక్షలు ప్రసాదించిన దేశాధినేతగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోనున్నారు. ఈ విషయమై ట్రంప్ తన కుటుంబ సభ్యులతో సలహాదారులతో చర్చలు జరిపినట్టు కూడా తెలిసింది. 


అయితే.. ఇప్పటికే రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న ట్రంప్ తనను తాను క్షమించేందుకు మాత్రం విముఖత వ్యక్తం చేశారట. తన కుటుంబసభ్యులకు కూడా క్షమాభిక్ష ఇవ్వోబోనని ఆయన అన్నట్టు అమెరికా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా ప్రజాస్వామ్యంపై దాడి చేశారంటూ అమెరికా ప్రతినిథుల సభ అభిశంసన ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. సభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మెజారిటీ సభ్యుల అమోదం లభించింది. దీంతో ఇది ప్రస్తుతం పెద్దల సభ సెనెట్‌కు చేరుకుంది. ప్రతినిధుల సభ లేవనెత్తిన అంశాలపై సెనెట్ విచారణ చేపడుతుంది. 


ఇందులో ట్రంప్ దోషి అని తేలిన పక్షంలో మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలులేకుండా అమెరికా చట్టసభలు ఆయన్ను శిక్షించవచ్చు. ఈ నేపథ్యంలో ట్రంప్ తనని తాను క్షమించేసుకోవచ్చు అన్న చర్చ అమెరికాలో బయలు దేరింది. అయితే..తనను తాను క్షిమించుకోవడమనేది సహజన్యాయ సూత్రాలకు విరుద్ధమని అక్కడి రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్వీయ క్షమాభిక్షకు పూనుకునేది లేదని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.  

Updated Date - 2021-01-20T00:55:15+05:30 IST