ఆశ్రమంలో ఆధిపత్యపోరు?

ABN , First Publish Date - 2022-08-08T05:13:57+05:30 IST

నిన్నా మొన్నటి వరకు విద్యార్థినులతో కళకళలాడిన పాఠశాల..

ఆశ్రమంలో ఆధిపత్యపోరు?
పడమట నర్సాపురంలోని బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల

 రెండువర్గాలుగా విడిపోయిన ఉపాధ్యాయులు

  నిర్లక్ష్యం నీడలో విద్యార్థినులు

  కొరవడిన ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ

జూలూరుపాడు, ఆగస్టు 7: నిన్నా మొన్నటి వరకు విద్యార్థినులతో కళకళలాడిన పాఠశాల..  వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే లోపే సీట్లన్నీ భర్తీ అయ్యేవి.. చుట్టుపక్కల గ్రామాల్లోని పాఠశాలల్లోని 3నుంచి పదో తరగతులకు చెందిన గిరిజన బాలికలు ఈ పాఠశాలలోనే అధికసంఖ్యలో చేరడంతో ప్రభుత్వ పాఠశాలల్లో క్రమేపి నమోదుశాతం పడిపోయేది. బోధన, భోజనం, భద్రత విషయాల్లో బాలికల తల్లిదండ్రులకు నమ్మకం ఉండేది. మంచి ఫలితాలు వచ్చేవి. నాణ్యత ప్రమాణాల్లో కూడా బేష్‌ అనిపించుకున్న పాఠశాల మండలంలోని పడమట నర్సాపురంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రస్తుతం ఈ పాఠశాల వివాదాల సుడిగుండంలో ఇరుక్కొవడంతో తల్లిదండ్రుల్లో పాఠశాలపై రోజురోజుకి నమ్మకం సన్నగిల్లుతోంది. పాఠశాలలో ఈ ఏడాది 3 నుంచి పదో తరగతి వరకు 550మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి బోధన చేయడానికి మొత్తం 19మంది ఉపాధ్యాయులు ఉన్నారు. కాగా వీరిలో రెగ్యూలర్‌ ఉపాధ్యాయులు నలుగురు ఉండగా, ఐదుగురు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. మరో 10మంది సీఆర్‌టీలుగా పని చేస్తున్నారు. 


ఉపాధ్యాయుల్లో వివాదం..  విద్యార్థినీలపై ప్రభావం


పాఠశాల హెచ్‌ఎం బాధ్యతలను రెగ్యూలర్‌ ఉపాధ్యాయుడికి అప్పగించారు. కాగా హెచ్‌ఎం, వార్డెన్‌ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరంటే ఒకరికి పొసగటం లేదు. రెండువర్గాలుగా ఉపాధ్యాయులు చీలిపోయి ఎవరికి వారే పై చేయి సాధించాలనే తాపత్రయంతో అసలు బాధ్యతలను విస్మరించడం గమనార్హం. ఈ పోరులో ఒక్కొవర్గానికి ఒక్కొ గిరిజన సంఘం నాయకులు కొమ్ముకాస్తు పాఠశాలలోకి రంగ ప్రవేశం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో పాఠశాలలో జరిగే పరిణామాలన్నీ బహిరంగం కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఉపాధ్యాయులు వివాదాలతో కాలం వెళ్లబుచ్చడం బోధనాభ్యసన పక్రియకు భంగం వాటిల్లి విద్యార్థినీల ప్రగతిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దీంతో క్రమంగా ఈ పాఠశాలలో చేరిన బాలికలు పునరాలోచనలో పడ్డారు.


అడుగడుగునా నిర్లక్ష్యం.. కనపించని నాణ్యత


బోధన విషయంలోనూ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ప్రశ్నించేదిగా ఉంది.. ఆధిపత్యం కోసం వెంపర్లాడుతూ బోధనపై దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తోన్నాయి. అదేవిధంగా భోజన విషయంలోను విద్యార్థినులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాణ్యత పాటించకపోవడంతోపాటు మొక్కుబడిగా వ్యవహరిస్తూ మెనును పాటించకపోవడం మో వివాదంశంగా మారుతోంది. ఇటీవల వసతిగృహాన్ని ఎంపీడీవో సందర్శించిన క్రమంలో ప్రతిరోజు ఒకే రకమైన అల్పాహారాన్ని అందిస్తున్నారని విద్యార్థినీలు చెప్పినట్లు సమాచారం. 


కొరవడిన ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ..


పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు రెండువర్గాలుగా విడిపోయి ఆధిపత్యపోరు సాగిస్తున్నారు. కొన్ని నెలలుగా పాఠశాలలో ఇవే పరిణామాలు ఉన్నప్పటికి ఐటీడీఏ అధికారులు విచారణ నిర్వహించకపోవడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆశాఖాధికారుల పర్యవేక్షణ కొరవడటంతోనే పాఠశాలలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై శాఖాపరమైన  చర్యలు తీసుకోవాలని, గాడితప్పిన పాఠశాల సిబ్బందిని సరైన మార్గంలో పెట్టాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 


వర్గాలుగా ఏర్పడితే చర్యలు తీసుకుంటాం:  ఏటీడీవో రూపాదేవి


ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు వర్గాలుగా ఏర్పడితే విచారణ చేపట్టి సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. వారిని బదిలీ చేస్తాం. మెను పాటించకుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 


Updated Date - 2022-08-08T05:13:57+05:30 IST