కుక్కల బెడద తీరినట్లే!

ABN , First Publish Date - 2022-05-15T05:28:16+05:30 IST

స్వైర విహారం చేస్తున్న కుక్కలను నియంత్రించేందుకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్‌ సిబ్బంది, అధికారులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఒకప్పుడు సిద్దిపేట పట్టణం పందులకు నిలయంగా మారడంతో మచ్చుకైనా కనిపించకుండా చేసుకోగా, ఇటీవల వానరాలను అటవీ ప్రాంతంలోకి పంపించి కోతుల బెడద నుంచి తప్పించగా, ప్రస్తుతం వీధి కుక్కల నుంచి ఉపశమనం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కుక్కల పెరుగుదల ఉండకుండా పలు ఏజెన్సీలకు అప్పగించి వాటికి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.

కుక్కల బెడద తీరినట్లే!


వీధీ కుక్కల స్వైర విహారానికి సిద్దిపేట మున్సిపల్‌ అడ్డుకట్ట

పట్టణంలోని 43 వార్డుల్లో 1,800 కుక్కల గుర్తింపు

వాటిలో 1,658 కుక్కలకు ఆపరేషన్లు, యాంటీ రేబీస్‌ ఇంజక్షన్లు


సిద్దిపేట టౌన్‌, మే 14: స్వైర విహారం చేస్తున్న కుక్కలను నియంత్రించేందుకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు సిద్దిపేట మున్సిపల్‌ సిబ్బంది, అధికారులు అడ్డుకట్ట వేస్తున్నారు. ఒకప్పుడు సిద్దిపేట పట్టణం పందులకు నిలయంగా మారడంతో మచ్చుకైనా కనిపించకుండా చేసుకోగా, ఇటీవల వానరాలను అటవీ ప్రాంతంలోకి పంపించి కోతుల బెడద నుంచి తప్పించగా,  ప్రస్తుతం వీధి కుక్కల నుంచి ఉపశమనం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కుక్కల పెరుగుదల ఉండకుండా పలు ఏజెన్సీలకు అప్పగించి వాటికి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.


ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌

వీధి కుక్కల నియంత్రణ, నిర్వహణ, వ్యాక్సిన్‌ల అభివృద్ధి, స్టెరిలైజేషన్‌, వ్యాక్సినేషన్‌ మొదలైనవి ఖర్చుతో కూడుకున్న పద్ధతులు. నియమ నిబంధనలకు లోబడి సిద్దిపేట పట్టణ పరిధిలో వీధి కుక్కలను ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ యాక్టు కింద కుక్కల పెరుగుదల నియంత్రణను మొదలుపెట్టారు. సిద్దిపేటను కుక్కల బెడదలేని పట్టణంగా మార్చేందుకుగానూ మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ కార్యక్రమం నిర్వహిస్తూనే, యాంటీ రేబిస్‌ నివారణ టీకాలను సైతం వేస్తున్నారు.


కుక్క కాటు కేసులు తగ్గాయి

కుక్కలు కరవడం వల్ల రేబిస్‌ సోకడంతో పాటు నెలల పాటు పత్యం చేయాల్సి రావడం, ఏఆర్‌వీ మందుల కొరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కుక్కల సంతానాన్ని నియంత్రించడమే పరిష్కార మార్గంగా ఎంచుకున్నది. ఇది తేలికైన విషయం కాదు. ఖర్చుతో కూడుకున్న విషయమని, ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఈ ఆపరేషన్లు చేసేందుకు నిర్ణయించింది. దీని వల్ల గతంతో పోల్చితే సిద్దిపేట పరిధిలో కుక్క కాటు కేసులు చాలా మేరకు తగ్గిపోయాయి.


1800 ఆడ కుక్కల గుర్తింపు

సిద్దిపేట పట్టణంలోని 43 వార్డుల్లో 1800 ఆడ కుక్కలున్నట్లు మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది గుర్తించారు. దీంతో గుర్తించిన ఆడ కుక్కలను పత్యేక వలల ద్వారా పట్టుకుని, వాహనం ద్వారా పట్టణంలోని పశువుల ఆసుపత్రి వెనుక భాగాన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శస్త్రచికిత్స చేసిన తర్వాత కుట్లు ఆరే వరకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనివల్ల వీధి కుక్కల సంఖ్యను తగ్గించే అవకాశముంది. ఇప్పటివరకు 1800 కుక్కలలో 1658 కుక్కలకు బర్త్‌ కంట్రోల్‌ ఆపరేషన్లను ఏజెన్సీ వారు నిర్వహించారు. మిగిలిన 142 కుక్కలకు త్వరలోనే ఆపరేషన్లను నిర్వహించనున్నారు.


ఒక్కో శునకానికి ఖర్చు రూ.1,400

కాగా సిద్దిపేటలో ఒక్కో కుక్కకు ఆపరేషన్‌ చేయించాలంటే రూ.1,400 ఖర్చవుతుందని మున్సిపల్‌ అధికకారులు చెప్పారు. కాగా సిద్దిపేటలో ఇప్పటి వరకు 1658 కుక్కలకు చేయడం ద్వారా రూ.23.21 లక్షలను ఖర్చు చేసింది. ఏజెన్సీ నిర్వహకులు ఈ ఆపరేషన్‌ చేసిన కుక్కను ఐదు రోజుల పాటు ప్రత్యేక శ్రద్ధతో చూడటంతో పాటు కుట్లు విడిపోకుండా గమనిస్తూ ఉంటున్నారు. ఇలాంటి పర్యవేక్షణ ఉంటే కాని కుక్కకు శస్త్రచికిత్స ఫలించదని ఏజెన్సీ సిబ్బంది తెలిపారు.  


వందశాతం పూర్తేయ్యేలా కృషి చేస్తాం

సిద్దిపేట పట్టణంలోని కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి సమయాల్లో కుక్కలు వాహనాలు వెళుతుంటే వారి వెంట వేగంగా పరుగెత్తుండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు, కమిషనర్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. త్వరలోనే వందశాతం పూర్తయ్యేలా కృషి చేస్తాం. అందుకుగాను ఏజెన్సీ వారికి ఈ నిర్వహణ బాధ్యత అప్పగించాం. వీధి కుక్కలు గుర్తించడంతో పాటు వాటిని పట్టుకోవడం, శస్త్రచికిత్స నిర్వహించడంతో పాటు కుట్లు ఆరేంతవరకు వాటిని కాపాడడం, యాంటీ రేబీస్‌ ఇంజక్షన్‌ ఇవ్వండం, తిరిగి పట్టుకున్న చోటే వదిలివేయడం ఇలా ఏజెన్సీ వారు నిర్వహిస్తారు. 

- శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, సిద్దిపేట మున్సిపల్‌



Updated Date - 2022-05-15T05:28:16+05:30 IST