Abn logo
Jan 25 2021 @ 00:07AM

నిషేధం అమలయ్యేనా?

కామారెడ్డిలో ప్లాస్టిక్‌ కవర్లలోనే కూరగాయలు తీసుకెళ్తున్న ప్రజలు

ప్లాస్టిక్‌ వాడకంపై నిషేదాజ్ఞలు

అయినా యథేచ్ఛగా ప్లాస్టిక్‌ అమ్మకాలు

నిబంధనలను బేఖాతారు చేస్తున్న వ్యాపారులు

కామారెడ్డి మున్సిపాలిటీలో పూర్తిస్థాయిలో అమలు కాని ప్లాస్టిక్‌ నిషేధం

కామారెడ్డి టౌన్‌, జనవరి 24: పర్యావరణానికి ప్రమాదంగా మారిన ప్లాస్టి క్‌ వాడకం రోజు రోజుకూ పెరిగిపోతోంది. ప్లాస్టిక్‌ నియంత్రణ మున్సిపాలిటీ ల్లో అధికారులకు సవాల్‌గా మారింది. కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో ప్లాస్టిక్‌ నిషేధం అమలులో కొంత మంది వ్యాపారులు నిబంధనలు బేఖాతారు చేస్తు న్నట్లు సమాచారం. విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ కవర్ల వినియోగంతో పర్యవరణా నికి ముప్పు వాటిల్లుతుందని రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్‌ నిషేధా న్ని అమలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలవుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో మెరుగైన ర్యాంకు సాధించేందుకు మున్సిపల్‌ అధికారులు కృషి చేస్తుంటే వ్యాపారులు మాత్రం పాత పద్ధతి వైపే మొగ్గు చూపుతున్నా రు. కామారెడ్డి పట్టణంలో గత సంవత్సరంన్నర కిందట ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేసి మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన శైలజ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు దాడులు చేసి ప్లాస్టిక్‌ అమ్మకాలను కట్టడి చేస్తూ వచ్చారు. అందుకు అనుగుణంగా వ్యాపార సంస్థలు, కిరాణ దుకాణాలు, ఫంక్షన్‌హాల్‌ల కమిటీ సభ్యులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్లాస్టిక్‌ నిషేధంపై దృష్టి సారించడంతో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. కానీ ప్రస్తుతం ప్లాస్టిక్‌పై మున్సిపల్‌ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారిం చకపోవడంతో అమ్మకాలు మళ్లి జోరందుకున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్నా ఆయా వ్యాపార సంస్థలపైనే దృష్టి సారిస్తే కామారెడ్డి ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా మారుతుందని పర్యావరణ ప్రేమికులు తమ అభిప్రాయం పడుతున్నారు.

ప్లాస్టిక్‌ నిషేధం ఎలా?

రోజురోజుకూ పెరుగుతున్న పట్టణ జనాభాకు అదేస్థాయిలో వ్యర్థాలు పెరుగుతున్నాయి. పర్యావరణాన్ని అన్ని విధాలా కలుషితం చేసే పాలిఽఽథిన్‌ కవర్లు వ్యర్థాల నిర్వహణ పారిశుధ్య సిబ్బందికి పెద్దసమస్యగా మారింది. 49 వార్డుల నుంచి ప్రతీరోజు టన్నుల కొద్ది చెత్త పోగవుతోంది. కామారెడ్డి మార్కెట్‌ ప్రాంతాల్లో, వ్యాపార సముదాయాల్లో ఇంకా కొంత మంది వ్యాపా రులు నిషేధిత కవర్లను బహిరంగంగానే విక్రయిస్తుండడంతో పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడడం లేదు. ముఖ్యంగా ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్‌తో మరిం త నష్టం పొంచి ఉంది. కామారెడ్డితో పాటు జిల్లాలోని మరో రెండు మున్సిపా లిటీల పరిధిలోనూ నిషేధం నామ మాత్రంగానే మారింది. ప్రజల భాగస్వా మ్యానికి తోడు అధికారుల కఠిన చర్యలు, వ్యాపారుల తోడ్పాటుతో కొంత కాలానికి పరిశుభ్రమైన పట్టణాలుగా మారే అవకాశం ఉంది. అయితే చాలా చోట్ల ప్రజల్లో అవగాహన లేమితో పాటు కొంత మంది వ్యాపారుల నిర్లక్ష్యం మూలంగా నిషేధిత ప్లాస్టిక్‌ విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. గతంలో ప్రత్యేకఅధికారి పాలనలో భారీ జరిమానాలతో చాలా చోట్ల కొంత మార్పు వచ్చినప్పటికీ ప్రస్తుతం యాదావిధిగా విక్రయాలు జరుపుతున్నట్లు మున్సిపల్‌ సిబ్బందే పేర్కొంటుండడం గమనార్హం. కొత్తగా ఏర్పడిన బాన్సువాడ, ఎల్లారెడ్డితో పాటు కామారెడ్డి మున్సిపాలిటీల్లో నిబంధనలు అమలు అట్టకెక్కినట్లు తెలుస్తోంది. ఆయా మున్సిపల్‌ అధికారులతో పాటు ప్రజల భాగస్వామ్యం కరువవడంతో ప్లాస్లిక్‌ వినియోగం పెరిగిపోతుందని తెలుస్తోంది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో వెనకపడే అవకాశం

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్‌లో భాగంగా పట్టణాలను క్లీన్‌ సిటీలుగా మార్చేందుకు 2016 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పేరుతో సర్వే చేపడుతోంది. మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్‌ నిషేధం, పరిసరాల శుభ్రత, పచ్చ దనం తదితర అంశాలను లెక్కలోకి తీసుకుని విభాగాల వారీగా మార్కులు కేటాయిస్తోంది. ప్రస్తుతం కామారెడ్డి మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పోటీ పడేందుకు సిద్ధమవుతుండగా స్థానిక వ్యాపారులు వారి తీరు మార్చుకుంటే ఉత్తమ ర్యాంకు సాధించుకునే అవకాశం ఉంటుందని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

పకడ్బందీగా నిషేధం అమలు చేస్తాం

నిట్టు జాహ్నవి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కామారెడ్డి.

కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను అమ్ముతున్నారనే సమాచారం అందితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం. ప్లాస్టిక్‌ రహిత కామారెడ్డిగా తీర్చి దిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తాం. అందుకు గాను  అన్ని వ్యాపార సంస్థలు, ఫంక్షన్‌హాళ్లు లాంటి తదితర వ్యాపారసంస్థల నిర్వాహకులు సహకరించాలి.

Advertisement
Advertisement