Abn logo
Nov 30 2020 @ 01:18AM

పంటల బీమా వర్తించదా!?

పాయకరావుపేట మండలం గోపాలపట్నంలో కుళ్లిపోతున్న వరి పైరును చూపుతున్న రైతు

నివర్‌ తుఫాన్‌ బాధిత రైతుల సందేహం

ఇన్‌పుట్‌ సబ్సిడీని ప్రకటించిన ప్రభుత్వం

33 శాతం కన్నా ఎక్కువ పంట నష్టపోతేనే వర్తింపు

అది కూడా ఎకరాకు ఆరున్నరవేలే!

పంట చేతికొచ్చే దశ కావడంతో పూర్తిగా నష్టపోయిన అన్నదాతలు

ఎకరాకు రూ.25-30 వేల వరకు పెట్టుబడి

పంట కోత ప్రయోగాలతో బీమా పథకం అనుసంధానం

25 శాతం క్షేత్రాల్లోనే ప్రయోగ కోతలు పూర్తి

మిగిలిన ప్రాంతాల్లో నష్టం అంచనాపై సందేహాలు

అధికారులు నివృత్తి చేయాలని రైతుల వినతి


విశాఖపట్నం, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో పూర్తిగా నీటమునిగి పాడైపోయిన వరి పంటకు ‘వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం’ వర్తిస్తుందా? లేదా? అన్న సందేహాన్ని బాధిత రైతులు వ్యక్తం చేస్తున్నారు. తుఫాన్‌, వర్షాలు, వరదల కారణంగా ఏ రైతుకైనా 33 శాతానికిపైగా పంట నష్టం వాటిల్లితే ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఎకరాకు రూ.6,500 చొప్పున ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వాస్తవంగా చూస్తే వరి సాగుకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడి అయ్యింది. పంటల బీమా పథకం ప్రకారం చూస్తే ఎకరాకు రూ.32 వేల మేర పరిహారం అందాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఆరున్నర వేల సాయం ప్రకటించడంతో బీమా పథకం పరిహారం అందుతుందా? లేదా? అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాలని రైతులు కోరుతున్నారు.  


జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 1,02,740 హెక్టార్లలో వరి సాగు జరిగింది. సాగుచేసిన మొత్తం విస్తీర్ణం గ్రామాల వారీగా రైతులు, భూముల సర్వే నంబర్లు వారీగా ఈ-క్రాప్‌ నమోదు చేశారు. ఈ-క్రాప్‌లో నమోదు చేసిన ప్రతి రైతుకు ‘వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం’ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలతోపాటు అనావృష్టి, తెగుళ్ల వల్ల పంట పూర్తిగా దెబ్బతింటే బీమా పథకం కింద ఆయా రైతులకు నష్టపరిహారం అందుతుంది. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి వేరుగా ఉంది. కోతకొచ్చే దశలో ఈదురు గాలులు, భారీ వర్షాలకు వేలాది ఎకరాల్లో వర పంట నేలకొరిగి, నీట మునిగింది. కోత కోసిన పొలాల్లో పనలు తడిసిపోయాయి. రోజుల తరబడి వరి పనలు నీటిలో ఉండడంతో ధాన్యం మొత్తకెత్తడం వంటి సంఘటనలు జరిగాయి. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన ప్రాథమిక అంచనా మేరకు జిల్లాలోని 27 మండలాల్లో 23 వేల మంది రైతులకు సంబంధించి 11,500 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నది. పంట చేతికొచ్చిన తరుణం కాబట్టి పెట్టుబడి మొత్తం నష్టపోయినట్టే. 


ఇదిలావుండగా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం వర్తింపునకు పంట కోత ప్రయోగాలను అనుసంధానం చేశారు. జిల్లాలో 3,800 పంట కోత ప్రయోగాలు చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇప్పటి వరకు సుమారు 900 పంటకోత ప్రయోగాలు పూర్తిచేశారు. దీంట్లో 700 వరకు ఏజెన్సీలో, మిగిలిన 200 మైదానంలో చేపట్టారు. సాధారణంగా పంట కోత ప్రయోగం చేసిన 14 రోజుల్లో పంట దెబ్బతింటే... అంటే పనలు, కుప్పలు, నూర్చే సమయంలో తడిసిపోయినా/నీరు ప్రవేశించినా /ఇతరత్రా ప్రమాదం జరిగినా బీమా వర్తిస్తుంది. ఏజెన్సీలో పంట కోత ప్రయోగాలు పూర్తయిన వాటిలో వర్షాలకు దెబ్బతిన్న మండలాల్లో చింతపల్లి, కొయ్యూరు, జీకేవీఽధి ఉన్నాయి. మైదానంలో ప్రయోగాలు పూర్తిచేసిన మండలాల్లో వర్షం అధిక ప్రభావం చూపింది. జిల్లాలో ఇంకా 2,900 పంట కోత ప్రయోగాలు చేయాల్సి ఉంది. వీటిలో అధిక భాగం మైదానంలో వున్నాయి. పంట బాగా పండినప్పటికీ, చేతికి అందే సమయంలో దెబ్బతినడంతో నష్టాన్ని ఏ విధంగా అంచనా వేస్తారు అనేదానిపై రైతుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నాలుగు రోజులపాటు వర్షాలు పడడంతో పలుచట్ల కోత కోసిన వరి పనలు తడిపోవడం, నీట మునగడం జరిగింది. ఇటువంటి పొలాల్లో గింజలు మొలకెత్తడం లేదా పైరు కుళ్లిపోవడం జరిగింది. మరి కొన్నిచోట్ల కోతకోయని వరిపైరు గాలులకు నేల వాలింది. లోతట్టు ప్రాంతాల్లో రోజుల తరబడి నీరు నిల్వ వుండడంతో పైరు కుళ్లిపోతున్నది. అందువల్ల  మొలకెత్తిన/ రంగుమారిన ధాన్యాన్ని ప్రామాణికంగా తీసుకుంటారా? లేక మొత్తం పంట నీటిలో కుళ్లిపోయిన చోట దిగుబడిని లెక్కలోకి తీసుకుంటారా? అనేది వ్యవసాయ శాఖ స్పష్టం చేయాల్సి ఉంది. మరో సందేహమేమిటంటే.. గతంలో ప్రైవేటు/ప్రభుత్వ బీమా కంపెనీలు రైతుల నుంచి ప్రీమియం తీసుకుని పంటలను బీమా చేసేవి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే బీమాసంస్థ ఏర్పాటు చేసింది. దీంతో ఒక పక్క ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చి, మరోవైపు బీమా పథకం కింద పరిహారం ఇస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 


తిండి గింజలకోసం ఆరాటం

నివర్‌ తుఫాన్‌ ఛాయలు అన్నదాతలను నీడలా వెంటాతూనే వున్నాయి. వర్షాలు తగ్గినప్పటికీ వరి పొలాల్లో నీరు తగ్గలేదు. చాలాచోట్ల కోత కోసిన వరి పంట ఇంకా నీటిలోనే నానుతున్నది. ఆదివారం వర్షం పడకపోవడం, ఎండ కాయడంతో తడిసిన, నీటముని గిన, గాలులకు పడిపోయిన వరి పైరును కాపాడు కోవడనికి అన్నదాతలు కుటుంబాలతో సహా పొలం బాట పట్టారు. పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పోయేలా చర్యలు తీసుకున్నారు. నానిపోయిన వరి పనలకు గట్లపైకి చేరుస్తున్నారు. వర్షాలకు ముందు కుప్ప వేసిన రైతులు నూర్పిడి పనులు చేస్తున్నారు. కాగా టీడీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీ శ్వరరావు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద(అనకాపల్లి), కొండపల్లి అప్పలనాయుడు(గజపతినగరం), తదితరులు ఆదివారం కశింకోట మండలంలో నీటమునిగిన వరిపంటను పరిశీలించారు.  ఎకరా వరికు రూ.30 వేల వంతున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  రాంబిల్లి మండలం కుమ్మరాపల్లిలో ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, టీడీపీ నేతలు  వరి పొలాలను సందర్శించి, బాధిత రైతులతో మాట్లాడారు.


Advertisement
Advertisement
Advertisement