ఇంటి వద్దకే కరోనా వైద్యం

ABN , First Publish Date - 2020-07-12T06:53:55+05:30 IST

అసలే కరోనా కాలం.. ఆపై ఆస్పత్రుల్లో కొన్ని కొవిడ్‌కు ప్రత్యేకంగా కేటాయింపు.. ఈ నేపథ్యంలో సాధారణ రోగులకు వైద్యం ఒకింత కష్టమవుతోంది. ధైర్యం చేసి ఆస్పత్రులకు వెళ్దామనుకున్నా...

ఇంటి వద్దకే కరోనా వైద్యం

  • అహ్మదాబాద్‌లో ‘ధన్వంతరి రథాల’ ప్రయోగం
  • ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని మోదీ
  • ఇతర ప్రాంతాల్లోనూ అమలుకు సూచన

న్యూఢిల్లీ, జూలై 11: అసలే కరోనా కాలం.. ఆపై ఆస్పత్రుల్లో కొన్ని కొవిడ్‌కు ప్రత్యేకంగా కేటాయింపు.. ఈ నేపథ్యంలో సాధారణ రోగులకు వైద్యం ఒకింత కష్టమవుతోంది. ధైర్యం చేసి ఆస్పత్రులకు వెళ్దామనుకున్నా.. ఎక్కడ వైరస్‌ అంటుకుంటుందోనని ఆందోళనతో వెనుకంజ వేసేవారెందరో..! ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ మునిసిపల్‌ యంత్రాంగం వినూత్న ఆలోచన చేసింది. నాన్‌ కొవిడ్‌ రోగులకు ఇంటి వద్దకే వెళ్లి వైద్య సేవలందించేందుకు ‘ధన్వంతరి రథా’ల పేరిట ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రజలకు చక్కటి ప్రయోజనం చేకూరుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.


కరోనా కట్టడి-రాష్ట్రాల సన్నద్ధతపై శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అహ్మదాబాద్‌ ‘ధన్వంతరి రథాల’ పనితీరును కొనియాడి.. ఈ కార్యక్రమాన్ని మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయాలని సూచించారు. మరోవైపు అత్యధిక పాజిటివ్‌ రేటు నమోదవుతున్న రాష్ట్రాలపై జాతీయ స్థాయిలో నిరంతర పర్యవేక్షణకు ప్రధాని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కట్టడికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక యంత్రాంగం ఉమ్మడిగా కృషి చేశాయని ప్రశంసించారు. జాతీయ రాజధాని రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) పరిధిలోనూ దీనిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. వైర్‌సపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. 


Updated Date - 2020-07-12T06:53:55+05:30 IST