రెఫర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్న వైద్యులు

ABN , First Publish Date - 2022-06-13T06:33:04+05:30 IST

రోగులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... వైద్యం అందదు... మందులు ఇవ్వరు.. సౌకర్యాలు కల్పించరు.. అన్న చందంగా తయారైంది ప్రభుత్వాస్పత్రుల తీరు.

రెఫర్‌ చేస్తూ చేతులు దులుపుకుంటున్న వైద్యులు
అనంతపురం ప్రభుత్వాస్పత్రిలోని కాన్పుల వార్డులో రెండు మంచాలపై ముగ్గురు బాలింతలు

మెరుగైన వైద్యం  పేరిట..

పీహెచసీల నుంచి పెద్దాస్పత్రి 

వరకూ అదే తీరు

ప్రభుత్వాసుపత్రుల్లో అన్నీ సమస్యలే..

వైద్యం అందదు.. మందులివ్వరు..

రెండు పడకలపై ముగ్గురు బాలింతలు

రోగుల బాధలు వర్ణనాతీతం


 గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం వస్తే ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం అంటూ రెఫర్‌ చేస్తుండటం పరిపాటిగా మారింది. పెద్దాసుపత్రిలోనైనా వైద్యం అందదా అని ఆగమేఘాల మీద ఇక్కడికి వచ్చినా అదే పరిస్థితి. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి బాధలు చూడలేక ప్రైవేటు ఆస్పత్రు లను ఆశ్రయిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కోసం చేరినా అక్కడ అన్నీ సమస్యలే. గర్భిణులు, బాలింతలకు మంచాల కొరత.. ఫ్యాన్లు, ఏసీలు పనిచేయవు.. పరికరాలు పనిచేయక మూలన పడేయటం తదితర ఇబ్బందులతో రోగులకు అవస్థలు తప్పడం లేదు.  వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా... క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ప్రతి ఆస్పత్రిలోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నా... ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు చొరవ చూపడం లేదు. దీంతో రోగులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే... వైద్యం అందదు... మందులు ఇవ్వరు.. సౌకర్యాలు కల్పించరు.. అన్న చందంగా తయారైంది ప్రభుత్వాస్పత్రుల తీరు. 

- అనంతపురం ఆంధ్రజ్యోతి


 రెండు మంచాలపై ముగ్గురు బాలింతలు..

అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కాన్పుల వార్డులో బాలింతలు ఎదుర్కొంటున్న సమస్యలు అత్యం త దయనీయం. రెండు మంచాలపై ముగ్గురు బాలింతలకు కేటాయిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సిజేరియన చేయించుకున్న బాలింతలు ముగ్గురు కలిసి ఒకే పడకపై చంటిబిడ్డలతో పడుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారు. సిజేరియన క్రమంలో ఆ కుట్లు ఎక్కడ తెగిపోతాయోనని నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తోంది. చంటిబిడ్డలకు పాలివ్వాలంటే... ఆ మంచంలో ఉన్న మరో బాలింత లేచి కూర్చోవాల్సిందే. జిల్లా ప్రభుత్వ సర్వజనాస్పత్రి కావడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న గర్భిణులు పురుడుకోసం రోజుకు పదుల సంఖ్యలో వస్తుంటారు. పురుడు తరువాత ఆ మేరకు సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతు న్నారు. మరోవైపు ఏ విభాగంలోనూ ఏసీలు, ఫ్యాన్లు పనిచేయడం లేదు. వేసవి నేపథ్యంలో... ఉక్కపోతతో రోగులు తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. ఇంటివద్ద నుంచే టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుని ఉపశమనం పొందుతున్నారు. 


శిశు సంజీవని విభాగంలో సౌకర్యాలు అంతంతే...

శిశు సంజీవని విభాగంలోనూ సౌకర్యాలు అంతంతే. అనారోగ్యం, బరువు తక్కువ పిల్లలను శిశు సంజీవనిలో ఉంచి చికిత్స అందించాలి. రోజుకు పదు ల సంఖ్యలో ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో గర్భిణులు పురుడు పోసుకుంటున్న క్రమంలో ఆ మేరకు సరిపడా వెంటిలేటర్లు లేవు. కేవలం 20 వెంటిలేటర్స్‌  ఉన్నాయి. రోజుకు 30 నుంచి 40 మంది నవ జాత శిశువులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఒక్కో వెంటిలేటర్‌పై ఇద్దరు ముగ్గురు నుంచి చికిత్స అందించాల్సి వస్తోంది. అయినప్పటికీ... సరైన వైద్యం అందక నెలకు 30 నుంచి 40 మంది చిన్నారులు చనిపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే సంజీవని విభాగంలో పసిబిడ్డల మృత్యుఘోష వినిపిస్తోంది. 


వైద్యులు, సిబ్బంది కొరతతో అందని సేవలు...

అనంతపురం ప్రభుత్వసర్వజనాస్పత్రిలో 500 పడకలున్నాయి. 1200 మందికి తగ్గకుండా ప్రతిరోజూ ఇనపేషెంట్ల సంఖ్య ఉంటోంది. ఇక జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 1500 నుంచి 2వేల మంది వరకూ వివిధ వ్యాధులకు వైద్యం కోసం వచ్చే రోగుల సంఖ్య ఉంటోంది. అందుకనుగుణంగా ఇనపేషెంట్లు, ఓపీకొచ్చే రోగులకు వైద్యమందించేందుకు సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు. 241 మంది వైద్యులుండాల్సిన చోట కేవలం 168 మంది ఉన్నారు. సిబ్బంది పరిస్థితి అలాగే ఉంది. ఈ పరిస్థితుల్లో వైద్యులు, సిబ్బందిపై పనిఒత్తిడి పెరగడంతో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించలేకపోతున్నారు. ఈ క్రమంలో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంతో బయట తెచ్చుకోవాలని చేతులు దులుపుకుం టున్నారు. 


పేరుకే 30 పడకల ఆస్పత్రి...

కళ్యాణదుర్గంలో పేరుకు మాత్రమే 30 పడకల ఆస్పత్రి ఉంది. 10 మంది డాక్టర్లకుగాను నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. అత్యవసర చికిత్సలు చేసేందుకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. ఏ చిన్నపాటి జబ్బు తో వచ్చినా... జిల్లా కేంద్రానికి రెఫర్‌ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీనికి తోడు ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు మాట అటుంచితే... రోగులకు మరుగుదొడ్లు, నీటిసౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా... గైనకాలజిస్ట్‌ లేకపోవడంతో పురుడు పోయడమే మానేశారు. మూడేళ్లుగా ఆసుపత్రి అభివృద్ధికి ఒక్క పైసా నిధులు విడుదల చేయలే దంటే... పరిస్థితి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జ్వరానికిచ్చే పారాసిటమ ల్‌ సిరఫ్‌ అందుబాటులో లేని పరిస్థితి అక్కడి రోగు లు ఎదుర్కొంటున్నారు. దీంతో చిన్నపిల్లలకు సరైన వైద్యసేవలు అందడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్డీటీ ఆస్పత్రే అక్కడి రోగులకు దిక్కయింది. 


గుత్తిలో రోగుల అవస్థలు వర్ణనాతీతం...

గుత్తిలో  24 గంటలు వైద్యం అందిం చాలని ఉన్నా ఇక్కడ మాత్రం సరైన వైద్యం అందడం లేదు. ఆస్ప త్రి జాతీయ రహదారికి పక్కనే ఉండ టంతో... ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో ప్రథమ చికిత్స చేసే పరిస్థితి కూడా ఆ ఆస్పత్రిలో లేదు. వైద్యులు, సిబ్బంది కొరత ఆస్పత్రిని వెంటాడుతోంది. ప్రతిరోజూ 200 నుంచి 300 మంది రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. వారికి సరైన వైద్యం చేయకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో ఎక్స్‌రే ప్లాంట్‌ ఉన్నా... అది నిరుపయోగంగానే ఉంది. స్వల్ప మరమ్మతులు చేస్తే... పనిచేసే యంత్రాన్ని గాలికొదిలేశారు. 


వైద్యుల కోసం తప్పని నిరీక్షణ...

ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లిన రోగులకు నిరీక్షణ తప్పడం లేదు. ప్రతిరోజూ ఈ ఆస్పత్రికి 600 మందికిపైగా రోగులు వైద్యంకోసం వస్తుంటారు. 9 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఉన్న డాక్టర్లు ఎప్పుడొస్తారో... ఎప్పుడు వైద్యమందిస్తారోనని రోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 


గుంతకల్లు ఆస్పత్రిలో అస్తవ్యస్తం...

గుంతకల్లు ఆస్పత్రిలో సౌకర్యాలే కాదు... వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రధానంగా ఈఎనటీ, సర్జన, గైనిక్‌, అనస్తీషియన్లకు సంబంధించిన వైద్యులు లేరు. నర్సుల పోస్టులు 8దాకా ఖాళీగా ఉన్నాయి. ఎంఎనఓలు, ఎఫ్‌ఎనఓల ఖాళీలు లేకపోలేదు. మొత్తం మీద ఆస్పత్రిని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. దీనికి తోడు ఆస్పత్రి భవన నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో... రోగులు ప్రైవేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. పొరపా టున రోగి ఆస్పత్రికి వెళ్తే... ఆ రోగికి అవసరమైన మందులు బయట కొనుక్కోవాలని చీటీ రాసి పంపిస్తున్నారు.


Updated Date - 2022-06-13T06:33:04+05:30 IST