సేఫ్టీ కిట్ల కొరత... పీఓకేలో వైద్యుల నిరనస

ABN , First Publish Date - 2020-04-03T21:20:00+05:30 IST

కరోనా పేషెట్లంతో సతమతమవుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో వైద్య సిబ్బందికి కొత్త సమస్య వచ్చిపడింది. పేషెంట్లకు వైద్య చికిత్స ఇచ్చే సమయంలో తమ వ్యక్తిగత భద్రత ప్రమాదంలో ..

సేఫ్టీ కిట్ల కొరత... పీఓకేలో వైద్యుల నిరనస

ముజఫరాబాద్: కరోనా పేషెట్లంతో సతమతమవుతున్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో వైద్య సిబ్బందికి కొత్త సమస్య వచ్చిపడింది. పేషెంట్లకు వైద్య చికిత్స ఇచ్చే సమయంలో తమ వ్యక్తిగత భద్రత ప్రమాదంలో పడేలా ఉందని, తమకు సేఫ్టీ కిట్లు అందుబాటులో లేవంటూ యంగ్ డాక్టర్ అసోసియేషన్ (వైడీఏ)కు చెందిన పలువురు వైద్యులు నిరసన తెలిపారు.


వైద్య పరీక్షల కిట్లు, మాస్క్‌ల కొరత ఉందని, వెంటిలేషన్ సపోర్ట్ కానీ, ఐసొలేషన్ వార్డులు కానీ తగినన్ని లేవని కూడా నిరసనలో పాల్గొన్న వైద్యులు తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో కనీస అవసరాలు కూడా తీర్చడంలో  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాల్లోని వైద్యులతో సమానంగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని, వేతన వ్యత్యాసం కూడా కొనసాగుతోందని వైద్య సిబ్బంది పేర్కొన్నారు.


'మాకు వ్యక్తిగత పరిరక్షణ కిట్లు ఇవ్వాలనేది మొదటి డిమాండ్. రెండవ డిమాండ్ మా వేతనాలకు సంబంధించి. మా అలవెన్సులు పంజాబ్ తదితర ప్రాంతాల వైద్యులతో సమానంగా ఇవ్వాలి. మా డిమాండ్లు పరిష్కరించకుంటే మేము పూర్తి స్థాయిలో సమ్మెకు దిగాల్సి ఉంటుంది' అని నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ వైద్యుడు తెలిపారు. స్క్రీనింగ్ కిట్లు లేకుండా ఎలా వైద్యపరీక్షలు జరపాలని మరో వైద్యుడు ప్రశ్నించారు.


కాగా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో వైద్య సదుపాయాల కొరత అనేది చాలాకాలంగా తీవ్ర స్థాయిలో ఉంది. ఈ కష్టాలకు ఇస్లామాబాద్ ప్రభుత్వం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమే కారణమని పీఓకే వైద్యులు మండిపడుతున్నారు. పీఓకేలో ప్రస్తుతం 9 కరోనా కేసులు నమోదు కాగా, గిల్గిత్ బాల్టిస్థాన్‌లో 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-03T21:20:00+05:30 IST