అనాథ పిల్లలున్న హాస్టల్‌లో మీడియాతో మాట్లాడుతున్న పృథ్వీరాజ్
- అనాథ పిల్లలున్న స్థలం జోలికి రావద్దు
- సినీ నటుడు పృథ్వీరాజ్
కడప(మారుతీనగర్), జనవరి 14: అనాథ పిల్లలకు ఆసరాగా హాస్టల్ నడుస్తున్న స్థలం జోలికి రావొద్దని అధికార పార్టీ నేతలకు సినీనటుడు పృథ్వీరాజ్ విన్నవించారు. శుక్రవారం ఆయన కడప పెద్ద దర్గాను సందర్శించారు. అంతకు ముందు ఆకులవీధి వద్ద సర్వశిక్ష అభియాన్ సారధ్యంలో జేఎస్‌ఓఎస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. అనాథ పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి అనాథ పిల్లల హాస్టల్‌పై అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకుల కళ్లు పడ్డాయన్నారు. అనాథలకు ఆసరాగా ఉన్న ఈ స్థలం బలవంతంగా లాక్కోవద్దని కోరారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం కేటాయించిన తర్వాత ఈ స్థలంలో కాంప్లెక్స్ నిర్మించుకోవాలన్నారు. వైఎ్‌స రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నట్లయితే ఇలాంటి దుస్థితి హాస్టల్‌కు వచ్చేది కాదన్నారు. ఏదిఏమైనా ఈ విషయంగా రాజకీయ పెద్దలతో కలుస్తానన్నారు. కార్యక్రమంలో సినీ కెమెరామెన్ శివారెడ్డి పాల్గొన్నారు.