కార్యాలయాలకు రావొద్దు

ABN , First Publish Date - 2020-07-14T11:27:50+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్రత పెరిగిపోవడంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌తో

కార్యాలయాలకు రావొద్దు

కరోనా ఎఫెక్ట్‌తో కళ తప్పుతున్న ఆఫీసులు

భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులు

ఈ-మెయిల్‌, వాట్సాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాని సూచన

నేరుగా సమస్యలు చెప్పుకోలేక వెనుదిరుగుతున్న ప్రజలు

దూరమవుతున్న సేవలు.. ముందుకు సాగని పనులు


ఆదిలాబాద్‌, జూలై13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా వైరస్‌ తీవ్రత పెరిగిపోవడంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. లాక్‌డౌన్‌తో రెండునెలలకు పైగా మూతబడిన ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పుడి ప్పుడే తెరుచుకుంటూ సేవలను ప్రారంభించాయి. కానీ  జిల్లాలో మళ్లీ కరోనా వ్యాప్తి వేగంగా విస్తరిం చడంతో క్రమక్రమంగా అధికారుల సేవలు నిలిచి పోయే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రతీ సోమ వారం నిర్వహించే ప్రజాఫిర్యాదులను కలెక్టర్‌ రద్దు చేశారు.


అలాగే దస్తావేజుల యజమానులు దుకా ణాలను తెరువకపోవడంతో వారం రోజులుగా సబ్‌రి జిస్ర్టార్‌ కార్యాలయాలు మూతబడ్డాయి. తాజాగా అధికారులు కొత్త ఆలోచనతో ప్రజలు, ప్రజాప్రతినిధు లు ఎవరు ఆఫీసులకు రావద్దంటూ కోరుతున్నారు. ముఖ్యంగా నిత్యం రద్దీగా ఉండే రెవెన్యూ, మండల పరిషత్‌, వ్యవసాయ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారులు అప్రమత్త మవుతున్నారు. అలాగే పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యా దుదారుల వివరాలను నమోదు చేసుకుంటూ లోనికి అనుమతిస్తున్నారు.


అత్యవసరమైతే తప్ప ఉన్నతా ధికారులను కలువాలని సూచిస్తున్నారు. ఇన్నాళ్లు మా స్కులు, శానిటేషన్‌ లేనిదే లోనికిరాకూడదన సూచన బోర్డులు కనిపించాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలే ఆఫీసులకు రావద్దంటూ అధికారులు మెసేజు లతో ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారుతోంది. కొన్నాళ్లపాటు ఇదే పరిస్థితి తప్పదంటూ చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల సందడిలేక వెలవెలబోతూ కళతప్పి పోతున్నాయి. అయితే కరోనా సాకుతో అత్యవసర పనులను కూడా అధికారులు పక్కన పెట్టడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.


హోం టూ వర్క్‌కే ప్రాధాన్యం..

ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు కరోనా బారిన పడడంతో అధికార వర్గాల్లో అలజడి రేపుతోంది. దీంతో కార్యాలయాలకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఒక్కవేళ తప్పని సరి పరిస్థితుల్లో వెళ్లిన భయం భయంగానే విధులు నిర్వహిస్తున్నారు. ఎటువైపు నుంచి కరోనా వైరస్‌ వచ్చి పడుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. కొందరు ఉన్నతాధికారులైతే ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు. కార్యాలయానికి వెళ్లినా భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లను చేసుకుంటున్నారు. కార్యాలయ ప్రధాన గేటు వద్ద అటెండర్లను నియమిస్తూ ఎవరూ లోనికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అధికారి అనుమతి ఉంటేనే లోనికి పంపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా అధికారు లంతా హోం టూ వర్క్‌కే ప్రాధాన్యతనిస్తున్నట్లు కనిపిస్తోంది.


ఆన్‌లైన్‌ ఫిర్యాదులు..

కరోనా వైరస్‌ ముప్పు ఉందని భావించిన కొందరు జిల్లా అధికారులు ఆన్‌లైన్‌ ఫిర్యాదులు చేయాలంటూ ప్రజలకు సూచిస్తున్నారు. ప్రత్యేకమైన మెసేజ్‌లను రూపొందించి సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ-మెయిల్‌, వాట్సాప్‌లతో పాటు కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేక ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. కార్యాలయ పని వేళలు ముగిసిన తర్వాత ఫిర్యాదులను పరిశీలించి ఫోన్‌లో సమాధానం ఇస్తున్నారు. మండల స్థాయిలోనైతే శాఖపరమైన వాట్సాప్‌ గ్రూపు నెంబర్‌ను ప్రకటించి వాట్సాప్‌లోనే ఫిర్యాదులు చేయాలంటున్నారు. అలాగే నెట్‌ సౌకర్యం ఉన్న వారు ఈ మెయిల్‌లో ఫిర్యాదు చేయవచ్చు నని సూచిస్తున్నారు. కానీ జిల్లాలో ఇప్పటి వరకు వందలకు పైగా గ్రామాల్లో నెట్‌వర్క్‌ సేవలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


కనిపించని జవాబు దారితనం..

అసలే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అంతా సులువుగా పూర్తికావనేది భావన అందరిలో ఉంటుంది. దీనికి కరోనా పరిస్థితులు తోడుకావడంతో సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కరోనా ఎఫెక్ట్‌తో జవాబు దారితనం పూర్తిగా కనిపించకుండానే పోయిందని కొందరు ఉన్నతాధి కారులు చెబుతున్నారు. ప్రస్తుతం వానాకాల సీజన్‌ ప్రారంభంకావడంతో పల్లెల్లో భూతగదాలు, గెట్ల పంచాయతీలు పెరిగి పోతున్నాయి. కానీ అధికారుల వద్దకు వచ్చే పరిస్థితులు లేక నేరుగా సమస్యలు చెప్పుకోలేక వెనుదిరిగి పోవాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు.

Updated Date - 2020-07-14T11:27:50+05:30 IST