డీఎంకేను గెలిపిస్తే విద్యా రుణాల మాఫీ: స్టాలిన్
ABN , First Publish Date - 2021-01-04T00:01:01+05:30 IST
తమిళనాడులో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకేను గెలిపిస్తే ఉన్నత చదువుల కోసం విద్యార్థులు తీసుకున్న
చెన్నై: తమిళనాడులో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో డీఎంకేను గెలిపిస్తే ఉన్నత చదువుల కోసం విద్యార్థులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈరోడ్ పశ్చిమ నియోజకవర్గంలోని వి మెట్టుపాళయం గ్రామంలో ఆదివారం జరిగిన ప్రజా గ్రామ సభ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు. అన్నాడీఎంకే ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, విద్యాప్రమాణాలు దిగజారిపోయాయని విమర్శించారు.
గ్రామీణులకు వంద రోజుల పనిని మంజూరు చేయడంలో అవకతకవలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. డీఎంకే అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తిరిగి గాడిలో పెడతామన్నారు. వంద రోజుల పనిని 150 రోజులకు పెంచాలని, వేతనాలు రోజువారీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామన్నారు. కాగా, అంతకుముందు పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు వీర పాండ్య కట్టబొమ్మన్ 262వ జయంతిని పురస్కరించుకుని స్టాలిన్ ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.