డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై డీఎంహెచ్‌వో ఆగ్రహం

ABN , First Publish Date - 2022-05-24T05:28:23+05:30 IST

డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై డీఎంహెచ్‌వో ఆగ్రహం

డాక్టర్లు, సిబ్బంది పనితీరుపై డీఎంహెచ్‌వో ఆగ్రహం


  • డుమ్మాకొట్టిన డాక్టర్‌ విధుల నుంచి తొలగింపు
  • కొత్త సూపరిండెంట్‌గా లలితకు బాధ్యతలు

పరిగి, మే23: పరిగి ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది పనితీరు వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆదివారం విధుల్లో ఉండాల్సిన డాక్టర్‌ డుమ్మా కొట్టడంతో రోగులకు వైద్యం అందక అవస్థలు పడిన సంగతి విదితమే.  ఈ మేరకు సోమవారం జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి తుకారాం, డీసీహెచ్‌వో డాక్టర్‌ ప్రదీప్‌ ఆస్పత్రిని సందర్శించి ఆరా తీశారు. కాంట్రాక్టు పద్దతిన పని చేస్తున్న డాక్టర్‌ వెంకటరత్నం విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఎంహెచ్‌వో తుకారాం తెలిపారు. అస్పత్రి సూపరిండెంట్‌ సత్యనారాయణ షిండేను కూడా తప్పించారు. ఆయన స్థానంలో జిల్లా మాతాశిశు సంరక్షణ ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్న లలితను పరిగి అస్పత్రి సూపరిండెంట్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పనిచేసే మరో డాక్టర్‌ ప్రవీణ్‌ను కూడా ఇక్కడి నుంచి ముద్గల్‌ చిట్టెంపల్లి అస్పత్రికి బదిలీ చేశారు. 15 రోజుల్లో అస్పత్రికి అవసరమైన డాక్టర్లు, సిబ్బంది నియమిస్తామని  డీఎంహెచ్‌వో తెలిపారు. ఇదిలా ఉండగా, అస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది రెండు గ్రూపులుగా ఏర్పడి విధులను విస్మరించడం వల్లనే సమస్యలను ఉత్పన్నం అవుతున్నానే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే విధుల్లో ఉండాల్సిన డాక్టర్‌ డుమ్మా కొట్టడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానికంగా నివాసముండే  డాక్టర్‌ ఎస్‌.ప్రవీణ్‌ అదివారం అస్పత్రికి వచ్చి సేవలందించిన పాపానికి తనను బదిలీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.  తాను అనస్థిసియా డాక్టర్‌నని పరిగి అస్పత్రిలో తన సేవలు లేనందును తానే స్వయంగా జాబ్‌కి రీజైన్‌ చేశానని డాక్టర్‌ వెంకటరత్నం తెలిపారు.

అస్పత్రి ఎదుట కాంగ్రెస్‌ నాయకుల ధర్నా

పరిగి ప్రభుత్వ అస్పత్రిలో పూర్తిస్థాయి డాక్టర్లు, సిబ్బందిని నియమించాలని కోరుతూ, కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఽఅస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. వైద్యశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నతాధికారులు వచ్చిన అస్పత్రిలో సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు లాల్‌కృష్ణ, హన్మంత్‌, ఇ.కృష్ణ, బి పరుశరాంరెడ్డి మాట్లాడుతూ అస్పత్రి పనితీరు ఇంత ఆధ్వానంగా తయారైన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ధర్నాలో నాయకులు శివకుమార్‌, మల్లేశ్‌, జగన్‌, పి.నాగవర్ధన్‌, అక్బర్‌,శ్రీకాంత్‌,వెంకటేశ్‌లు ఉన్నారు.

Updated Date - 2022-05-24T05:28:23+05:30 IST