ఆందోళన వద్దు.. జిల్లాలో 59 దాటలేదు

ABN , First Publish Date - 2020-07-08T11:43:20+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 59 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా ..

ఆందోళన వద్దు.. జిల్లాలో 59 దాటలేదు

లక్షణాలున్న వారికే పరీక్షలు   ఫ లక్షా 30 వేల మాస్కుల పంపిణీ 

డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు


మెదక్‌ అర్బన్‌, జూలై 7: జిల్లాలో కరోనా కేసుల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 59 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యశాఖ అధికారి వెంకటేశ్వర్‌రావు తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి మెదక్‌ జిల్లా పేరుతో నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు మెదక్‌ జిల్లాలో చూపడంతో కేసుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నదని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యశాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బాధితుల అడ్ర్‌సలో ఉమ్మడి మెదక్‌ జిల్లా అని ఉండడంతో సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 72 కేసులు మెదక్‌లో చూపించారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 259 నమూనాలను పరీక్షించామని, 198 మందికి నెగటివ్‌ రిపోర్టు రాగా.. 20 మందికి పాజిటివ్‌ వచ్చిందన్నారు. మరో 41 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు. జిల్లాకు సంబంధించి 14 మంది వివిధ ఆస్పత్రుల్లో, 27 మంది ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారని చెప్పారు.


ఇప్పటి వరకు ఐదుగురు కరోనాతో మృతిచెందినట్లు తెలిపారు. 14 మంది కోలుకున్నారని వెల్లడించారు. మంగళవారం రామాయంపేట, తూప్రాన్‌లో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాకు ఇప్పటి వరకు 2 లక్షల 33వేల మాస్కులు వచ్చాయని, లక్షా 16వేల మందికి 1.30 లక్షల మాస్కులు పంపిణీ చేశామన్నారు. కరోనా కట్టడికి అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు, స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు సహకరించాలన్నారు.

Updated Date - 2020-07-08T11:43:20+05:30 IST