అసలేం జరిగింది?.. కొలిక్కిరాని దివ్య మృతి కేసు

ABN , First Publish Date - 2020-10-18T15:41:00+05:30 IST

ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని తానే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుందా? ఒకవేళ ఆత్మహత్య చేసుకుని ఉంటే..

అసలేం జరిగింది?.. కొలిక్కిరాని దివ్య మృతి కేసు

విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని తానే గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుందా? ఒకవేళ ఆత్మహత్య చేసుకుని ఉంటే శరీరంలో 13 కత్తిపోట్లు పొడుచుకోవడం ఆమెకు సాధ్యమేనా? చేయాల్సిందంతా చేసి నాగేంద్ర అలియాస్‌ చినస్వామి సీన్‌ను సృష్టించాడా? ఈ మూడింటికి జవాబు దొరక్కపోవడం దివ్య హత్యకేసును సందిగ్ధంలోకి నెట్టేసింది. 


దివ్య, తానూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నామని నాగేంద్ర చెప్పాడు. ఇద్దరి గొంతుపైనా గాయాలున్నాయి. దివ్య శరీరంపై పలుచోట్ల మొత్తం 13 కత్తిపోట్లు ఉన్నాయని పోస్టుమార్టంలో తేలింది. ఒక వ్యక్తి ఎంతటి ఆవేదన, ఒత్తిడిలో ఉన్నా ఇది సాధ్యం కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీన్నిబట్టి చూస్తే నాగేంద్ర ముందుగా దివ్య ప్రాణాలు తీసేసి తర్వాత తాను గొంతు కోసుకున్నాడని తెలుస్తోంది. అతడు కోలుకుంటే గానీ వాస్తవాలు వెలుగులోకి రావు. మరోపక్క నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలన్న డిమాండ్‌ దివ్య కుటుంబ సభ్యుల నుంచి వినిపిస్తోంది. ఆమె తల్లిదండ్రులు జోసఫ్‌, కుసుమను మాచవరం పోలీసులు శనివారం విచారణ చేశారు. కాగా, దివ్య తల్లిదండ్రులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. న్యాయం కావాలని, ముఖ్యమంత్రి జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని సుచరితను కోరారు. సీఎంకు లేఖ రాశారు. మూడు రోజుల్లో సీఎం అపాయింట్‌మెంట్‌ ఖరారు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 


నాగేంద్రను ఎన్‌కౌంటర్‌ చేయాలి : జోసఫ్‌, దివ్య తండ్రి

నా కుమార్తెను నాగేంద్ర ప్లాన్‌ ప్రకారం చంపేశాడు. అతడ్ని ఎన్‌ కౌంటర్‌ చేయాలి. ఈ విషయాన్ని సీఎం తీవ్రంగా పరిగణించాలి.

 

ఇది అత్యంత దారుణం : సుచరిత, 95హోంమంత్రి

ఒక అమ్మాయిని 13 కత్తిపోట్లతో చంపడం అత్యంత దారుణం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారు ఇన్ని పోట్లు పొడుచుకోరు. దిశ చట్టంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం సూచించింది.

Updated Date - 2020-10-18T15:41:00+05:30 IST