దివీస్‌ ఉద్యమకారులకు స్వాగతం

ABN , First Publish Date - 2021-01-24T06:18:02+05:30 IST

దివీస్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలుకెళ్లిన రైతులు శనివారం విడుదలయ్యారు. వారికి స్థానిక సబ్‌జైలు వద్ద రైతులు, సీపీఎం, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు.

దివీస్‌ ఉద్యమకారులకు స్వాగతం
కాకినాడలో పూల వర్షం

బెయిల్‌పై విడుదల

కాకినాడలో పూల వర్షం

స్వగ్రామాల్లో హర్షాతిరేకాలు 

తుని, జనవరి 23: దివీస్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలుకెళ్లిన రైతులు శనివారం విడుదలయ్యారు. వారికి స్థానిక సబ్‌జైలు వద్ద రైతులు, సీపీఎం, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. గత నెల 17న దివీస్‌ వ్యతిరేక పోరాటంలో భాగంగా జరిగిన సంఘటన నేపథ్యంలో 36 మంది పంపాదిపేట, కొత్తపాకలు తదితర గ్రామాలకు చెందిన రైతులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వారికి రిమాండ్‌ విధించడంతో కాకినాడ, తుని సబ్‌జైలుకు తరలించారు. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు మహిళా రైతును తరలించారు. 37 రోజుల పాటు జైలు జీవితం గడిపిన వారంతా బెయిల్‌పై విడుదల కావడంతో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు వారికి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2016లో దివీస్‌ ఏర్పాటును రైతులంతా వ్యతిరేకించారని, దీంతో అప్పటి ప్రభుత్వం దాన్ని నిలిపివేసిందన్నారు. అప్పడు ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకించిన వైసీపీ నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై తిరిగి ఏర్పాటు చేసేందుకు యత్నిస్తోందన్నారు. దీన్ని రైతులంతా మూకుమ్మడిగా ఎదుర్కొంటున్నారని, తుది విజయం రైతులదేనన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు మాట్లాడుతూ జైళ్లలో బంధించి ఉద్యమాన్ని అణిచివేయాలనుకుంటే ఆగదన్నారు. 


స్వగ్రామాల్లో ఘన స్వాగతం


  జైలు నుంచి విడుదలై స్వగ్రామాలకు చేరుకున్న దివీస్‌ బాధిత రైతులకు ఆయా గ్రామాల్లో ఘనస్వాగతం లభించింది. బంధువులు, రైతులు 37 రోజుల పాటు తమకు దూరమైన తమవారిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్ని ఆటంకాలు ఏర్పరిచిన తమ పోరాటాన్ని ఆపలేరని ఎంతటి త్యాగానికైనా తాము సిద్ధమని పలువురు పేర్కొన్నారు.


కాకినాడలో పూల వర్షం


  దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ చేసిన పోరాటంలో జైలుకు వెళ్లిన వామపక్ష నాయకులు, రైతులు శనివారం కాకినాడ సబ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. వివిధ సంఘాల నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. నాయకులు దువ్వా శేషుబాబ్జి, కేఎస్‌ శ్రీనివాస్‌, రైతులు పేకేటి సత్యనారాయణ, యాదాల శ్రీను మాట్లాడుతూ దివీస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తానన్న జగన్‌ ఇప్పుడు పరిశ్రమ నిర్మాణానికి ఎలా అనుమతులు ఇస్తున్నారని ప్రశ్నించారు. అరెస్టులు, జైళ్లతో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా పోరాడతామన్నారు.  అనంతరం నాయకులను విడుదల చేయాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్‌ వద ్ద దీక్ష చేపట్టిన వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.   సీపీఎం, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ నాయకులు అజయ్‌కుమార్‌, బేబీరాణి, పలివెల వీరబాబు, వెంకటేశ్వరులు పాల్గొన్నారు. 


మహిళ విడుదల


 దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేసి అరెస్ట్టు అయిన బత్తుల నాగమణి శనివారం సాయంత్రం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు రాజమహేంద్రవరం మహిళా సెంట్రల్‌ జైలు వద్ద సీపీఎం నాయకులు టి.అరుణ్‌, తులసీ, పూర్ణిమారాజు, పవన్‌రాజా, తొండంగి మండల నాయకులు అంగులూరి చెన్నారావు, బత్తుల ఆనంద్‌, గుల్ల కుమారి, గుల్ల లక్ష్మణరావు స్వాగతం పలికారు. దివీస్‌ కంపెనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నాగమణి ని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్‌పై రాజమహేంద్రవరం మహిళా సెంట్రల్‌ జైలుకు తరలించారు. 37 రోజులపాటు రిమాండ్‌లో ఉన్న ఆమెకు శనివారం బెయిల్‌ మంజూరు కావడంతో  విడుదలైంది. 

Updated Date - 2021-01-24T06:18:02+05:30 IST