మళ్లీ కలవరం

ABN , First Publish Date - 2021-07-25T05:43:13+05:30 IST

జిల్లాలో కరోనా మరోసారి ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తున్నది.

మళ్లీ కలవరం

 - మూడవ వేవ్‌కు ముందే పెరుగుతున్న కరోనా కేసులు 

- ప్రజల నిర్లక్ష్యమే కారణం 

- 33 రోజుల తర్వాత 147 మందికి పాజిటివ్‌ 

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లాలో కరోనా మరోసారి ముంచుకొచ్చే ప్రమాదం కనిపిస్తున్నది. ఆగస్టు మాసాంతంలోగా మూడవ వేవ్‌ ముప్పు పొంచి ఉన్నదని వైద్య ఆరోగ్యశాఖ నిపుణులు హెచ్చరిస్తుండగా అంతకు ముందే వ్యాధి విజృంభిస్తున్న లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా ముప్పు తొలిగిపోయిందనే భావనతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నదని భావిస్తున్నారు. నెలరోజులుగా జిల్లాలో 70 నుంచి 100 వరకు పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. వారం రోజులుగా మెల్లమెల్లగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. శనివారం జిల్లాలో 7,073 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించగా 147 మందికి కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయింది. జూన్‌ 21న 172, 22న 146 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఆ తర్వాత క్రమేపి కేసులు తగ్గుతూ పోయాయి. జూలై మాసంలో పూర్తిస్థాయిలో రెండవ వేవ్‌ ముగిసిపోతుందని అందరూ భావించారు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించిన తర్వాత కరోనా తగ్గిపోయిందనే భావనంతో ప్రజలు పూర్తిగా అలసత్వం వహిస్తున్నారు. గుంపుగుంపులుగా తిరగడం, ఫంక్షన్‌, రాజకీయ కార్యక్రమాలు, అంత్యక్రియలు, షాపింగ్‌లు, బోనాలు తదితర జాతరలకు వెళ్తుండడం, మాస్క్‌లు ధరించక పోవడం వంటి కారణంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. షాపింగ్‌ మాల్స్‌, సూపర్‌బజార్లు, జ్యూవెల్లరీ, వస్త్ర దుకాణాలు, గంజ్‌ మార్కెట్‌ తదితర ప్రాంతాల్లో భౌతిక దూరం పాటించకుండా మాస్క్‌లు ధరించకుండా ప్రజలు తిరుగడం వ్యాధివ్యాప్తికి కారణమవుతున్నది. జూలై ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గడిచిన 24 రోజుల్లో తొమ్మిది రోజుల్లో వందకుపైగా కేసులు రాగా 24న 147 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హుజురాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో రాజకీయ కార్యకలాపాలు పెరుగడంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. చిగురుమామిడి మండలంలో కూడా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. 

- జిల్లాలో శనివారం 147 పాజిటివ్‌ కేసులు రాగా ఒక్క చిగురుమామిడి మండలంలోనే 40 మంది వ్యాధిబారినపడ్డారు. తిమ్మాపూర్‌ మండలంలో 20 మంది, హుజూరాబాద్‌లో 13 మంది, గంగాధరలో 12 మంది, రామడుగులో 11 మంది వ్యాధిబారినపడ్డారు. శంకరపట్నం, జమ్మికుంట మండలాల్లో ఆరుగురు చొప్పున, వీణవంకలో ఏడుగురు, కొత్తపల్లి మండలంలో ఐదుగురు, చొప్పదండిలో ముగ్గురు, ఇల్లందకుంట మానకొండూర్‌ మండలాల్లో ఇద్దరిద్దరు వ్యాధికి గురయ్యారు. కరీంనగర్‌ పట్టణంలో 1,807 ర్యాపిడ్‌ టెస్ట్‌లు నిర్వహించగా 20 మందికి వ్యాధిసోకినట్లు నిర్ధారణ అయింది. 

- చిగురుమామిడి మండలంలోని నవాబుపేట గ్రామంలోనే 23 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. జూలై 10వ తేదీన ఆ గ్రామానికి చెందిన 15 మంది ఆంధ్రప్రదేశ్‌లోని పుంగనూరులో ఆవుల కొనుగోలు కోసం వెళ్లారు. వీరిలో 12 మందికి కరోనా వ్యాధి సోకింది. వారి ద్వారా గ్రామంలో మరో 11 మందికి కూడా వ్యాధి సోకినట్లు భావిస్తున్నారు. ఇదే మండలం గాగిరెడ్డిపల్లి గ్రామంలో 10 మందికి వ్యాధి సోకింది. ఇటీవల గ్రామంలో చెరువులో చేపలు పట్టారు. చేపలుపట్టిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రాగా, వారి ద్వారా ఇతరులకు సోకినట్లు భావిస్తున్నారు. గంగాధర మండలంలో 12 మందికి వ్యాఽధి నిర్ధారణ అయింది. ఆ మండలంలోని నారాయణపూర్‌ గ్రామానికి చెందిన రెండు కుటుంబాల వారు వేములవాడ మండలంలో జరిగిన వేడుకకు మూడు రోజుల క్రితం వెళ్లారు. వారిలో ఆరుగురికి కరోనా సోకింది. వారి పక్క ఇంటి వారిలో కూడా ఒకరు వ్యాధిబారినపడ్డారు. తిమ్మాపూర్‌ మండలంలో పర్లపల్లి గ్రామంలో 82 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ రావడం ఆందోళన కలిగిస్తున్నది.  

- గ్రామాల్లో కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించండి : కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ 

జిల్లాలో పది కన్నా ఎక్కువ కొవిడ్‌ కేసులు వచ్చిన గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్లు, ఎంపీవోలతో కొవిడ్‌ నియంత్రణ చర్యలపై టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. అలాగే ఆయా గ్రామాల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి కొవిడ్‌ నిర్ధారణ అయిన వారిని చేర్పించాలని, గ్రామ కార్యదర్శులు ఐసోలేషన్‌ కేంద్రాలను నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. చిగురుమామిడి, గంగాధర, తిమ్మాపూర్‌ మండలాల్లో అధికంగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయని, కొవిడ్‌ వచ్చిన ప్రతి ఒక్కరి ప్రైమరీ కాంట్రాక్టులో భాగంగా 20 నుంచి 25 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలను పెంచాలని, ఐసోలేషన్‌ కేంద్రాల్లోని వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షించాలని మెడికల్‌ ఆఫీసర్లను ఆదేశించారు. ఈ టెలీ కాన్ఫరెన్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువేరియా, డీపీవో వీరబుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-25T05:43:13+05:30 IST