జిల్లావ్యాప్తంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-12T05:04:05+05:30 IST

స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా గురువారం ఆజాదికా అమృత్‌ మహోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. ఎక్కడిక్కడ జాతీయ జెండాల ప్రదర్శనలతోపాటు జెండావిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్‌జీపాడు మండలం దేవరంపాడులో హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు

జిల్లావ్యాప్తంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు
త్రిపురాంతకంలో 201 అడుగుల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులు

ర్యాలీలు, జెండాలు ఆవిష్కరణలు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 11: స్వాతంత్య్రం వచ్చి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా గురువారం ఆజాదికా అమృత్‌ మహోత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. ఎక్కడిక్కడ జాతీయ జెండాల ప్రదర్శనలతోపాటు జెండావిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్‌జీపాడు మండలం దేవరంపాడులో హెరిటేజ్‌ వాక్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ దినే్‌షకుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ విజయస్థూపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆంధ్రకేసరి ప్రకాశంపంతులు జీవిత విశేషాలను భావితరాలు కూడా తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఒంగోలులో సైనిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జైజవాన్‌, జైకిసాన్‌ నినాదంతో భారత సైన్యం విజయాలను వివరిస్తూ ఫొటోల ప్రదర్శనను ఏర్పాటుచేశారు. గిద్దలూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని నిర్వహించగా కొండపి, కనిగిరిల్లో  విద్యార్థులతో పాటు వివిధశాఖల అధికారులు జాతీయజెండాలతో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. త్రిపురాంతకంలో 201 అడుగుల జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించగా పలుప్రాంతాల్లో ఎక్కడిక్కడ ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. కాగా శుక్ర, శని, ఆదివారాల్లో ఒంగోలుతోపాటు ముఖ్యమైన పట్టణాల్లో భారీకార్యక్రమాలను నిర్వహించనున్నారు. శుక్రవారం ఒంగోలులో విద్యార్థులకు పలురకాల పోటీలను నిర్వహించనున్నారు. శని, ఆదివారాల్లో ఇంటింటిపైన జాతీయజెండాల ఎగురవేతతోపాటు ఆదివారం ఒంగోలులో 3కే రన్‌ను ఏర్పాటుచేశారు. త్రివర్ణ ప్రకాశం పేరుతో నిర్వహిస్తున్నారు. మూడు కిలోమీటర్ల మేర జాతీయజెండాతో ప్రదర్శన నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇంకొకవైపు కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రతిఒక్కరికి తెలిసే విధంగా స్థూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 


Updated Date - 2022-08-12T05:04:05+05:30 IST