పరిశ్రమలతోనే జిల్లా ఆర్థిక ప్రగతి

ABN , First Publish Date - 2022-05-27T04:55:58+05:30 IST

పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు.

పరిశ్రమలతోనే జిల్లా ఆర్థిక ప్రగతి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

రాయచోటి (కలెక్టరేట్‌), మే 26: పరిశ్రమల స్థాపనతోనే జిల్లా ఆర్థిక ప్రగతి సాధిస్తుందని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఇండస్ట్రియల్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామివేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలన్నారు. జిల్లాలో మామిడి ఎక్కువగా సాగవుతుందని, మామిడికి సంబంధించి షెడ్ల నిర్మాణం, ఎగుమతులు తదితర అంశాలలో అన్ని రకాల పరిశ్రమలు నెలకొల్పేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి పూర్తిగా సహకరించాలని జిల్లా పరిశ్రమల అధికారిని ఆదేశించారు. ఈనెల 25వ తేదీ నాటికి సింగిల్‌డెస్క్‌ పోర్టల్‌లో 44 దరఖాస్తులు రాగా అందులో 32 దరఖాస్తులు నిర్దేశించిన గడువులోగా ఆమోదించామని, ఒక అప్లికేషన్‌ తిరస్కరించడం జరిగిందని, మిగిలిన 11 అప్లికేషన్లు పెండింగ్‌ లేకుండా చూడాలని పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.813.02 కోట్ల పెట్టుబడితో 1536 యూనిట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పారని, వాటిలో 19,044 మందికి ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. అలాగే రూ.3503.93 కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన 11 భారీ, మెగా పరిశ్రమలలో 1136 మంది ఉపాధి పొందుతున్నారన్నారు. అండర్‌ ఇంప్లిమెంటేషన్‌లో రూ.24.25 కోట్ల పెట్టుబడితో 27 ఎంఎ్‌సఎంఈ యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని అవి ప్రారంభిస్తే వాటి వలన 321 మందికి ఉపాధి కల్పించవచ్చన్నారు. వైఎ్‌సఆర్‌ జగనన్న బడుగు వికాసం కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు కోటి రూపాయల వరకు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి నాగరాజ, ఏపీఐఐసీ జెడ్‌ఎం శ్రీనివాసమూర్తి, ఎల్‌డీఎం దుర్గాప్రసాద్‌, జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ శాంతకుమారి, ఏపీ ట్రాన్స్‌కో ఈఈ చంద్రశేఖర్‌, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణసింగ్‌, డిప్యూటీ చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ కృష్ణమూర్తి, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఇంజనీర్‌ జావెద్‌బాషా, బీఐఎస్‌ అధికారి కృష్ణవీర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-27T04:55:58+05:30 IST