రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ABN , First Publish Date - 2020-05-24T11:07:26+05:30 IST

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

అన్ని రంగాలలో జిల్లా అభివృద్ధి 

స్వర్ణ వాగుపై రూ.3.71 కోట్ల వ్యయంతో చెక్‌డ్యాంల నిర్మాణం 

పనులకు మంత్రి అల్లోల శంకుస్థాపన 


సారంగాపూర్‌, మే 23: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని  మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని యాకర్‌పెల్లి, మాలక్‌ చించోలి గ్రామ సమీపంలో గల స్వర్ణ వాగుపై రూ.3 కోట్ల 71 లక్షా 75 వేలతో నిర్మాణం చేపట్టే చెక్‌ డ్యామ్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ఎనలేని కృషి చేస్తున్నారని, పంటలకు మద్దతుధరను ప్రకటించి ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేస్తున్నామన్నారు. పంటలను సాగు చేసుకోవడానికి రైతులకు వ్యవసాయ అధికారులతో సూచనలను అందించి అధికంగా దిగుబడులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.


అలాగే, స్వర్ణ వాగుపై నిర్మించే చెక్‌ డ్యామ్‌ల నిర్మాణ పనులు పూర్తి అయితే చుట్టుపక్కల  గ్రామాలకు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయని, వాగులో నీరు నిలకడగా ఉంటుందని, మొత్తం ఐదు చెక్‌డ్యామ్‌లను నిర్మించనున్నట్లు తెలిపారు. కాగా, జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని, కొందరు రాజకీయ నాయకులు చేసే ఆరోపణలన్నీ నిజం కావన్నారు. ప్రపంచం కరోనా వైర్‌సతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులు ఆందోళనకు గురికాకుండా వారు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో హమాలీలు, కూలీలు, లారీల కొరత కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటూ మొక్కజొన్న ధాన్యం పూర్తిగా కొనుగోలు చేశామ ని, కొందరు పనికట్టుకొని కేంద్రాల వద్దకు వెళ్లి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ కొరిపెల్లి విజయలక్ష్మీ, జిల్లా రైతు సమన్వయ కోఆర్డినేటర్‌ వెంకట్‌ రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్‌ రెడ్డి, జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, అల్లోల మురళీధర్‌ రెడ్డి, సొసైటీల చైర్మన్‌ నారాయణ రెడ్డి, మానిక్‌ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మాధవ్‌రావు, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజ్‌మహ్మద్‌, మాజీ అడెల్లి పోచమ్మ దేవాలయం చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, తదితరులున్నారు.


జౌళి నాలా పనులు సత్వరం పూర్తి చేయండి 

ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జౌళినాలా పనులను సత్వరం పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్‌లోని కురన్నపేట్‌, షెక్‌సాబ్‌పేట్‌ ప్రాంతాల్లో జౌళినాలా పూడికతీత పనులు పరిశీలించారు. అలాగే, పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో నాయకులు రాంకిషన్‌ రెడ్డి, ఎర్రవోతు రాజేంధర్‌, ధర్మాజీ రాజేంధర్‌, మారుగొండ రాము, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


‘రైతుబంధు’కు అర్హత సాధించాలి

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియంత్రిత సాగు విధానం ప్రకారం పంటలు సాగుచేసి ప్రతీ రైతు రైతుబంధు పెట్టుబడి సహాయానికి అర్హత సాధించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్‌ పట్టణంలోని దివ్యగార్డెన్‌లో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన నియంత్రిత పంటల సాగు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలో పత్తి 1,70,000ఎకరా లు, వరి 1,03,945ఎకరాలు, సోయాబిన్‌ 96,000ఎకరాలు, కందులు 44,000 ఎకరాలు, మినుములు 5500ఎకరాలు, పెసర్లు 2000ఎకరాలు.. మొత్తం 4,21,606 ఎకరాలుగా సీఎంవో కార్యాలయం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్‌, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్ల వెంకట్‌ రెడ్డి, డీసీసీబీ ఉపాధ్యక్షుడు రఘునందన్‌ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


ఆహ్లాదం కోసమే మున్సిపల్‌ పార్కు నిర్మాణం

పట్టణ ప్రజలకు ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం పంచడమే లక్ష్యంగా నిర్మల్‌లోని దివ్య కాలనీలో రూ.70 లక్షలతో మున్సిపల్‌ పార్కును నిర్మిస్తున్నామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన పార్కు నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరుపట్ల కాంట్రాక్టర్‌ లక్కాడి జగన్మోహన్‌రెడ్డిని అభినందించారు.  మంత్రి వెంట కలెక్టర్‌ ముషారఫ్‌ఆలీతో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, పలువురు కౌన్సిలర్‌లు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.  


Updated Date - 2020-05-24T11:07:26+05:30 IST