వికారాబాద్‌లోనే జిల్లా కోర్టు

ABN , First Publish Date - 2022-05-21T04:50:57+05:30 IST

వికారాబాద్‌లోనే జిల్లా కోర్టు

వికారాబాద్‌లోనే జిల్లా కోర్టు

  • జూన్‌ 2న ప్రారంభించేందుకు ఏర్పాట్లు 
  • ప్రస్తుత కోర్టు భవనంలోనే కొనసాగింపునకు చర్యలు

వికారాబాద్‌, మే 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వికారాబాద్‌ కేంద్రంగా జిల్లా కోర్టు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం గెజిట్‌ జారీచేసింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం  తరువాత ప్రభుత్వం మొత్తం 33జిల్లాలు ఏర్పాటు చేసినా ఇప్పటి వరకూ జిల్లా కేంద్రాల్లోనే జిల్లా కోర్టులు కొనసాగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్బీనగర్‌లో ఉంది. కొత్త జిల్లాల్లోనూ జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాల ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టును కోరింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన జూన్‌ రెండున కొత్త జిల్లా కోర్టులు ఏర్పాటు చేయాలని, అదే రోజు జిల్లా కోర్టు ప్రారంభానికి అవసరమైన చర్యలూ తీసుకోవాలని జిల్లా జడ్జిలను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కె.సుజన జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


  • ఇప్పటి వరకూ ఎల్బీ నగర్‌లోనే జిల్లా కోర్టు


జిల్లా కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. కానీ న్యాయశాఖలో విభజన జరగకపోవడంతో ఇప్పటి వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోర్టులోనే కేసుల విచారణ జరుగుతోంది. జిల్లా కోర్టు ఏర్పాటైతే ఈ ప్రాంగణంలో పది కోర్టులు కొనసాగుతాయి. ప్రస్తుతం వికారాబాద్‌లో 12వ జిల్లా అదనపు జడ్జి కోర్టు, ఫ్యామిలీ కోర్టు, సీనియర్‌ సివిల్‌ జడ్జి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులున్నాయి. జిల్లా కోర్టు ఏర్పాటు తర్వాత కొత్తగా 12వ జిల్లా అదనపు జడ్జి కోర్టు స్థానంలో ప్రిన్సిపల్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి కోర్టు ఏర్పాటవుతుంది. ఎస్సీ, ఎస్టీ అ ట్రాసిటీ, పోక్సో కేసుల విచారణ కోర్టు, కన్స్యూమర్‌, స్పెషల్‌ ఎక్సైజ్‌ యాక్ట్‌ కోర్టులు, ఎన్‌డీపీఎస్‌ చట్టం, మహిళలపై అత్యాచారాలు, వేధింపుల విచారణ కోర్టులు ఏర్పాటవుతాయి.


  • కోర్టుల వారీగా మండలాల కేటాయింపు


వికారాబాద్‌ జిల్లా కోర్టు పరిధిలో వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులుంటాయి. వికారాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు పరిధిలో వికారాబాద్‌, మర్పల్లి, మోమిన్‌పేట్‌, నవాబుపేట, ధారూరు, కోట్‌పల్లి, బంట్వారం మండలాలు, పరిగి పరిధిలో పూడూరు, కులకచర్ల, చౌడాపూర్‌, దోమ, పరిగి మండలాలు, తాండూరు పరిధిలో తాండూరు, పెద్దేముల్‌, యాలాల్‌, బషీరాబాద్‌, కొడంగల్‌ జూనియర్‌ కోర్టు పరిధికి కొడంగల్‌, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ మండలాలను చేర్చారు.


  • కోర్టులకు అన్ని వసతులూ కల్పించాలి : కోకట్‌ మాధవరెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, వికారాబాద్‌


వికారాబాద్‌ జిల్లా కోర్టు ఏర్పాటుకు హైకోర్టు ఉత్తర్వులివ్వడం సంతోషకరం. ఐదేళ్లుగా ముఖ్యమైన కోర్టులు ఎల్‌బీ నగర్‌లోనే కొనసాగడం వల్ల జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత కక్షిదారులు దూరాభారంతో ఇబ్బందులుపడ్డారు. ఇకపై జిల్లా కోర్టు వికారాబాద్‌లోనే ఏర్పాటైతే కక్షిదారులకు, న్యాయవాదులకు సౌకర్యంగా ఉం టుంది. ప్రజలకు రానుపోను, ఇతర అవసరాల ఖర్చూ తగ్గుతుంది. కొత్త కోర్టులను ప్రస్తుత కోర్టు సముదాయంలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించాలి. దీనికి ప్రత్యేన నిధులు కేటాయించాలి. కొత్త కలెక్టరేట్‌ను ఎలా నిర్మించారో అదే విధంగా 25 ఎకరాల్లో అన్ని హంగులతో వీలైంనంత తక్కువ సమయంలో కొత్త కోర్టు కాంప్లెక్స్‌ నిర్మించేలా సర్కారు చర్యలు తీసుకోవాలి.

Updated Date - 2022-05-21T04:50:57+05:30 IST