రేషన్‌ ఉచితం

ABN , First Publish Date - 2020-03-29T11:53:55+05:30 IST

కరోనాపై ప్రభుత్వాల హెచ్చరికలతో పేదలంతా పనులకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

రేషన్‌ ఉచితం

నేటి నుంచి డిపోల వద్ద పంపిణీ 

బియ్యం, పప్పు ఉచితం

పంచదారకు ధర చెల్లించాలి 

పాత కార్డుల ఆధారంగా సరుకుల పంపిణీ 

వచ్చే నెల 15 నుంచి మరోసారి సరుకుల పంపిణీ 


 కరోనా వైరస్‌ వ్యాప్తిచెందకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇళ్ల వద్ద ఉంటున్న పేదలకు ఆదివారం నుంచి ఉచితంగా రేషన్‌ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిపోల వద్దనే బియ్యం, కందిపప్పు, పంచదారను అందజేయనుంది. పంచదారకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల 15 నుంచి ఆ నెల రేషన్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారు. 


(విజయనగరం-ఆంధ్రజ్యోతి)/ గంట్యాడ/ కొమరాడ/ సాలూరు, మార్చి 28: కరోనాపై ప్రభుత్వాల హెచ్చరికలతో పేదలంతా పనులకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కొంత సాంత్వన చేకూర్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29 నుంచి రేషన్‌ కింద బియ్యం, కందిపప్పును ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు. రోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ డిపోల వద్ద పంపిణీ చేయను న్నారు. ఇప్పటికే సరుకులు రేషన్‌ డిపోలకు చేరాయి.


సరుకుల కోసం వెళ్లే కార్డుదారులు సామాజిక దూరం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. చేతులు శుభ్రం చేసుకోవడానికి నీరు, సబ్బు, శానిటైజర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రేషన్‌ డీలర్లకు ఆదేశించింది. ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన రైస్‌ కార్డుల ఆధారంగా సరుకులు ఇవ్వాలని తొలుత భావించింది. చాలా మందికి కార్డులు అందకపోవడం వల్ల పాత కార్డులనే ప్రాతిపదికగా తీసుకోనుంది. దీనిపై శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాత రేషన్‌ కార్డుల ఆధారంగా సరుకులు పంపిణీ చేయాలని జిల్లా అధికారులకు పౌరసరఫరాల శాఖ కార్యదర్శి మార్గదర్శకాలు జారీ చేశారు.


ప్రసుత్తం జిల్లాలో  సుమారు 7,14,000 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వారికి కార్డు అర్హత ఆధారంగా  బియ్యం, కిలో కంది పప్పు చొప్పున ఉచితంగా పంపిణీ చేయనున్నారు. పంచదారతోపాటు ఇంకా ఎమైనా సరుకులు పంపిణీ చేస్తే వాటికి కార్డుదారులు డబ్బులు చెల్లించాలి. కార్డుదారుడు సరుకులు తీసుకున్నప్పుడు ఈపోస్‌ మిషన్‌పై వేలిముద్రలు వేయనవసరం లేదు. డిపోల వారీగా ప్రభుత్వం నియమించిన వీఆర్‌వో, వీఆర్‌ఏ లేదా సచివాలయ ఉద్యోగి(నామినీగా) వేలిముద్ర వేస్తారు. సరుకులు పంపిణీ చేసిన సమయంలో రద్దీ లేకుండా చూసుకోవాలి. సరకుల పంపిణీ విషయాన్ని ముందుగా వలంటీర్లు కార్డుదారులకు తెలియజేయాలి. ఇదిలా ఉంటే వచ్చే నెల 15 నుంచి మరోసారి నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ  చేయనున్నారు. 


ఇప్పటికే 65 శాతం నిల్వలు రేషన్‌ షాపులకు చేరాయి. విజయనగరం, భోగాపురం, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్‌.కోట, కొత్తవలస, పార్వతీపురం, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, తెర్లాం, బొబ్బిలి, పాచిపెంట, సాలూరు, మక్కువ కలిపి మొత్తం 15 ఎమ్‌ఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా ఎఫ్‌పీ షాపుల డీలర్లకు సరకులు చేరుతున్నాయి. జిల్లాలో 1,406 ఎఫ్‌పీ షాపులు ఉన్నాయి. ప్రతి నెలా జిల్లాలో సుమారు 12వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరం. ఇంతవరకు 6,500 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని డీలర్ల వద్దకు చేర్చారు. పంపణీ జరుగుతుండగా మిగిలిన నిల్వలు డంప్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. 


పంపిణీకి ఏర్పాట్లు చేశాం

 పేద ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం, కిలో కంది పప్పును ఉచితంగా అందిస్తోంది. ఆదివారం నుంచి పంపిణీ ప్రారంభిస్తాం. నిల్వలను ఎమ్‌ఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి ఎఫ్‌పీ షాపు డీలర్ల వద్దకు చేర్చుతున్నాం. కేంద్ర ప్రకటించిన బియ్యానికి సంబంధించి ఇంకా ఆదేశాలు రావాల్సి ఉంది.  


Updated Date - 2020-03-29T11:53:55+05:30 IST