నేటి నుంచి జిల్లాలో ఉచిత రేషన్‌ పంపిణీ

ABN , First Publish Date - 2020-03-29T11:09:09+05:30 IST

కరోనా వైరస్‌ నేపఽథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌డిపోల ద్వారా ఈనెల 29 నుంచి

నేటి నుంచి జిల్లాలో ఉచిత రేషన్‌ పంపిణీ

వేలిముద్రల నిబంధన మినహాయింపు

సచివాలయం ఉద్యోగే వేలిముద్ర వేస్తారు


రాజమహేంద్రవరం/ డెయిరీపారమ్‌ సెంటర్‌(కాకినాడ), మార్చి28: కరోనా వైరస్‌ నేపఽథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌డిపోల ద్వారా ఈనెల 29 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ చేసేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి మధాహ్నం 1 గంట వరకు వీటిని ఆయా రేషన్‌ డిపోల ద్వారా అందజేయనున్నారు. వేలిముద్రల నిబంధన లేకుండా సరుకులు అందజేయాలని నిర్ణయించింది. లబ్ధిదారుడు రేషన్‌కార్డు చూపితే అందులోకి సభ్యుల సంఖ్య ప్రకారం ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం, ఒక్కో కార్డుదారునికి కేజీ కందిపప్పు, అరకేజీ పంచదార అందజేయనున్నారు.


కరోనా వైరస్‌ నేపథ్యంలో అందరి చేత వేలి ముద్రలు వేయిస్తే ప్రమాదం ఉంటుందనే కారణంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒక ఉద్యోగికి ఈ బాధ్యతలు అప్పగించారు. సదరు ఉద్యోగి వేలి ముద్ర ఆధారంగానే అందరికీ సరుకులు పంపిణీ చేస్తారు. లబ్ధిదార్లు అందరూ ఒకేసారి గుమిగూడకుండా ఏర్పాట్లుచేశారు. వార్డు, సచివాలయ వలంటీర్ల పరిధిలో కొంతమందిని మాత్రమే పిలిచి, రేషన్‌ షాపులు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో సర్కిళ్లలోనే నిలబెట్టి, సరుకులు పంపిణీ చేయనున్నారు. రాజమహేంద్రవరంలో గంటకు 15 నుంచి 20 మందికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చే నెల 10లోగా సరుకులు తీసుకోకపోతే తర్వాతి నెలలో రెండు నెలలకు కలిపి ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్నందున డీలర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. జిల్లాలో సుమారు 15 లక్షలు రేషన్‌ కార్డులున్నాయి. ఈ కార్డుదారులకు రేషన్‌ సరుకుల పంపిణీ నిమిత్తం 19 వేల టన్నుల బియ్యం, 1500 టన్నుల కందిపప్పు, 808 టన్నుల పంచదార సిద్ధం చేశారు.


ఈ సరుకును ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి డీలర్లకు సరఫరా చేశారు. పాతకార్డుల జాబితా ప్రకారం ఏప్రిల్‌ నెలకు సంబంధించిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించడం గమనార్హం. అలాగే రేషన్‌ తీసుకునేవారు కార్డుదారులు ఎవరి పెన్ను వారే తీసుకురావాలి. పెన్ను తీసుకుని రానివారు, సంతకం రానివారి ఫొటోను సరుకులు పంపిణీ చేస్తున్నప్పుడు సెల్‌ఫోన్‌లో తీసి రికార్డు చేయాలి. ప్రతి రేషన్‌షాపు డీలర్‌, వారి సహాయకులు తప్పనిసరిగా మాస్కులుగాని, జేబురుమాలు గాని ముఖానికి కట్టుకుని సరుకులు పంపిణీ చేయాలి. ప్రతి రేషన్‌షాపు దగ్గర సోప్‌ కిట్‌, నీళ్లు ఏర్పాటు చేయాలి. పంపిణీ సమయంలో సచివాలయ పోలీసు సహాయకురాలు, ఇతర సిబ్బంది ఉండాలి. అన్ని తహసిల్దార్‌ కార్యాలయాల్లో కార్డుదారుల సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించేందుకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలి.

Updated Date - 2020-03-29T11:09:09+05:30 IST