తడ్కల్‌ సర్పంచుపై అనర్హత వేటు

ABN , First Publish Date - 2022-05-26T05:45:50+05:30 IST

మండలంలోని తడ్కల్‌ గ్రామ సర్పంచుగా కొనసాగుతున్న పండరినాథ్‌రావు ఎన్నిక చెల్లదని పేర్కొంటూ నారాయణఖేడ్‌ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుమేరకు రెండో స్థానంలో నిలిచిన మనోహర్‌ను సర్పంచుగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో ముజాఫరోద్దిన్‌ పేర్కొన్నారు.

తడ్కల్‌ సర్పంచుపై అనర్హత వేటు
కోర్టు ఆదేశాల ప్రతిని మనోహర్‌కు అందిస్తున్న ఎంపీడీవో

కంగ్టి, మే 25: మండలంలోని తడ్కల్‌ గ్రామ సర్పంచుగా కొనసాగుతున్న పండరినాథ్‌రావు ఎన్నిక చెల్లదని పేర్కొంటూ నారాయణఖేడ్‌ సివిల్‌ కోర్టు ఇచ్చిన తీర్పుమేరకు రెండో స్థానంలో నిలిచిన మనోహర్‌ను సర్పంచుగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎంపీడీవో ముజాఫరోద్దిన్‌ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో చాంబర్‌లో ఎంపీడీవో ముజాఫరోద్దిన్‌ మనోహర్‌కు కోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రతిని అందజేశారు. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తడ్కల్‌ సర్పంచు ఎన్నిక కోసం పండరినాథ్‌రావుతో పాటు మనోహర్‌ పోటీ చేయగా పండరినాథ్‌రావు గెలుపొందారు. దీంతో రెండో స్థానంలో నిలిచిన మనోహర్‌ గెలుపొందిన పండరినాథ్‌కు నలుగురు సంతానం ఉన్నారని కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు తడ్కల్‌ సర్పంచుపై అనర్హత వేటు వేస్తూ రెండో స్థానంలో నిలిచిన మనోహర్‌ను సర్పంచుగా కొనసాగించాలని ఉన్నతాధికారులకు ఉత్తర్వులు పంపింది. బుధవారం ఎంపీడీవో కోర్టు ఆదేశాలను అమలు చేశారు. దీంతో మనోహర్‌  గ్రామ పంచాయతీలో మిఠాయిలు పంచి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో కోఆప్షన్‌ మెంబర్‌ అహ్మద్‌, నరేందర్‌, ఎంపీవో ఇబ్రహీం, నరేందర్‌, వెంకటేశం, నాగార్జున్‌, అంజన్న, సాయి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-26T05:45:50+05:30 IST