పరిహారం పంపిణీలో వివాదాలు

ABN , First Publish Date - 2020-10-28T09:58:53+05:30 IST

వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పంపిణీలో కొన్ని చోట్ల వివాదాలు తలెత్తుతున్నాయి. స్థానిక నేతలు అవినీతికి పాల్పడుతున్నారని కొన్ని చోట్ల..

పరిహారం పంపిణీలో వివాదాలు

బర్కత్‌పుర/కుత్బుల్లాపూర్‌/మదీన, అక్టోబర్‌ 27(ఆంధ్రజ్యోతి): వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పంపిణీలో కొన్ని చోట్ల వివాదాలు తలెత్తుతున్నాయి. స్థానిక నేతలు అవినీతికి పాల్పడుతున్నారని కొన్ని చోట్ల... సాయం అందడం లేదని మరి కొన్ని చోట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జరిగిన కొన్ని ఘటనలు ఇలా ఉన్నాయి. 


మహిళలతో అసభ్య ప్రవర్తన

నల్లకుంట డివిజన్‌ సత్యానగర్‌లో వరద ముంపునకు గురైన బాధితులకు నగదు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. బస్తీకి చెందిన మహిళ తనకు పరిహారం ఇవ్వాలని అధికారులను ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది. ఓ అధికారి తన చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడని ఆ మహిళ బస్తీవాసులతో కలిసి కాచిగూడ పీఎ్‌సకు వెళ్లింది. సమాచారం అందుకున్న అధికారులు, నేతలతో కలిసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టొద్దని వేడుకున్నారు. కేసు పెడితే ఉద్యోగం పోతుందని ఆ మహిళకు  నచ్చచెప్పారు. నేతల ఒత్తిడి వల్ల ఆమె ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయినట్లు తెలిసింది.


బాధితుల ధర్నా

బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం తమకు అందడంలేదని, పాతబస్తీ వాసులు దక్షిణ మండలం జీహెచ్‌ఎంసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఉప్పుగూడ, సాయిబాబానగర్‌, శివాజీనగర్‌ అరుంధతి నగర్‌ కాలనీ, భగత్‌సింగ్‌ నగర్‌, రాజీవ్‌ నగర్‌, క్రాంతినగర్‌లతో పాటు పలు బస్తీలకు చెందిన 250 మంది మహిళలు బల్దియా కార్యాలయం ముందు నిరసనకు దిగారు.  జోనల్‌ కమిషనర్‌ అశోక్‌ సామ్రాట్‌ వారి వద్దకు వచ్చి ఈనెల 29 నాటికి ప్రతీ బాధితుడికీ నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు నిరసనను విరమించారు. 


కుత్బుల్లాపూర్‌ ఉపకమిషనర్‌పై వేటు 

ఆర్థిక సహాయం పంపిణీ మందకొడిగా సాగడం, వివరాలను సరిగ్గా నమోదు చేయకపోవడం, పర్యవేక్షణ లోపం వంటి అభియోగాలతో కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ ఉపకమిషనర్‌ ఎం. మంగతాయారును నగదు పంపిణీ విధుల నుంచి ఉన్నతాధికారులు తొలగించారు. సదరు విధులను గాజులరామారం ఉపకమిషనర్‌ రవీందర్‌కుమార్‌కు అప్పగించారు. ఈ నెల 24న జరిగిన పంపిణీ ప్రక్రియ వివరాలను యాప్‌లో నమోదు చేయకుండా మ్యాన్యువల్‌గా నమోదు చేసుకుని వాటిని ఆన్‌లైన్‌ చేయకుండా జాప్యం చేయడంతో కుత్బుల్లాపూర్‌ డీసీని విధుల నుంచి తొలగించినట్లు తెలిసింది. 


రూ. 10 వేలకు బదులు 5 వేలే...

నల్లకుంట డివిజన్‌లో వరద బాధితులకు రూ.10వేలకు బదులు రూ.5వేలు మాత్రమే పంపిణీ చేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్థానిక యువకుడు మధుగౌడ్‌ నల్లకుంట కార్పొరేటర్‌ గరికంటి శ్రీదేవీ రమేశ్‌ను ప్రశ్నించాడు. పంపిణీలో ఆటంకం కలిగిస్తున్నాడని కాచిగూడ పోలీసులకు కార్పొరేటర్‌ ఫిర్యాదు చేశారు. కానీ రూ.5 వేలు మాత్రమే ఎందుకు పంపిణీ చేస్తున్నారనే దానికి సమాధానం లేకుండా పోయింది.  

Updated Date - 2020-10-28T09:58:53+05:30 IST