విపత్తు సమయంలో వివాదాలా?

ABN , First Publish Date - 2020-03-29T11:25:01+05:30 IST

కరోనా వంటి విపత్తు వణికిస్తున్న సమయంలో జీజీహెచ్‌ వైద్య వర్గాల్లో వివాదాలు తలెత్తడంపై కలెక్టర్‌ ఆగ్రహం

విపత్తు సమయంలో వివాదాలా?

జీజీహెచ్‌ వైద్యులపై కలెక్టర్‌ కన్నెర్ర

సూపరింటెండెంట్‌, ప్రిన్సిపాల్‌ బదిలీ

మరికొందరిపై వేటు వేస్తానని హెచ్చరిక


నెల్లూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : కరోనా వంటి విపత్తు వణికిస్తున్న సమయంలో జీజీహెచ్‌ వైద్య వర్గాల్లో వివాదాలు తలెత్తడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది వైద్యులు గ్రూపులుగా ఏర్పడి సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీజీహెచ్‌ను కోవిడ్‌-19 ప్రాంతీయ కేంద్రంగా ప్రభుత్వం మార్చింది.  అందుకు తగిన విధంగా బెడ్లు, వసతులు ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మిగిలిన మూడు ప్రాంతీయ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తికాగా నెల్లూరులో మాత్రం ఇంకా పూర్తి కాలేదు. కొంత మంది వైద్యులు సక్రమంగా పనిచేయకపోవడమే ఇందుకు కారణమని కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు గుర్తించారు.


ఈ నేపథ్యంలో శనివారం నెల్లూరులోని తన క్యాంపు కార్యాలయంలో జీజీహెచ్‌ వైద్యులతో సమావేశమయ్యారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వైద్యుల పాత్ర చాలా కీలకమని, ఎవరు నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హెచ్చరించినట్లు తెలిసింది. ఆ వెంటనే జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌, వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయడం గమనార్హం. సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సాంబశివరావ్‌ను వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా, ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ రాధాకృష్ణరాజును సైక్రియాటిక్‌ విభాగం హెచ్‌వోడీగా బదిలీ చేశారు. కంటి విభాగం హెచ్‌వోడీగా ఉన్న డాక్టర్‌ శ్రీహరికి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యతలు అప్పగించారు. కీలకమైన సమయంలో ఈ బదిలీలు వైద్య శాఖలో కలకలం రేపాయి. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న మరికొంత మందిపై కూడా వేటు వేస్తానని కలెక్టర్‌ హెచ్చరికలు పంపినట్లు సమాచారం. రాష్ట్రంలోనే కరోనా మొదటి పాజిటివ్‌ కేసు నెల్లూరులో నమోదైనప్పటికీ మరోకేసు నమోదు కాకుండా అధికార యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది.


అదే సమయంలో కరోనా బాధితుడు కోలుకుని ఇంటికి చేరడంలో జీజీహెచ్‌ వైద్యుల పాత్ర ఎంతో ఉంది. ఆసుపత్రికి ఎంతో మంది అనుమానితులు వస్తుండగా వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చికిత్స అందిస్తున్నారు. అయితే కరోనా వ్యాప్తి కీలక దశకు చేరుకుంటున్న తరుణంలో వైద్యుల మధ్య వివాదాలు తలెత్తడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార యంత్రాంగం, వైద్య విభాగం కలిసికట్టుగా పనిచేయగలిగితే మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Updated Date - 2020-03-29T11:25:01+05:30 IST