ఐదారుగురికి ఉద్వాసన

ABN , First Publish Date - 2021-07-07T07:56:26+05:30 IST

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు.

ఐదారుగురికి ఉద్వాసన

  • కొత్తగా 24 మందికి చోటు!.. 
  • కీలక శాఖల్లో భారీగా మార్పులు?
  • నేడే కేంద్ర కేబినెట్‌ విస్తరణ!
  • మోదీ మంత్రివర్గంలో యువరక్తం
  • మహిళలు, విద్యాధికులకూ అవకాశం
  • రెండోసారి అధికారంలోకి వచ్చాక తొలి పునర్వ్యవస్థీకరణ
  • కొత్తగా సహకార శాఖ ఏర్పాటు!
  • తెలుగు రాష్ట్రాలకు మొండిచెయ్యే?


కొత్త మంత్రులు

జ్యోతిరాదిత్య సింధియా, శర్వానంద సోనోవాల్‌, పశుపతి పరాస్‌, నారాయణ్‌ రాణే,  వరుణ్‌ గాంధీ, ఆర్సీపీ సింగ్‌, లల్లన్‌ సింగ్‌, ఆర్‌.కె.రంజన్‌ సింగ్‌, రీటా బహుగుణ, పంకజ్‌ చౌదరి, రమాశంకర్‌ కఠేరియా, రాహుల్‌ కశ్వాన్‌, సకల్‌దీప్‌ రాజ్‌భర్‌, శంతన్‌ ఠాకూర్‌, నిశిత్‌ ప్రామాణిక్‌, రాఘవేంద్ర, జితిన్‌ప్రసాద, అనుప్రియ పటేల్‌


న్యూఢిల్లీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. కనీసం 24 మందికి మంత్రివర్గంలో చోటు లభిస్తుందని సమాచారం. పాత మంత్రివర్గంలో ఐదారుగురికి ఉద్వాసన పలుకుతారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. కీలక శాఖలకు సంబంధించి భారీ మార్పులే ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ సీనియర్‌ మంత్రులు సైతం ధ్రువీకరించడం లేదు. ‘నా పెదాలను కట్టేశారు’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలనే కాక 2024 ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ చేపడుతున్నారని, దీంతో మోదీ ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగిపోతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. 2019లో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. కాగా, మంత్రివర్గ విస్తరణకు ముందే మోదీ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం జరిగే అవకాశం ఉందని బీజేపీ నేత ఒకరు తెలిపారు. 


యువత, విద్యాధికులకు ప్రాధాన్యం..

మంత్రివర్గ విస్తరణలో యువత, మహిళలు, బీసీలు, దళితులకు పెద్దపీట వేస్తారని సమాచారం. యువతకు, విద్యాధికులకు అధిక ప్రాధాన్యం కల్పిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పరిపాలనా అనుభవం ఉన్న వారికి కూడా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. పీహెచ్‌డీలు, పోస్టు గ్రాడ్యుయేట్లు, ఇతర వృత్తి నిపుణులు మోదీ మంత్రివర్గంలో స్థానం పొందనునన్నట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో అధిక ప్రాధాన్యం లభించనుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు లేవు. చిన్న కులాలు, వర్గాలకూ అవకాశం ఉంటుందని ఒక సీనియర్‌ నేత చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సహకార విభాగానికి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ‘సహకారంతో సమృద్ధి’ అనే విజన్‌ను నిజం చేయడానికి ఈ శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ శాఖకు మంత్రిని కూడా బుధవారం ప్రకటించనున్నట్లు తెలిపాయి.


రాహుల్‌ను విమర్శిస్తే ప్రమోషన్లు: కాంగ్రెస్‌ 

రాహుల్‌ గాంధీని ట్విటర్‌లో ఎక్కువగా విమర్శించిన మంత్రులకు మోదీ సర్కారు ప్రమోషన్లు ఇస్తోందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు. అధర్మంగా, అనుచితంగా ప్రవర్తించిన గవర్నర్లకు రివార్డులు ఇచ్చిందని విమర్శించారు. రాహుల్‌ గాంధీకి వ్యతిరేకంగా ఎంత ఎక్కువగా ట్వీట్లు చేస్తే మంత్రివర్గంలో అంత ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందని, ఇదే మోదీ సర్కారు విధానమని దుయ్యబట్టారు. కేంద్ర కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణ గురించి విలేకర్లు ప్రస్తావించగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 


కొత్త మంత్రులు వీరే..!

చాలా మంది నేతలకు మంగళవారం మధ్యాహ్నానికే హస్తిన నుంచి వర్తమానం అందినట్లు తెలిసింది. కొందరికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఫోన్‌ చేయగా, మరికొందరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్‌ చేశారు. పిలుపు వచ్చిన వారిలో మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌, లోక్‌ జనశక్తి నేత పశుపతి పరాస్‌, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్‌ రాణే,  మేనకా గాంధీ కుమారుడు వరుణ్‌ గాంధీ, జేడీయూ నేతలు ఆర్సీపీ సింగ్‌, లల్లన్‌ సింగ్‌, మణిపూర్‌కు చెందిన ఆరె.కె.రంజన్‌ సింగ్‌, లఖ్‌నవూ ఎంపీ రీటా బహుగుణ, గోరఖ్‌పూర్‌ ఎంపీ పంకజ్‌ చౌదరి, ఇటావా ఎంపీ రమాశంకర్‌ కఠేరియా, రాజస్థాన్‌ ఎంపీ రాహుల్‌ కశ్వాన్‌, సకల్‌దీప్‌ రాజ్‌భర్‌ తదితరులు ఉన్నారు. 


వీరంతా మంగళవారమే ఢిల్లీ చేరుకున్నారు. బెంగాల్‌కు చెందిన శంతన్‌ ఠాకూర్‌, నిశిత్‌ ప్రామాణిక్‌, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర, ఇటీవల బీజేపీలో చేరిన యూపీ కాంగ్రెస్‌ నేత జితిన్‌ప్రసాద, అప్నాదళ్‌ నేత అనుప్రియ పటేల్‌కు కూడా మంత్రివర్గంలో చోటు దక్కనుంది. కేంద్ర కేబినెట్‌లో 81 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 53 మందే ఉన్నారు. మరో 28 మందిని మంత్రులుగా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గంలో జేడీయూ నుంచి ఎంత మందికి చోటివ్వాలనే అంశంలో మోదీదే తుది నిర్ణయమని, దాన్ని అంగీకరిస్తామని నితీశ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-07-07T07:56:26+05:30 IST