జబ్బుల కాలం జర జాగ్రత్త! ఈ సూత్రాలు పాటిస్తే..!

ABN , First Publish Date - 2022-08-01T18:05:03+05:30 IST

వరుస వర్షాలు కురుస్తున్నాయి. వాటితో పాటే జబ్బులూ

జబ్బుల కాలం జర జాగ్రత్త! ఈ సూత్రాలు పాటిస్తే..!

వరుస వర్షాలతో కలుషితమవుతున్న నీరు   

బయట ఫుడ్‌ తీసుకోవద్దు..   

వాంతులు, విరోచనాలతో ఆస్పత్రులకు.. 

పరిశుభ్రతతో చెక్‌ పెట్టవచ్చంటున్న వైద్యులు


హైదరాబాద్‌ సిటీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): వరుస వర్షాలు(rain) కురుస్తున్నాయి. వాటితో పాటే జబ్బులూ ప్రతాపం చూపుతున్నాయి. వాంతులు.. విరోచనాలు.. కొందరిలో రక్త విరోచనాలు.. ఇలాంటి కేసులు ఇప్పుడు ఆస్పత్రుల్లో పెరుగుతున్నాయి. ఒక్కో వైద్యుడి(Doctor) వద్దకు రోజుకు నాలుగు నుంచి అయిదు వరకు ఇలాంటి కేసులు వస్తున్నాయని, అందులో ఒకరు ఆస్పత్రి(Hospital)లో అడ్మిట్‌ కావాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. వరుస వర్షాలతో తాగునీరు కలుషితం కావడం వల్ల ఈ తరహా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటున్నారు. 


ఈ కాలంలోనే ఇబ్బందులు

వర్షాకాలం.. ఆపై నగరంలో రోజూ ఏదో ఓ ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పలు చోట్ల నీరు కలుషితం అవుతోంది. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం, బయటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు ఎదురవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. మంచినీళ్లు, డ్రైనేజీ పైపులైన్లు కలిసిన చోట కలుషితపు నీళ్లు వచ్చే ముప్పు ఉంటుందని వైద్యులు తెలిపారు. రోడ్డు పక్కన విక్రయించే ఆహార పదార్థాలు, నీళ్లు తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి జబ్బులు వస్తాయని, ప్రధానంగా హైపటైటిస్‌ ఏ, ఈ జబ్బు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 


టైఫాయిడ్‌ ముప్పు

వర్షా కాలంలో వైరల్‌  ఫీవర్లతోపాటు టైఫాయిడ్‌ కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఎక్కువ జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు వంటి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించాలని తెలిపారు. టైఫాయిడ్‌ లక్షణాలు ఉన్న వారు అపరిశుభ్ర చేతులతో తయారైన డ్రింక్స్‌ కానీ, నీరు కానీ తాగినా, ఆహార పదార్థాల్ని ఆ నీరుతో కడిగినా ఇతరులకు టైఫాయిడ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. 


అప్పటి వరకూ బాగానే ఉండి.. 

వాతావరణం మార్పుల వల్ల వైరల్‌ డయేరియా వస్తుంది. అప్పటి వరకు అంతా బాగానే ఉంటారు. అకస్మాత్తుగా వైరల్‌ డయేరియా వస్తుంది. ఇలాంటి వారికి పెథాలజీ పరీక్షలు చేయించాలి. కొందరిలో అకస్మాతుగా ఇన్‌ఫెక్షన్‌ వచ్చి లెప్టోపైరోసి‌స్‌గా తయారై తర్వాత జాండీస్‌గా మారే ముప్పు ఉంటుందని వైద్యులు వివరించారు. ఎక్కువగా ప్రయాణం చేసేవారు బయట నీళ్లు, ఆహారం తీసుకోవడం వల్ల అకస్మాత్తుగా ఈ తరహా సమస్య వస్తుందని చెప్పారు.  ఇలాంటి  వారికి పరీక్షలు చేస్తే హెపటైటిస్‌ ఏ, ఈ ఇన్‌ఫెక్షన్‌ కనిపించదు, కానీ, జాండీస్‌ ఉంటుంది. ఈ సమస్య ఉన్న వారిలో కాలేయం దెబ్బతింటుందని చెప్పారు. ఇలాంటి వారిలో నీళ్ల విరోచనాల సమస్య తీవ్రంగా ఉంటుందన్నారు. నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గడం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రందించాలని సూచించారు. 


హెపటైటిస్‌ ఏ, ఈ 

అపరిశుభ్ర పరిసరాలు, నీరు, ఆహారం వల్ల హెపటైటిస్‌-ఏ, హెపటైటిస్-ఈ, ఇన్‌ఫెక్షన్‌  అమీబియాసిస్‌ రావచ్చు. అందువల్ల ఈ మూడు పరిశుభ్రంగా చూసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, నీరసం, ఆకలి లేకపోవడం, తల తిరగడం, కడుపులో అసౌకర్యంతోపాటు క్రమంగా జాండిస్‌ లాంటి లక్షణాలు బయటపడవచ్చునని హెచ్చరిస్తున్నారు. 


ఇన్‌ఫెక్షన్స్‌ ఇలా..

  • ఇళ్లలో మంచినీళ్లు పట్టుకునే వాటర్‌ ట్యాంక్‌, బిందెలు శుభ్రంగా లేకపోతే నీళ్లు కలుషితంగా మారుతాయి. 
  • సరిగ్గా ఉడకని ఆహార పదార్థాల్ని తీసుకోవడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంది.
  • కడుపు నొప్పితోపాటు నీళ్ళ విరోచనాలు, జ్వరం, వాంతులు లాంటివి ఈ ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలు. 
  • ఈ కాలంలో డీ హైడ్రేషన్‌, టైఫాయిడ్‌, నీళ్ల విరోచనాలు ఎక్కువగా అవుతుంటాయి.  
  • వాతావరణం మార్పు వల్ల అప్పటి వరకు బాగా ఉన్న వారికి అకస్మాత్తుగా డయేరియా వస్తుంది. 
  • బాధితులకు వెంటనే వైరల్‌ పెథాలజీ పరీక్షలు చేయించి కారణం తెసుకోవాల్సి ఉంటుంది. 
  • ఎక్కువగా బయట ఆహారం, నీళ్లు తీసుకునే వారికి డిసెంట్రీ ఇబ్బందులు వస్తాయి.
  • ఎక్కువగా వాంతులు, విరోచనాలు అవుతుంటే వెంటనే వైద్యుడిని సంపంద్రించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. 

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంట పాత్రలు శుభ్రం చేయడానికి పరిశుభ్రమైన  నీటినే వాడాలి.  బయటకు వెళ్లినప్పుడు ఇంటి నుంచి నీళ్లు తీసుకుపోవాలి. బాధితులు కొబ్బరి నీళ్లు, మజ్జిగ తాగాలి.  పండ్లు, కూరగాయలను తినే ముందు నీటితో శుభ్రంగా తుడవాలి.

-డాక్టర్‌ లక్ష్మీకాంత్‌, గ్యాస్ట్రో  ఎంటరాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి





Updated Date - 2022-08-01T18:05:03+05:30 IST