దిశ.. డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-05-27T04:42:16+05:30 IST

మహిళ రక్షణ కోసమని ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌ పోలీసులకు కొత్త కష్టాలను తెప్పించింది.

దిశ.. డ్రైవ్‌
రైల్వేస్టేషన్‌లో పురుషుల స్మార్ట్‌ఫోన్‌లో దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేస్తున్న పోలీసు సిబ్బంది

డౌన్‌లోడ్‌పై సిబ్బందికి టార్గెట్‌

2 లక్షల మందితో చేయించాలని ఆదేశాలు

యాప్‌ లక్ష్య సాధన కోసం రోడ్డెక్కిన పోలీసులు

బాపట్ల టౌన్‌, భట్టిప్రోలు, మే 26: మహిళ రక్షణ కోసమని ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌ పోలీసులకు కొత్త కష్టాలను తెప్పించింది. దిశ యాప్‌తో ప్రజలకు ఒనగూరే ప్రయోజనం ఏమో కాని పోలీసులు రోడ్డెక్కాల్సి వచ్చింది. సాధారణంగా వాహన తనిఖీలకు, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన పోలీసులు రోడ్డుపై వెళ్లే వారందరినీ ఆపి వారి స్మార్ట్‌ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించాల్సి వస్తోంది.  గురువారం ఒక్కరోజు జిల్లాలో ఉన్న 33 పోలీసుస్టేషన్ల పరిధిలో 2 లక్షల మందితో దిశయాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో సిబ్బంది బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లు, చివరకు పొలాల్లో పనులు చేసుకునే వారి వద్దకు వెళ్లాల్సి వచ్చింది. పట్టణ, గ్రామాల ప్రధాన కూడళ్లలో టెంట్లు వేసుకుని  పోలీసు, మున్సిపల్‌, సచివాలయ సిబ్బంది ఆ మార్గంలో పోయే మహిళలతోపాటు పురుషుల స్మార్ట్‌ ఫోన్లలోనూయాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. ఇప్పటికే దిశయాప్‌పై పలు కళాశాలలో విద్యార్థినిలకు అవగాహన కల్పించి డౌన్‌లోడ్‌ చేయించారు. అయినా లక్ష్యాలు సాధించలేదని ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది మండే ఎండల్లోనే రోడ్డుబాట పట్టారు. భట్టిప్రోలు మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో గురువారం అన్ని ప్రభుత్వశాఖల అధికారుల ఆధ్వర్యంలో దిశ యాప్‌ మెగా డ్రైవ్‌ నిర్వహించారు. మండలంలో గురువారం ఉదయం 5  నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించిన మెగా డ్రైవ్‌లో 8,500 ఫోన్లలో దిశ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయించినట్లు ఎస్‌ఐ వై.సురేష్‌ తెలిపారు.  ఈ డ్రైవ్‌ను తహసీల్దార్‌ ఎంఎల్‌ శ్రావణ్‌కుమార్‌, ఎంపీడీవో బాబూరావు తదితరులు పర్యవేక్షించారు.  

లక్షకుపైగా డౌన్‌లోడ్లు : ఎస్పీ వకుల్‌ జిందాల్‌ 

స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా గురువారం ఒక్కరోజే లక్షకు పైగా స్మార్ట్‌ ఫోన్లలో దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినట్లు ఎస్పీ వకుల్‌జిందాల్‌ తెలిపారు. ప్రజలందరి ఫోన్లలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయిస్తున్నామన్నారు.  




Updated Date - 2022-05-27T04:42:16+05:30 IST