ఇంటర్నెట్ డెస్క్: ఆ ఏం కాదులే.. ఎప్పుడూ చేసేదేగా అనుకుంటూ తన బాధ్యత మరిచిపోయిన ఓ యువకుడికి జీవితాంతం గుర్తుండిపోయేలా గుణపాఠం నేర్పారు మధ్యప్రదేశ్లోని డిండోరీ జిల్లా కలెక్టర్. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం నాడు కలెక్టర్ రత్నాకర్ ఝా అక్కడి జిల్లా ఆస్పత్రిలో తనిఖీలకు వచ్చారు. అయితే.. ఆయన రాకను గమనించని ఆ యువకుడు.. గుట్కా నమిలి నేలపైనే ఉమ్మేశాడు. నీట్గా డ్రెస్ చేసుకుని చూడటానికి చదువుకున్న వాడిలా కనిపిస్తున్న ఆ యువకుడిలో.. తప్పు చేస్తున్నానన్న భావన కనిపించనేలేదు. ‘ఇదాంతా సాధారణమే ఎవరేం చేస్తారులే’ అన్నట్టుంది అతడి వాలకం.
ఇదంతా గమనించిన కలెక్టర్ ఆ కుర్రాడికి ఊహించని షాకిచ్చారు. అతడికి ఎదురుపడి.. వెంటనే నేలను శుభ్రం చేయాలని ఆదేశించారు. దీంతో యువకుడు ఒక్కసారిగా బిత్తరపోయాడు! తన వద్ద టిష్యూ కూడా లేకపోవడంతో అతడికి ఏం చేయాలో పాలుపోక బిక్కమొహం వేశాడు. అయితే..కలెక్టర్ మాత్రం ‘చేతితోనే శుభ్రం చేయి’ అని గద్దించడంతో యువకుడు కిమ్మనకుండా.. చేతితోనే శుభ్రం చేశాడు. అక్కడున్న వారు ఈ దృశ్యాలన్నిటినీ రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్గా మారింది.