శిథిలావస్థలో జోనల్‌ భవనం

ABN , First Publish Date - 2022-09-27T06:56:15+05:30 IST

జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనాన్ని నిర్మించి రెండు దశాబ్దాలే అయినప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పిల్లర్లు బీటలు వారాయి.

శిథిలావస్థలో జోనల్‌ భవనం
:పెచ్చులు ఊడడంతో బయటకు కనిపిస్తున్న ఇనుప ఊచలు

 బీటలు వారిన పిల్లర్లు

శ్లాబ్‌ నుంచి ఊడిపడుతున్న పెచ్చులు

భయం భయంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

అరకొర వసతితో అగచాట్లు

అనకాపల్లిఅర్బన్‌, సెప్టెంబరు 26 : జీవీఎంసీ అనకాపల్లి జోనల్‌ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ భవనాన్ని నిర్మించి రెండు దశాబ్దాలే అయినప్పటికీ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో పిల్లర్లు బీటలు వారాయి. శ్లాబ్‌ నుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయి. కొన్నిచోట్ల ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. మరమ్మతులు చేయకపోవడంతో తరచూ పెచ్చులు ఊడుతున్నాయి. వర్షం పడితే శ్లాబ్‌ నుంచి నీటి చుక్కలు పడుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ఈ కార్యాలయంలో ఇంజనీరింగ్‌, శానిటేషన్‌, రెవెన్యూ, టౌన్‌ ప్లానింగ్‌, కమిషనర్‌ ఛాంబర్‌, బిల్లుల వసూలు కేంద్రాలు ఉన్నాయి. వసతి చాలక ఆయా విభాగాల అధికారులు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్ల క్రితం నిర్మించిన మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. పట్టణంలో సేకరించిన చెత్తాచెదారాన్ని తొలుత జోనల్‌ కార్యాలయం పక్కనున్న ఖాళీ స్థలంలో డంప్‌ చేస్తున్నారు. తరువాత ఇక్కడి నుంచి టిప్పర్‌ లారీల ద్వారా కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. దీంతో  కంపోస్టు నుంచి వెలువడుతున్న దుర్వాసనతో సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారు.


Updated Date - 2022-09-27T06:56:15+05:30 IST