నీలగిరిలో డిజిటల్‌ సర్వే

ABN , First Publish Date - 2022-08-06T05:50:13+05:30 IST

నీలగిరిలో డిజిటల్‌ సర్వే చేపట్టనున్నారు.

నీలగిరిలో డిజిటల్‌ సర్వే

సర్వే ఖర్చు రూ.కోటిన్నరపైనే 

ఈ నెల 8 నుంచి ఇంటింటికీ సర్వే బృందం

ముడు నెలల్లోగా పూర్తికానున్న సర్వే 

2015లో చేసిన జీఐఎస్‌ సర్వే వృథానేనా?

రామగిరి, ఆగస్టు 5: నీలగిరిలో డిజిటల్‌ సర్వే చేపట్టనున్నారు. పట్టణంలో ఎన్ని గృహా లు ఉన్నాయి. వాటిలో ఎన్నింటి కి నెంబర్లు ఉన్నాయి, కమర్షియ ల్‌ ఎన్ని, రెసిడెన్షియల్‌ ఎన్ని, ఆ యా ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఉన్నాయా, గృహ నిర్మాణ అనుమతి ఉందా, విద్యుత్‌ కనెక్షన్‌ వంటి ఆంశాలపై సర్వే చేయనున్నారు. పట్టణంలో కొన్ని గృహాలు కమర్షియల్‌ జోన్‌లో ఉన్నా, రెసిడెన్షియల్‌గా ఆస్తి పన్ను చెల్లించడం, అదేవిధంగా కొన్ని ఇళ్లకు రెండు, మూడు నెంబర్లు ఉండడంతో సదరు యజమానులు పన్నును చెల్లించకపోవడం, దీంతోపాటు కొంతమంది ఇంటినెంబర్‌ను తీసుకోకుండా ఉంటూ కార్యాలయంలో చెల్లించే ఆస్తి పన్ను ఎగ్గొడుతున్నారు. ఇలాంటి కారణాలుగా మునిసిపల్‌ కార్యాలయం పెద్ద ఎత్తున ఆదా యం కోల్పోతుంది. ఈ సమస్యలకు చెక్‌ పెట్టేందుకు అధికారులు సర్వేకు శ్రీకారం చుట్టా రు. ఈ మేరకు మునిసిపల్‌ శాఖ ఉన్నతాధికారులు హైదారాబాద్‌కు చెందిన అనంత్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ అనే ప్రైవేట్‌ సంస్థకు డిజిటల్‌ సర్వే చేసే బాధ్యతలు అప్పగించారు. కాగా ఈ సంస్థ హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో సర్వే చేసి విజయవంతం కావడంతో నల్లగొండలో సర్వే బాధ్యతలను కూడా ఆ కంపెనీకి అప్పగించారు. దీంతో నల్లగొండ మునిసిపాలిటీ డిజిటల్‌ సర్వేలో రాష్ట్రంలోనే రెండోది కానుంది. ఈ మేరకు సోమవారం (ఈనెల 8వ తేదీ) నుంచి సర్వే ప్రారంభం కానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 


సర్వే కాలవ్యవధి 90 రోజులు 

పట్టణంలో 48 వార్డుల్లో అధికారికంగా 40వేల పైచిలుకు ఇళ్లు ఉన్నాయి. అనధికారికం గా మరో 20వేల వరకు గృహాలున్నాయి. మొత్తంగా 60వేల గృహాలపై ఈ ప్రైవేట్‌ సంస్థ డిజిటల్‌ సర్వేచేయనుంది. ఒక్కో ఇంటికి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున సర్వే బృందం వచ్చి ఇంటి కొలతలు తీసుకొని, ఆయా ఇళ్లకు గృహ అనుమతి, ఇంటి నెంబర్‌, యజమా ని ఆధార్‌ నెంబర్‌ నల్లా, విద్యుత్‌ కనెక్షన్‌ వంటి వివరాలు సేకరిస్తారు. ఇలాంటి వివరాల తో అక్టోబరు చివరి నాటికి సర్వే పూర్తికానుంది. 


క్రమ పద్ధతిలో ఇంటినెంబర్లు 

డిజిటల్‌ సర్వే ద్వారా ఒకే క్రమపద్ధతిలో ఇంటినెంబర్లను కేటాయించనున్నారు. ఇంటికి పక్కనే ఖాళీ స్థలం ఉంటే, దానికి కూడా నెంబర్‌ కేటాయించనున్నారు. సర్వే బృందం రిపోర్టును మునిసిపల్‌ అధికారులకు అందజేస్తుంది. దాని ఆధారంగా ఆయా గృహాలకు పన్ను నిర్ణయించడంతోపాటు ఇప్పుడున్న నెంబర్‌తోపాటు మరో 3అంకెల కొత్త నెంబర్‌ ఇచ్చేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అధికారికంగా లేని నీటి కనెక్షన్లను క్రమబద్ధీకరించనున్నారు. ఈ కొత్త నెంబర్‌ రావడానికి సుమారు 8నెలలకు పైగా పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సర్వే ద్వారా ఏమైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరించి, నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తారు. ఇదిలా ఉంటే పట్టణంలో 60వేలపై చిలుకు ఉన్న ఇళ్లకు ఒక ఇంటికి రూ.248చొప్పున మొత్తం రూ.1.50కోట్లు ఖర్చు కానుంది. ఇదిలా ఉంటే 2015లో రూ.కోటితో విమాక్స్‌ అనే సంస్థ నీలగిరిలో జీఐఎస్‌ సర్వే నిర్వహించగా, అది ప్రస్తుతం వృథాగా మారింది.


సర్వేకు సహకరించాలి : రమణాచారి, మునిసిపల్‌ కమిషనర్‌  

పట్టణంలో ఈ నెల 8వ తేదీ నుంచి సర్వే ప్రారంభం కానుంది. సర్వేకోసం వచ్చే సిబ్బందికి సహకరించాలి. సర్వే పూర్తయితే ప్రతీ ఇంటితోపాటు ఖాళీ స్థలానికి కూడా క్రమపద్ధతిలో మూడు అంకెల డిజిటల్‌ నెంబర్‌ ఇస్తారు. కొత్త నెంబర్లతో ఆస్తి పన్నుల హెచ్చుతగ్గుల సమస్యలు పరిష్కారం అవుతాయి.  

Updated Date - 2022-08-06T05:50:13+05:30 IST