6నుంచి 10 వరకు డిజిటల్‌ పాఠాలు

ABN , First Publish Date - 2021-06-23T05:30:00+05:30 IST

కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులకు ఇబ్బందులు ఎదురవుతుండగా, పాఠ్యపుస్తకాల ఆధారంగా ఆడియో, వీడియో డిజిటల్‌ పాఠాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది.

6నుంచి 10 వరకు డిజిటల్‌ పాఠాలు
డిజిల్‌ పాఠాలు వింటున్న విద్యార్థి

 క్యూఆర్‌ కోడ్‌ను స్కానచేస్తే ఆడియో, వీడియో
 ఉమ్మడి జిల్లాకు చేరుతున్న పాఠ్యపుస్తకాలు

 భువనగిరి టౌన : కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులకు ఇబ్బందులు ఎదురవుతుండగా, పాఠ్యపుస్తకాల ఆధారంగా ఆడియో, వీడియో డిజిటల్‌ పాఠాలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. 6 నుంచి 10వ తరగతి వరకు ప్రతీ పాఠ్యపుస్తకానికి, ప్రతీ పాఠ్యాంశానికి క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించింది. ఇక ఆనలైన తరగతుల్లో విద్యార్థులంతా భాగస్వాములయ్యేలా తరగతి ఉపాధ్యాయుడు అడ్మినగా ప్రతీ క్లాసు కు ఒక వాట్సప్‌ గ్రూప్‌ను రూపొందిస్తారు.  అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలు దుర్వినియోగం కాకుండా ప్రతీ పుస్తకానికి సీరియల్‌ నెంబర్‌ కేటాయించింది. జూలై 1 నుంచి 2021-22 విద్యాసంవత్సరం ప్రత్యక్ష తరగతులు దశలవారీగా ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాల ప్రారంభ రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించనుంది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాకు 2,29,600 పుస్తకాలు సరఫరా అయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 3529 ప్రభుత్వ, రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉండగా, వాటిలో 2,47,569 మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 110 టైటిల్స్‌తో 14,44,450 పుస్తకాల డిమాండ్‌ ఉంది. కాగా ఇప్పటి వరకు కేవలం 2,29,600పుస్తకాలు మాత్రమే యాదాద్రి, నల్లగొండ, సూర్యాపేట జిల్లా కేంద్రాలకు చేరాయి. మిగతా పుస్తకాలు తరగతులు ప్రారంభమయ్యేనాటికి అందుతాయని అధికారులు అంటున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో సుమారు 900 ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న 2.50లక్షల మంది విద్యార్థులకు సైతం త్వరలో పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు.
25నుంచి పాఠశాలలకు ఉపాధ్యాయులు
ఈ నెల 25నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 1 నుంచి 8, 9, 10 తరగతులకు, 20వ తేదీ నుంచి 6, 7 తరగతులకు, ఆగస్టు నుంచి మిగతా తరగతులకు దశలవారీగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆడియో, వీడియో పాఠాలు ఇలా...
6 నుంచి 10వ తరగతి వరకు ప్రతీ పాఠ్య పుస్తకం ముందు పేజీపై ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ను స్మార్టుఫోనతో స్కాన చేస్తే దానికి సంబంధించిన డిజిటల్‌ పాఠం ఓపెన అవుతుంది. అలాగే పాఠ్యాంశాల వారీగా ముద్రించిన క్యూఆర్‌ కోడ్‌ను మల్టీ స్కాన చేస్తే సంబంధిత పాఠం ఆడియో, వీడియో రూపకంలో వినవచ్చు. గత ఏడాది మాదిరిగానే ఆనలైన తరగతులు నిర్వహించాల్సి వస్తే ప్రతి విద్యార్థిని మానిటరింగ్‌ చేసేలా ఉపాధ్యాయుడు అడ్మినగా తరగతి వారీగా వాట్సప్‌ గ్రూపుల ఏర్పాటు ఈపాటికే మెజార్టీ పాఠశాలల్లో పూర్తయింది. స్మార్ట్‌ ఫోన లేని పిల్లలను ఆ సదుపాయం ఉన్న పిల్లలతో జత చేస్తున్నారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనా ఆడియో, వీడియో పాఠాలు వింటే విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని విద్యావేత్తలు అంటున్నారు.

Updated Date - 2021-06-23T05:30:00+05:30 IST