Abn logo
Jun 22 2021 @ 01:07AM

తవ్వుకో తరలించుకో...

ఇసుక అక్రమ తోలకానికి అధికారుల అండదండలు

మొదలేకాని ప్రభుత్వ పనులకు ముందస్తు అనుమతులు

ఆత్మకూరు(ఉలవపాడు), జూన్‌ 20 : అభివృద్ధి పనులకు ఇసుక తవ్వకం అనుమతి అధికారులకు ఇవ్వడంతో దాన్ని వాళ్లు కల్పతరువుగా మార్చుకుంటున్నారు. జరగని పనులకు అనుమతులిచ్చి యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకంలో భాగస్వాములవుతున్నారు. ఈ అక్రమార్కుల తవ్వకాలతో మండలంలోని ఆత్మకూరు ఇసుక రీచ్‌ గుల్లవుతోంది. నేటికీ మొదలేకాని ప్రభుత్వ భవనాలు, సిమెంట్‌ రోడ్లు, వాటర్‌ ట్యాంక్‌ల నిర్మాణ పనుల పేరుతో అధికారులు ఇసుకను తవ్వించేస్తున్నారు. 

చాగొల్లులో తోలకాలే ఉదాహరణ

చాగొల్లు గ్రామంలో జరిగిన సంఘటనే ఇందుకు ఉదాహరణ.  మొదలేకాని ఆర్‌డబ్ల్యూఎస్‌ పనులకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు, ఎంపీడీవో ఇసుక తవ్వకానికి అనుమతి ఇచ్చారు. ముందస్తుగా 18 ట్రిప్పుల ఇసుక తోలకానికి 5 ట్రాక్టర్లకు అనుమతులిచ్చారు. ఈ అనుమతుల పేరుతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. 

 గ్రామంలో జలజీవన్‌ మిషన్‌ పనుల కోసమని ఈ నెల 18 నుంచి వరుసగా మూడు రోజులలోగా ఇసుక తోలుకోవచ్చని అనుమతి పత్రంలో ఉంది. ఇదే విషయమై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ నాయబ్‌రసూల్‌ని వివరణ అడగ్గా వాటర్‌ ట్యాంక్‌ పనులకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. అయితే ట్యాంక్‌ నిర్మాణానికి స్థల సేకరణ ఎక్కడ జరిగిందో.., కాంట్రాక్టర్‌ ఎప్పుడు పనులు మొదలు పెడతారో కూడా ఆయన స్పష్టం చేయలేదు. గ్రామంలో 18 ట్రాక్టర్ల ఇసుకను ట్యాంకర్‌ కోసం ఎక్కడా డంప్‌ చేసిన దాఖలాలు లేవు. అయితే ఈ పేరుతో  ప్రైవేటు వ్యక్తులకు ఇసుక తరలింపు జరిగింది. రూ. 3వేల నుంచి డిమాండ్‌ను బట్టి రూ. 4వేలకు కూడా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు.  మీకు అనుమతులు ఏవిధంగా లభించాయని ఇసుక రీచ్‌ వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్లను అడగ్గా తమకు తెలియదని సర్పంచ్‌తో మాట్లాడుకోవాలని చాగొల్లు ట్రాక్టర్‌ డ్రైవర్లు సెలవిచ్చారు. ఇదిలా ఉంటే మండలం మొత్తం ఇదేవిధంగా స్థానిక నాయకుల అండదండలతో ప్రభుత్వ భవనాలు, సిమెంట్‌ రోడ్లు నిర్మాణాలను అడ్డుపెట్టుకుని అధికారులను మచ్చిక చేసుకుని అక్రమంగా ఇసుక దందా చేస్తున్నారు. 

కరేడు, అలగాయపాలెం, చాకిచర్ల, రామాయపట్నం గ్రామాల్లో కూడా అభివృద్ధి పనుల పేరుతో ఇసుక వ్యాపారం చేస్తున్నారు. అవినీతి అక్రమ సంపాదనలో అధికార పార్టీ నాయకుల ట్రాక్టర్లలే ఎక్కువ ఉండడం గమనార్హం. 

మన్నేరు పరీవాహక గ్రామాలైన భీమవరం, బద్దిపూడి, ఆత్మకూరుల వద్ద ప్రభుత్వం ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో కూడా ఆత్మకూరు వద్ద ఉన్న ఇసుకకు మంచి డిమాండ్‌ ఉంది. ఇదే అక్రమ సంపాదనకు ప్రధాన వనరుగా మారింది. ఇప్పటివరకు జరిగిన అభివృదిఽ్ధ పనులకు, వాడిన ఇసుకకు మధ్య భారీవ్యత్యాసం ఉందని మన్నేరులో ఏడుఅడుగుల లోతు వరకు ఇసుక తోడేస్తున్నారని దీనిపై ప్రభుత్వం విచారణ చేయిస్తే లక్షల్లో అవినీతి బయటపడుతుందని గ్రామస్థులు చెబుతున్నారు.

వలంటీర్లు, సచివాలయ సిబ్బందీ భాగస్వాములే

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? అన్న చందంగా పై అధికారులు ప్రజాప్రతినిధులు అక్రమ వ్యాపారంలో భాగస్వాములు కావడంతో ఆత్మకూరు పంచాయతీ పరిధిలోని కొందరు వలంటీర్లు, కొంతమంది సచివాలయ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అనుమతులు ఉన్న ట్రాక్టర్ల ఇసుక తోలకం ట్రిప్పులను వలంటీర్లే నమోదు చేసుకోవాల్సి ఉంది. ఇదే కొందరు వలంటీర్లకు కలిసొస్తోంది. ఇసుక ట్రిప్పుల తోలకం సమయంలో తేడా చూపించగలిగితే ఒక్కొక్క ట్రాక్టర్‌కు వలంటీర్‌కి రూ.500 నుంచి రూ.1000 వరకు ముడతాయని గ్రామస్థులు, కొందరు ట్రాక్టర్‌ డ్రైవర్లు పేర్కొంటు న్నారు. సచివాలయ సిబ్బందికి కూడా ఇందులో వాటా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఒక వలంటీర్‌ క్రీయాశీలకంగా ఉంటూ ఈ దందా నడుపుతున్నాడనదే బహరింగ రహస్యమే..