గోవాలో కోవిడ్-19పై పోరుకు సమగ్ర ప్రణాళిక అవసరం : దిగంబర్ కామత్

ABN , First Publish Date - 2020-07-11T21:17:14+05:30 IST

గోవా ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారి కట్టడికి అనుసరిస్తున్న విధానాలను

గోవాలో కోవిడ్-19పై పోరుకు సమగ్ర ప్రణాళిక అవసరం : దిగంబర్ కామత్

పనాజీ : గోవా ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారి కట్టడికి అనుసరిస్తున్న విధానాలను ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ దుయ్యబట్టారు. ఈ మహమ్మారిపై పోరాటానికి సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రణాళికను రూపొందించాలని డిమాండ్ చేశారు. 


దిగంబర్ కామత్ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రణాళికను రూపొందించడానికి ఇంకా ఎందరు మరణించాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రంలో కోవిడ్-19 మృతుల సంఖ్య పెరుగుతుండటంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. గోవా ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య సంరక్షణ ప్రణాళికను తప్పనిసరిగా రూపొందించాలన్నారు. 


మరింత ఆలస్యమవడానికి ముందే కోవిడ్-19 ఆసుపత్రుల నిర్వహణను సైన్యానికి అప్పగించాలన్నారు. రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం, గోవాలో 2,251 కోవిడ్-19 కేసులు ఉన్నాయి. ఈ వ్యాధి కారణంగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2020-07-11T21:17:14+05:30 IST