సిరిసిల్లలో వజ్రోత్సవ సందడి

ABN , First Publish Date - 2022-08-14T06:09:30+05:30 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా (ప్రతి ఇంటా జాతీయ జెండా) అనే నినాదంతో జిల్లాలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

సిరిసిల్లలో వజ్రోత్సవ సందడి
సిరిసిల్లలో బెలూన్లు ఎగురవేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహూల్‌హెగ్డే

 - ఇంటింటా జాతీయ జెండా

- రెపరెపలాడుతున్న జాతీయ పతాకం 

- టీఆర్‌ఎస్‌, బీజేపీ వేర్వేరు కార్యక్రమాలు 

- గ్రామాల్లో ఫ్రీడం రన్‌... ప్రదర్శనలు 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా (ప్రతి ఇంటా జాతీయ జెండా) అనే నినాదంతో జిల్లాలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసాప్తాహా వేడుకలను ప్రారంభించడంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడా చూసినా 75 ఏళ్ల ఉద్యమ స్ఫూర్తి కనబడుతోంది. మహానీయులు త్యాగాలను మదిలో కదలాడుతుంటే త్రివర్ణ పతాకాలు చేతబూని ప్రజాప్రతి నిధులు, అధికారులు, నాయకులు, యువతీయువకులు, విద్యార్థులు భారత్‌మాతాకీ జై అంటూ నినదిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌, బీజేపీ అధ్వర్యంలో వేర్వేరుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామంలో, పట్టణాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడుతోంది. భారీ త్రివర్ణ పతాకాలతో విద్యార్థులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఫ్రీడం రన్‌లు నిర్వహించారు. ఎక్కడా చూసినా త్రివర్ణ పతాకాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు, అజాదీకా అమృత్‌ మహోత్సవంలో మేము సైతం అంటూ కదిలివస్తున్న తీరు దేశభక్తిని చాటుకుంటోంది. శనివారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, చందుర్తి, ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, కోనరావుపేట, బోయినపల్లి, రుద్రంగి మండలాల్లో  ఫ్రీడమ్‌ రన్‌లు నిర్వహించారు. సిరిసిల్లలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహూల్‌హెగ్డే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్లు, అధికారులు బెలూన్లను ఎగురవేసి ప్రీడమ్‌ రన్‌ నిర్వహించారు. పోలీసులు బైక్‌ ర్యాలీ, స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ ర్యాలీ ప్రజాప్రతినిధులు త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారు. ఇల్లంతకుంట ర్యాలీలో ఎమ్మెల్యే రసమయి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వేములవాడలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవితో పాటు కమిషనర్‌ శ్యాంసుందర్‌, కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చందుర్తిలో 75 మీటర్ల జాతీయ పతాకంతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. వివిధ మండలాల్లో ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు భాగస్వాములు అయ్యారు. సిరిసిల్లలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం పాల్గొన్నారు. వజ్రోత్సవాల వేళ టీఆర్‌ఎస్‌ వివిధ విభాగాలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

 తెలంగాణలో వైభవంగా వజ్రోత్సవాలు 

  - జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ

ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్నారని జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ పేర్కొన్నారు. శనివారం బతుకమ్మ ఘాట్‌ వద్ద జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహూల్‌ హేగ్డే, అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌లతో కలిసి ప్రీడమ్‌ రన్‌ను ప్రారంభించారు. జాతీయ సమైక్యతను చాటుతూ బెలూన్లను ఎగురవేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. భావి తరాలకు స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని తెలియజేయడానికి వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరినీ ప్రేరేపించడం వేడుకల ముఖ్య ఉద్ధేశ్యమని అన్నారు. 

సమరయోఽధుల త్యాగ ఫలమే స్వాతంత్య్రం

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగ ఫలంతోనే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా ఈ నెల 8 నుంచి 22వ తేదీ వరకు వజ్రోత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. ప్రతి రోజు 2 వేల మందికి పైగా ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ సినిమాను చూస్తున్నారని అన్నారు. వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రతి రోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 

సామూహిక జాతీయ గీతాలాపనలో భాగాస్వాములు కావాలి

- ఎస్పీ రాహూల్‌హెగ్డే 

స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా, మండల, గ్రామాల్లో సామూహిక జాతీయ గీతాలాపనలో అందరూ భాగస్వాములు కావాలని ఎస్పీ రాహూల్‌హేగ్డే కోరారు. ఈ నెల 16న 11.30 గంటలకు నిర్వహించబోయే గీతాలాపనలో ప్రజలందరూ పాల్గొనాలని అన్నారు. జాతీయ గీతాలాపన చేసే సమయంలో వాహనాల రాకపోకలను నిలిపివేయడం జరుగుతుందని అన్నారు. 

Updated Date - 2022-08-14T06:09:30+05:30 IST