అడ్డగోలు బదిలీలు

ABN , First Publish Date - 2021-04-21T06:18:12+05:30 IST

జిల్లాలో ఉపాధి హామీ పనులతో పాటు ఆసరా పెన్షన్‌ల పంపిణీ ఇతర సబ్సిడీ సంక్షేమ పథకాలను అమ లు చేస్తూ పర్యవేక్షించే జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పరిపాలన గాడి తప్పుతోందంటున్నారు.

అడ్డగోలు బదిలీలు
జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ కార్యాలయం ఇదే

అంతా ఇష్టారాజ్యం

చక్రం తిప్పుతున్న ఓ అధికారి 

డీఆర్డీఏలో వెలుగుచూస్తున్న వాస్తవాలు 

మంచి పోస్టింగ్‌లకు భారీగా పైరవీలు 

వాహనాల వినియోగంపైనా అనుమానాలు 

నిర్మల్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉపాధి హామీ పనులతో పాటు ఆసరా పెన్షన్‌ల పంపిణీ ఇతర సబ్సిడీ సంక్షేమ పథకాలను అమ లు చేస్తూ పర్యవేక్షించే జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పరిపాలన గాడి తప్పుతోందంటున్నారు. గత కొంతకాలం నుంచి ఈ సంస్థలో ఒకరిద్దరు అధికారులు అంతా తామై వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా పరిపాలన సాగిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం అమలుపై పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఆ దిశగా చర్యలు కరువయ్యాయంటున్నారు. అయితే కొద్దిరోజుల నుంచి ఇక్కడి జిల్లా కార్యాలయంలో జరుగుతున్న అక్రమ బదిలీల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. తమకు నచ్చిన వారిని రాజకీయంగా సిఫారసులు పొందిన వారిని సమీప ప్రాంతాల్లోని అనుకూలమైన చోట్లకు బది లీ చేస్తూ గిట్టిని వారిని దూరప్రాంతాలకు బదిలీపై పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉపాధిహామీ పథకంకు సంబంధించిన పనులు అంతటా పెద్దఎత్తున కొనసాగుతున్న క్రమంలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిని బదిలీలు చేయరాదన్న నిబంధన ఉంది. ఈ నిబంధనకు విరుద్ధంగా కొద్దిరోజుల నుంచి సంస్థలో పనిచేసే పలువురిని బదిలీ చేసినట్లు చెబుతున్నారు. ఈ బదిలీల తతంగం వెనక పెద్ద ఎత్తు న రాజకీయ పైరవీలతో పాటు కొంతమొత్తం చేతులు మారినట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. నిబఽంధనలకు విరుద్ధంగా ఓ ఉద్యోగిని బదిలీ చేయడంతో దీనిపై ఆయన ఉన్నతాధికారులను నిలదీసినట్లు తెలిసింది. దీంతో ఉన్నతాధికారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుం డా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.  దీంతో అక్రమంగా బదిలీ అయిన సదరు ఉద్యోగి రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ చీఫ్‌ కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. ఈ ఫిర్యాదుతో అక్రమ బదిలీల వ్యవహారంపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సీరియస్‌ అయినట్లు సమాచారం. మొత్తం బదిలీల వ్యవహారంపై తమకు నివేదిక ఇవ్వాలంటూ జిల్లా స్థాయి అధికారులకు రాష్ట్రస్థాయి అధికారులు హుకూం జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఈ అక్రమబదిలీల వ్యవహారం హాట్‌టాఫిక్‌గా మారిందంటున్నారు. ఇదిలా ఉండగా ఇక్కడి జిల్లా కార్యాలయంలో వినియోగిస్తున్న రెండు వాహనాల వ్యవహారంపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. సంస్థలో పనిచేస్తున్న ఓ అధికారికి సంబంధించిన ఈ వాహనాలను కార్యాలయంలో లీజుకు పెట్టి వాటిని వినియోగించకుండానే బిల్లులు ఎత్తుతున్నట్లు కూడా ఫి ర్యాదులు వస్తున్నాయి. దీనిపై కూడా ఉన్నతాధికారులు లోతుగా విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 

నిబంధనలకు విరుద్దంగా బదిలీలు

ప్రస్తుతం ఉపాధిహామీ పథకానికి సంబంధించిన పనులు జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. అయితే ఈ పనులను డీఆర్డీఏ యంత్రాంగమంతా పర్యవేక్షించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆసరాపెన్షన్‌ల పంపిణీ కూడా కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ఎలాంటి బదిలీలు చేపట్టరాదన్న నిబంధన ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఆ నిబంధనలను పక్కనపెట్టి ఇష్టారాజ్యంగా సిబ్బందిని బదిలీ చేసినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సంస్థ జిల్లా కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి అంతా తానై ఈ బదిలీల వెనక చక్రం తిప్పుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇలాగే అక్రమబదిలీలు జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ సారి రాజకీయంగా సిఫారసులున్న వారినే కాకుండా పెద్దమొత్తంలో చేతులు తడిపిన వారికి నిబంధనలు పక్కన పెట్టి బదిలీలు చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

కమిషనర్‌కు ఫిర్యాదుతో కదులుతున్న డొంక

జిల్లా డీఆర్డీఏలో జరిగిన అక్రమబదిలీల తతంగంపై ఆ సంస్థలో పని చేసే ఓ ఉద్యోగి ఏకంగా రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్‌కు స్వయంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుతో కమిషనర్‌ అక్రమ బదిలీలపైనే కాకుండా అక్రమంగా వినియోగిస్తున్న వాహనాలపై కూడా విచారణ జరిపేందుకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో మొత్తం బదిలీల గుట్టురట్టయ్యే అవకాశాలున్నాయంటున్నారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న వారి సిఫారసుల మేరకే ఈ బదిలీల ప్రక్రియ జరిగిందంటున్నారు. దీర్ఘకాలం నుంచి ఇక్కడి జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న ఒకరిద్దరు ఉన్నతాధికారులకు రాజకీయం అండదండలు పుష్కలంగా ఉన్న కారణంగానే ఇలా నిబంధనల అతిక్రమణ జరుగుతోందంటున్నారు. దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న ఈ అధికారులు తమ మాటవినని ఉద్యోగులు, సిబ్బందిపై వేధింపులకు సైతం పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. 

వాహనాల వినియోగంపైనా అనుమానాలు

డీఆర్డీఏలో వినియోగిస్తున్న రెండు వాహనాల వ్యవహారంపై కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యాలయంలో పనిచేసే ఓ అధికారికి చెందినవిగా చెబుతున్నారు. సదరు అధికారి ఈ వాహనాలను ఎటు తిప్పకుండానే ప్రతినెల బిల్లులు డ్రా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వాహనాల అక్రమ వినియోగంపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. పనిలో పనిగా ఇటు అక్రమబదిలీలపైనే కాకుం డా వాహనాలకు సంబంధించి బిల్లుల డ్రాపై కూడా విచారణ జరగనున్నట్లు సమాచారం. అలాగే మరికొంతమంది అధికారులు కూడా తమ సొంత వాహనాలను వినియోగించి అక్రమంగా బిల్లులు డ్రా చేస్తున్నట్లు కూడా విమర్శలున్నాయి. ఉపాధిహామీ పనుల పర్యవేక్షణతో పాటు డీఆర్డీఏ ద్వారా అమలవుతున్న పథకాల పర్యవేక్షణ కోసం ఈ వాహనాలను వినియోగిస్తున్నట్లు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం అంది స్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి ఇలా అక్రమ తంతు కొనసాగుతున్నప్పటికీ అధికారులకున్నా పలుకుబడి, పరపతి కారణంగా ఆరోపణలపై విచారణలు గాని చర్యలు గాని జరగడం లేదంటున్నారు. మొత్తానికి జిల్లా డీఆర్డీఏలో కొనసాగుతున్న అక్రమ బదిలీల తతంగంతో పాటు వాహనాల వినియోగంపైనా జరగబోతున్న విచారణ మరిన్ని ఆస క్తికరమైన అంశాలను వెలుగులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

నిబంధనల ప్రకారమే బదిలీల ప్రక్రియ చేపట్టాం

ఈ విషయమై డీఆర్డీఓ వెంకటేశ్వర్లును సంప్రదించగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకే బదిలీల ప్రక్రియ చేపట్టామని తెలిపారు. తాము చేపట్టిన బదిలీల్లో ఎలాంటి అక్రమాలు జరగలేవని తెలిపారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అవసరమైన సిబ్బందిని మాత్రమే బదిలీ చేయడం జరిగిందని ఆయన వివరించారు. పెంబి మండలంలో పని చేస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ సస్పెండ్‌ కావడంతో ఆ పోస్టును నిబంధనల మేరకే భర్తీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

Updated Date - 2021-04-21T06:18:12+05:30 IST