రైతుల ఉద్యమానికి మద్దతివ్వాలి

ABN , First Publish Date - 2021-01-19T05:16:18+05:30 IST

ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి జిల్లా ప్రజలు మద్దతు తెలుపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు.

రైతుల ఉద్యమానికి మద్దతివ్వాలి
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న రామకృష్ణ.

26న ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ


నెల్లూరు(వైద్యం), జనవరి 18 : ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి జిల్లా ప్రజలు మద్దతు తెలుపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ పిలుపునిచ్చారు. నెల్లూరులోని శాంతి కల్యాణ మండపంలో సోమవారం రైతు, ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా ఈ నెల 26న జిల్లాలో జరిగే భారీ ట్రాక్టర్‌ ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. నూతన వ్యవసాయ చట్టాల పేరుతో ప్రధాని మోదీ కార్పొరేట్‌ మిత్రులకు వ్యవసాయ రంగాన్ని దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.  కేవలం రెండు రాష్ట్రాల రైతులు మత్రమే ఉద్యమాలు చేస్తున్నారని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు అనడం సిగ్గుచేటన్నారు. రైతుల ఉద్యమానికి మద్దతుగా దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతుంటే కేంద్రం కళ్లకు గంతలు కట్టుకుందా అంటూ ప్రశ్నించారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు రావుల అంకయ్య, రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కార్యదర్శి చిరసాని కోటిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, సుధాకర్‌రెడ్డి, తెలుగు రైతు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణం నాయుడు, నెల్లూరు ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేసీ పెంచలయ్య, కాంగ్రెస్‌ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు ఏటూరి శ్రీనివాసులు రెడ్డి, సీపీఐ నేతలు దామా అంకయ్య, అరిగెల నాగేంద్రసాయి, రామరాజు, పార్థసారధి, డేగా సత్యనారాయణ, మునీర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-19T05:16:18+05:30 IST