ధరణి షురూ..

ABN , First Publish Date - 2020-11-03T09:44:53+05:30 IST

రెవెన్యూ సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ‘ధరణి’ పోర్టల్‌ సేవలు రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమయ్యాయి

ధరణి షురూ..

రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో  తొలిరోజు విజయవంతం 


రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ర్టేషన్లు షురూ అయ్యాయి. సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ లాంఛనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లాలో 7, వికారాబాద్‌ జిల్లాలో 5, మేడ్చల్‌ జిల్లాలో 2 రిజిస్ర్టేషన్లు జరిగాయి.. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించారు. తొలిరోజు చిన్నచిన్న సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ అన్నిచోట్ల రిజిస్ట్రేషన్లు విజయవంతంగా పూర్తయ్యాయి.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి) : రెవెన్యూ సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన ‘ధరణి’ పోర్టల్‌ సేవలు రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమయ్యాయి. తొలి రోజు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అన్నిచోట్ల ప్రారంభిం చారు. కొత్త విధానంలో 20నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్‌ తోపాటు మ్యుటేషన్‌ కూడా చేశారు. రాష్ట్రప్రభుత్వ ప్రఽధానకార్యదర్శి సోమేష్‌ కుమార్‌ శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ధరణి ద్వారా తొలి గిఫ్ట్‌ డీడీ రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న మంచాల ప్రశాంతికి సీఎస్‌ సోమేష్‌కుమార్‌ అందచే శారు.


ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్‌రోస్‌, జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ హరీష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలిరోజు జిల్లావ్యాప్తంగా ఏడు స్లాట్లు బుక్‌కాగా ఇందులో ఏడు రిజిస్ట్రేషన్లు జరిగాయి. సాంకేతిక కారణాల వల్ల మాడ్గుల మండలంలో రెండు రిజిస్ట్రేషన్లు సకాలంలో జరగలేదు. డిజిటల్‌ కీ ఓపెన్‌ కాకపోవడంతో ఇక్కడ స్లాట్లు బుక్‌చేసుకున్న వారు సాయంత్రం వరకు వేచి చూశారు. ఎట్టకేలకు అఽధికారుల ప్రయత్నంతో  రాత్రి ఏడుగంటలకు ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ధరణి సేవలు ప్రారంభమ య్యాయి. అయితే అనేకచోట్ల కనీసం ఒక్క స్లాట్‌ కూడా బుక్‌ కాలేదు. కేవలం ఆరుమండలాల్లో మాత్రమే స్లాట్లు బుక్‌ అయ్యాయి. మాడ్గుల్‌లో రెండు, ఆమన్‌గల్‌, శంషాబాద్‌, చేవెళ్ల, కొందుర్గు, కొత్తూరు మండలాల్లో ఒక్కో స్లాట్‌ బుక్‌ అయ్యింది. చిన్నచిన్న సాంకేతిక సమస్యలు వచ్చినప్పటికీ అన్నిచోట్ల తొలిరోజు రిజిస్ట్రేషన్లు విజయవం తంగా పూర్తయ్యాయి. నేటినుంచి రిజిస్ట్రేషన్లు ముమ్మరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ధరణి పోర్టల్‌ను అమల్లోకి తెచ్చేందుకు రాష్ట్ర ఫ్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల రిజిస్ట్రేషన్లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ధరణి పోర్టల్‌ అమల్లోకి రావడంతో తొలిగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ కొత్త విధానంలో ఒకేసారి రిజిస్ట్రేషన్‌తోపాటు మ్యుటేషన్‌ కూడా చేస్తున్నారు. దీంతో ప్రజలకు కష్టాలు తగ్గి సులువుగా భూముల రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు. 


మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో...(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి)

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు ప్రారంభమయ్యాయి. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలోని అన్ని మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ను అందుబాటులో ఉంచారు. శనివారం నుంచి స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సోమవారం రిజిస్ర్టేషన్ల ప్రక్రియ తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రారంభమైంది. మొదటిరోజు కావడంతో జిల్లాలో వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లకు స్లాట్లు పెద్దగా బుకింగ్‌ చేసుకోలేదు. ముఖ్యమంత్రి ధరణిని ప్రారంభించిన మూడుచింతలపల్లి మండలంలో మొదటిరోజు స్లాట్లు బుకింగ్‌ కాలేదు. శామీర్‌పేట్‌ మండలంలో మాత్రం రెండు స్లాట్లు బుక్‌ అయ్యాయి. రఘుపతిరెడ్డి, నాగసాయి ప్రియాంకరెడ్డి అనే వ్యక్తులు భూమిని కొనుగోలు చేశారు. రిజిస్ర్టేషన్‌ అయిన వెంటనే ఆన్‌లైన్‌లో డ్రాఫ్ట్‌ పాస్‌బుక్‌ ప్రింటింగ్‌ వచ్చింది. మరొకరికి రిజిస్ర్టేషన్‌ అయినప్పటికీ ప్రింటింగ్‌ రాలేదు.


దీంతో తహసీల్దార్‌ సురేందర్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సర్వర్‌ డౌన్‌గా ఉండటంతో ధరణి వెబ్‌సైట్‌ ఆలస్యంగా తెరుచుకుంటుంది. ఎలాంటి సాంకేతిక సమస్య రానిపక్షంలో 20నిమిషాల్లో  రిజిస్ర్టేషన్‌  ప్రక్రియ పూర్తవుతుంది. జిల్లాకలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు మేడ్చల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి, ధరణి పనితీరును పరిశీలించారు. రైతులకు రిజిస్ర్టేషన్లపై ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే... నివృత్తి చేయాలని సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ కె.విద్యాసాగర్‌, కీసర ఆర్డీవో ఎన్‌.రవి శామీర్‌పేట్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. సాంకేతిక సమస్యపై ఆరా తీశారు. చిన్న సాంకేతిక సమస్యల వల్ల ప్రింట్‌ రాలేదని, వెంటనే పరిష్కారం అవుతుందని వివరించారు. 


పది నిమిషాల్లో భూ రిజిస్ర్టేషన్‌ - కొట్ర అర్పిత , ఆకుతోటపల్లి, ఆమనగల్లు

ఆమనగల్లు : ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లికి చెందిన తెల్గమల్ల జైపాల్‌ వద్ద నెలరోజుల క్రితం 1.22ఎకరాల భూమిని కొనుగోలు చేశాను. ఆదివారం రిజిస్ర్టేషన్‌కు ఇంటివద్దే స్లాట్‌ బుక్‌ చేశాను. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లగా పది నిమిషాల్లో రిజిస్ర్టేషన్‌ పూర్తయింది. వెంటనే మ్యుటేషన్‌ చేసి ఆర్‌ఓఆర్‌, పహాణి పత్రాలు అందజేశారు. ఆన్‌లైన్‌లోనే అన్ని రుసుముల కింద రూ.11,796 చెల్లించాను. అదనంగా ఒక్క రూపాయి కూడ ఖర్చు కాలేదు. ఈప్రక్రియ చాలా బాగుంది. 

Updated Date - 2020-11-03T09:44:53+05:30 IST